Director selvaraghavan
-
దేవుడు ఒకటి తీసుకుంటే మరోటి ఇస్తాడు
‘‘దేవుడు మన దగ్గరి నుంచి విలువైనది ఏదైనా తీసుకున్నాడంటే మనల్ని ఉత్సాహపరచడానికి భారీ మోతాదులో మరోటి ఇస్తాడు’’ అన్నారు దర్శకుడు సెల్వ రాఘవన్. ‘పుదుపేటై్ట, 7/జీ రెయిన్బో కాలనీ (తెలుగులో 7/జీ బృందావన కాలనీ), అయిరత్తిల్ ఒరువన్ (తెలుగులో యుగానికి ఒక్కడు), వెంకటేష్‌తో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి సినిమాలు తీశారు సెల్వ. ప్రస్తుతం ఓ ఎన్జీవోతో కలసి సోషల్ మీడియాలో ‘కైండ్‌నెస్ చాలెంజ్’లో పాల్గొన్నారాయన. ఈ సవాల్‌కి సై అన్నవాళ్లు ఏం చేయాలంటే.. తమ చిన్ననాటి ఫొటో ఒకటి పోస్ట్ చేసి, ఆ వయసులో ఎదురైన చేదు అనుభవాలకు ఇప్పుడు ధైర్యం చెబుతూ ఓ లేఖ రాయాలి. ఆ వయసులో ఉన్న చిన్ననాటి మనకి ఇప్పుడు మనం ఏదైనా సలహా ఇవ్వాల్సి వస్తే ఏమిస్తాం? అనేది ఆ చాలెంజ్. ఈ చాలెంజ్‌లో పాల్గొన్న సెల్వ తన చిన్ననాటి (14 ఏళ్ల వయసులో దిగినది) ఫొటోను పోస్ట్ చేసి ఈ విధంగా రాసుకొచ్చారు. ‘‘ప్రియమైన సెల్వా (వయసు 14), ప్రపంచం నీ వైకల్యం (సెల్వకి ఒక కన్ను సరిగ్గా ఉండదు) చూసి నవ్వుతోంది. నీ కన్ను సరిగ్గా లేదని, సరిగ్గా చూడలేవని అందరూ నిన్ను విచిత్రంగా చూస్తారు. ప్రతి రాత్రి ఆ విషయాలను, ఆ అవమానాలను తలచుకొని నువ్వు ఏడుస్తూ ఉంటావు. దేవుడా... నన్ను ఎందుకు ఇలా చేశావు? అని ఆయన్ని ప్రశ్నిస్తావు. కానీ జీవితంలో ముందుకు వెళ్లడానికి భయపడకు. అధైర్యపడకు. సరిగ్గా పదేళ్లలో నువ్వో బ్లాక్‌బస్టర్ సినిమా రాసి, డైరెక్ట్ చేయబోతున్నావు. ఆ సినిమా నీ జీవితాన్ని మార్చేస్తుంది. అప్పుడు ఎంతో మంది నీవైపే చూస్తారు. ఈసారి చిన్నచూపో, హేళన భావమో ఆ చూపులో ఉండదు. కేవలం గౌరవం, ఆరాధన ఉంటాయి. ఆ తర్వాత వరుసగా పదేళ్లు నువ్వు తీసే ప్రతి సినిమా క్లాసిక్ అంటారు. ట్రెండ్ సెట్టర్స్ అంటారు. నిన్నో మేధావి అంటారు. అప్పుడు నిన్ను కంటి చూపుతో బాధపడ్డ కుర్రాడిగా ఎవరూ చూడరు. నీ సినిమాలతో వాళ్ల జీవితాల్లో ఏదో మార్పు తీసుకొచ్చిన దర్శకుడిలానే చూస్తారు. అందుకే అబ్బాయ్... భయపడకు. ధైర్యంగా ఉండు. ఫొటోలకు నవ్వుతూ పోజు ఇవ్వు. నువ్వు నవ్వుతున్న ఫొటో ఒక్కటి కూడా లేదు నా దగ్గర. త్వరలోనే నువ్వు చాలా ఫొటోలు దిగాలి. నిన్ను నువ్వు ప్రేమించు’. ఇట్లు.. సెల్వ రాఘవన్ (వయసు 45). ఈ లేఖలో ఇప్పటి 45 ఏళ్ల సెల్వరాఘవన్ అప్పటి 14 ఏళ్ల సెల్వాకి స్ఫూర్తి నింపే మాటలు చెప్పారు. ఈ మాటలు సెల్వాలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నవారికి స్ఫూర్తిగా నిలుస్తాయి. ఈ చాలెంజ్ ఆశయం అదే. -
మళ్లీ ఆయనే ఇచ్చారు
