ప్రధాన ప్రతిపక్షం తరహాలో వ్యవహరించండి
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ప్రధానప్రతిపక్షం తరహాలోనే పోరాడాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టీటీడీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంతో కుమ్మక్కైనట్టుగానే వ్యవహరిస్తున్నందున టీడీపీ ఎమ్మెల్యేలు మరింత దూకుడుగా వ్యవహరించాలని ఆదేశించారు. పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ గడువు ముగిసి గురువారం నుంచి శాసనసభకు వెళ్లనున్న నేపథ్యంలో ఏపీ సచివాలయంలోని తన చాంబర్లో టీ.నేతలతో సమావేశమయ్యారు.
టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, శాసనసభా పక్షంనేత ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉపనేత ఎ.రేవంత్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆర్. కృష్ణయ్య, జి. సాయన్న, మంచిరెడ్డి కిషన్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, మాగంటి గోపీనాథ్ తదితర ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సమావేశంలో ఆయన సభలో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. సస్పెన్షన్కు ముందు టీడీపీ ఎమ్మెల్యేలు సభలో వ్యవహరించిన తీరు సంతృప్తికరంగా ఉందని, అధికారపక్షాన్ని ఇరకాటం పెట్టడంలో రేవంత్రెడ్డి, దయాకర్రావు వంటి నాయకులు సక్సెస్ అయ్యారని అభినందించారు.
టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్, మండలి చైర్మన్లను ఎందుకు కలవలేదని ప్రశ్నించినట్లు సమాచారం. స్పీకర్, మండలి చైర్మన్లు స్పందించని పక్షంలో కోర్టుకు వెళ్లాలని సూచించారు. ‘ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్యకు, సాగునీరు, ఇతర సమస్యలకు ఏపీ ప్రభుత్వమే కారణమని భావిస్తే టీడీపీ తరపున మీరే ఆ ప్రభుత్వంపై కేసు దాఖలు చే యండి. పార్టీ , ప్రాంతం , ప్రభుత్వం వేర్వేరు అనే సందేశాలను పంపండి’ అని ఆదేశించారు.