‘సింగం’ సీక్వెల్స్ కొనసాగిస్తా
‘సింగం’ సీక్వెల్స్ కొనసాగించేందుకే తాను మొగ్గు చూపుతున్నట్లు డెరైక్టర్ రోహిత్ శెట్టి చెప్పాడు. ఇంతకుముందు తాను తీసిన సూపర్ హిట్ చిత్రం ‘సింగం’కు సీక్వెల్‌గా తీసిన ‘సింగం రిటర్న్స్’ వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రాబోతోంంది. కాగా, ఈ సినిమాపై ఆయన స్పందిస్తూ.. ‘నేను ఇంతకుముందు గోల్మాల్ సీరీస్, ఆల్ ది బెస్ట్ వంటి కామెడీ సినిమాలు తీశాను. మొదటిసారి ‘సింగం’ వంటి యాక్షన్ సినిమాకు దర్శకత్వం వహించాను. అది ప్రేక్షకుల మన్ననలను పొందింది. అందుకే దానికి సీక్వెల్‌గా ఇప్పుడు ‘సింగం రిటర్న్స్’ తీశాను.
ఇది కూడా ప్రేక్షకుల మన్ననలు పొందుతుందనే విశ్వాసం ఉంది. అయితే సీక్వెల్ పేరిట ఒకే విషయాన్ని పదేపదే చూపిస్తే ప్రేక్షకులు తిరస్కరించే అవకాశం ఉంది.. అందుకే ఈ సినిమాను కొత్త కథాంశంతో తెరకెక్కించాం.. ఇందులో సూపర్‌స్టార్ అజయ్ దేవగన్ నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్‌గా అద్భుతంగా నటించారు. ఇందులో అతని పాత్ర ఏసీపీ బాజీరావ్ సింగం.. ముంబై నగరంలో క్రైం ప్రపంచాన్ని గడగడలాడించే పవర్ఫుల్ పాత్ర అది.. అంతకుముందు ‘సింగం’ సినిమాలో అజయ్ గోవాలో ఏసీపీగా కనిపించారు..’ అని తెలిపారు. సింగం సినిమాలో హీరోయిన్ కాగల్ అగర్వాల్ కాగా, సీక్వెల్ సింగం రిటర్న్స్‌లో కరీనా కపూర్ ఖాన్ ప్రధానపాత్ర పోషించింది.
దీనిపై రోహిత్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో కథాంశం మారుతుంది. అందుకే హీరోయిన్ను మార్చామన్నారు. ఈ సినిమాలో ‘విలన్’గా నటుడు, డెరైక్టర్ అమోల్ గుప్తాను తీసుకున్నారు. అమోల్‌ను విలన్‌గా తీసుకోవాలని మొదట తాను అనుకోలేదని రోహిత్ చెప్పారు. తన అసిస్టెంట్ డెరైక్టర్ ఒకరు ఇచ్చిన సలహా మేరకు అమోల్‌ను విలన్ పాత్రకు ఎంపిక చేశామన్నారు. అమోల్ తీసిన కామిని సినిమా చూశానని, చాలా బాగుందని రోహిత్ కితాబిచ్చారు.ఇదిలా ఉండగా, సింగం రిటర్న్స్‌ను కథాంశం డిమాండ్ మేరకు వాస్తవ ప్రదేశాల్లోనే చిత్రీకరించామని రోహిత్ వివరించారు. దీనికోసం చాలా శ్రమించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. మహీంలోని మఖ్దూమ్షా బాబా దర్గా, గేట్‌వే ఆఫ్ ఇండియా, కాటన్ గ్రీన్,రియే రోడ్ వంటి పలు ప్రాంతాల్లో షూటింగ్ చేసేందుకు మహారాష్ట్ర హోం మంత్రి, పోలీసులు ఇచ్చిన సహకారం మరవలేనిదన్నారు.