సిఫారసులు బాగా పనిచేస్తాయి. అయితే అందుకు నేమ్, ఫేమ్ ఉండాలన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా విషయానికి వస్తే సిఫారసుల విషయంలో కథానాయకుల ప్రభావం చాలా ఉంటుంది. అయితే చాలా మంది ఈ విషయాన్ని ఒప్పుకోరు. ముఖ్యంగా కథానాయికల విషయంలో వారి జోక్యం ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. కోలీవుడ్‌లో టాప్ కమెడియన్‌గా ఎదిగిన నటుడు సంతానం ఇటీవల హీరోగా మారి వరుస విజయాలను అందుకుంటున్నారు. ఇటీవల ఆయన హీరోగా నటించిన దిల్లుకు దుడ్డు చిత్రం కలెక్షన్ల పరంగా ఇరగదీసింది. సంతానం ఆరంభంలో హీరోగా నటించిన వల్లవనుక్కుమ్ పుల్లుమ్ ఆయుధం, ఇనిమే ఇప్పడిదాన్ చిత్రాల్లో ఆయనకు జంటగా నటి ఆస్నా జవేరి నటించారు. ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్నే సాధించాయి. సంతానం.. నటి ఆస్నా జవేరికి సిఫారసులు చేస్తున్నారనే ప్రచారం జరిగింది. అంతే కాదు ఆ చిత్రాల హీరోహీరోయిన్లు సంతానం, ఆస్నా జవేరిలపై వదంతులు వెల్లువెత్తాయి. దీంతో సంతానం తదుపరి చిత్రాల్లో ఆస్నా జవేరి కనిపించలేదు. సంతానం కావాలనే పక్కన పెట్టినట్లు గుసగుసలు వినిపించాయి. అయినా కోలీవుడ్‌ను వదిలి వెళ్లని ఉత్తరాది భామ ఆస్నా జవేరి ఇక్కడే మకాం వేసి అవకాశాల వేటలో పడ్డారు. అలా ఒక చిత్రం అవకాశాన్ని సంపాదించుకున్నారు కూడా. ప్రస్తుతం తను మీన్కుళంబుమ్ మనపాలైయం అనే చిత్రంలో కాళిదాస్ జయరాం సరసన నటిస్తున్నారు. అయితే కొత్త అవకాశాలేమీ రాకపోవడంతో మళ్లీ సంతానంను ఆశ్రయించి సిఫారసు చేయమని అడిగారట. ప్రస్తుతం విజయాల జోరులో ఉన్న సంతానం త్వరలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇంకా కొన్ని కథలు వింటున్నారు. ఒక నూతన దర్శకుడి చిత్రంలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.అంతే కాదు అందులో ఆయనకు జంటగా ఆస్నా జవేరిని సిఫారసు చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మొత్తం మీద మూడో సారి సంతానంతో జతకట్టడానికి ఆస్నాజవేరి రెడీ అవుతున్నారన్న మాట. -
ఆయన భార్యకు ఇష్టమైతే..నటించడానికి ఓకే
జీవితంలో అనుభవాలకు మించిన పాఠాలు ఉండవని చెప్పడం అతిశయోక్తి కాకపోవచ్చు. అలా పరిణితి పొందిన నటి సోనియా అగర్వాల్. ఆది నుంచి విజయపరంపరను కొనసాగించిన ఈ ఉత్తరాది బ్యూటీ దర్శకు డు సెల్వరాఘవన్‌ను ప్రేమించి పెళ్లాడిన తరువాత జీవితంలో కాస్త తడబడ్డారు. అందుకు మూల్యం భారీగానే చెల్లించుకోవాల్సి వచ్చింది. మనస్పర్థలు, పెళ్లి విడాకులు సోనియాను బాధించాయనే చెప్పాలి. మళ్లీ నటనపై దృష్టి సారించిన సోనియా అగర్వాల్‌కు ఇటీవల హాస్య నటుడు వివేక్ సరసన నటించిన పాలక్కాట్టు మాధవన్ చిత్రంలో నటనకు మంచి గుర్తింపే లభించింది. ఈ సందర్భంగా ఈ భామ తో చిన్న భేటీ ప్రశ్న: డ్రీమ్ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న మీరు నటి సదా ఇప్పుడు హాస్యనటుల సరసన నటిస్తున్నారే? జ: కలలరాణి, అందాల దేవతలుగా మేము పే రు తెచ్చుకుని ఉండవచ్చు. ఇప్పుడు సినిమా పూర్తిగా మారి పోయింది. చాలా చిత్రాల్లో కథానాయికలు వేరే మాదిరిగా నటిస్తున్నా రు. నటి త్రిష ఎన్నై అరిందాల్ చిత్రంలో తల్లిగా నటించారు. నాకిప్పుడు 33 ఏళ్ల వయసు. ఈ వయసుకు ఏతరహా పాత్ర ల అవకాశాలు వస్తాయో అవే చేయగ లం. 16 ఏళ్ల అమ్మాయిలా స్క్రీన్ మీద కనిపించలేం కదా? నాకు తెలిసి ఇప్పుడు కథ, పాత్రలే ముఖ్యం. మేమంతా పాత్రదారులం అంతే. ప్రశ్న: విద్యాబాలన్ లాంటి తారలు చాలెంజింగ్ పాత్రలు చేస్తున్నారు. మీరు అలాంటి పాత్రలు చేయాలని ఆశిస్తున్నారా? జ: రిస్క్ చేయడం అంటే సహజంగానే ఇష్టం.విద్యాబాలన్, కంగనా రావత్ తరహాలో చిత్రాలు చేయడానికి నేనేప్పుడూ సిద్ధమే. ప్రశ్న: దర్శకుడు సెల్వరాఘవన్ నుంచి విడిపోయిన తరువాత ఒంటరి జీవితం సంతోషంగా ఉందా? కష్టం అనిపిస్తోందా? జ : నాకు ఒంటరిగా ఉంటున్నాననే భావనే కలగలేదేప్పుడూ. నా చుట్టూ ఎప్పుడూ నా నట బృందం ఉంటుంది. నేనాయన్ని మిస్ చేసుకున్న విషయం నిజమే. అయితే అందుకు బాధ పడలేదు. ఒక బ్రేక్అప్ అంతే. అయినా అదే నిర్ణయం కాదు. నా కుటుంబం, బంధువులతో సంతోషంగా జీవిస్తున్నాను. చెన్నైలోనే నివశిస్తున్నాను. ఇక్కడే నటిస్తున్నాను. ప్రశ్న: సరే దర్శకుడు సెల్వరాఘవన్ మళ్లీ చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రంలో అవకాశం వస్తే నటిస్తారా? జ : ఇప్పటి వరకూ ఆ చిత్రంలో నటించమని నన్ను ఎవరూ అడగలేదు. సెల్వరాఘవన్ మరో పెళ్లి చేసుకున్నారు. పిల్లలున్నారు. ఆయన చిత్రంలో నటించాలని నాకూ చాలా ఆశే. అయితే నేను నటించడం ఆయన భార్యా ఇష్ట పడాలి. ఆమె ఎలాంటి సమస్య ఉండదని భావిస్తే నేను తప్పకుండా నటిస్తాను. ప్రశ్న: నటుడు ధనుష్ గురించి? జ: ధనుష్ మంచి నటుడు. ప్రతిభావంతుడు. నాకు మంచి మిత్రుడు. మా మధ్య ఎలాంటి సమస్యలు లేవు. ఒకే రంగంలోనే ఉన్నాం కదా?ఆయనతో నటించే అవకావం మరోసారి వస్తే తప్పకుండా నటిస్తా. ప్రశ్న: చాలా మంది నటీమనులు నటన కాకుండా వేరే వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. మీకు అలాంటి ఆలోచన లేదా? జ: చండీగర్లో లెదర్ ఫ్యాక్టరీ ప్రారంభించనున్నాను. ఆ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఆగస్టులో ఆ వ్యాపారం ప్రారంభమవుతుందని భావిస్తున్నాను. ఒక పక్క నటన, మరో పక్క వ్యాపారం అంటూ ప్లాన్ చేస్తున్నాను. ప్రశ్న: మళ్లీ వివాహం చేసుకునే ఆలోచన ఉందా? జ: ఎమీ నిర్ణయించు కోలేదు. అయితే మంచి వ్యక్తి దొరికితే, నా గురించి తనూ, ఆయన గురించి నేను పూర్తిగా తెలుసుకుని ఒకరినొకరు అర్థం చేసుకుంటే తప్పక పెళ్లి చేసుకుంటా. మరో మూడు నాలుగేళ్లు ఆగమని చెప్పను. వెంటనే పెళ్లి చేసుకుంటాను. ప్రశ్న: ఎక్కువగా పార్టీలో కనిపిస్తున్నారనే వాళ్ల ప్రశ్నకు మీ సమాధానం? జ: నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేసుకుంటున్నాను. ఇందులో ఎ వరికేం చింత? పార్టీలకు వెళ్లే స్వేచ్ఛ నాకు ఉంది. వెళుతున్నాను. ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదుగా.