directorate of education
-
పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్: ఎంపీ వినోద్
హైదరాబాద్: తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ఎవరినైనా, దేనినైనా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఎంపీ వినోద్ అన్నారు. ది తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం హోటల్ ది ప్లాజాలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షనర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం తాగునీరు, విద్యుత్‌కు పెద్దపీట వేసిందన్నారు. తమ ప్రభుత్వం పెన్షనర్లను అన్నివిధాలా ఆదుకుంటుందని, పదో పీఆర్సీ ప్రకారం 70 ఏళ్లు నిండిన పెన్షనర్లకు అదనంగా 15 శాతం క్యాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరుకు సిఫారసు చేయాలని పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు జి.నర్సయ్య కోరారు. దేవాలయాలు, గ్రంథాలయాల సంస్థ, మార్కెట్ కమిటీ, డీసీసీబీ, వాటర్ వర్క్స్, సింగరేణి కాలరీస్‌లో రిటైర్డ్ అయిన వారికి హెల్త్ కార్డులు మంజూరు చేయాలంటూ వినతిపత్రం ఇచ్చారు. సమావేశంలో సంఘం గౌరవ సలహాదారు దేవీ ప్ర సాద్, ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి, వర్కింగ్ ప్రెసిడె ంట్ టి.ప్రేమ్‌కుమార్, కోశాధికారి శ్రావ ణ్‌కుమార్, నవనీతరావు పాల్గొన్నారు. -
స్కూల్ ఫీజులపై తల్లిదండ్రులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : అదనపు ఫీజులతో సతమతమవుతున్న పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ఊరట కల్పించింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుంచి వసూలు చేసిన అదనపు ఫీజును తిరిగి ఇచ్చేయాలంటూ ప్రైవేటు స్కూళ్లను ఢిల్లీ సర్కారు ఆదేశించింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (డీవోఈ) నియమించిన కమిటీ అందించిన నివేదిక సూచనలను అనుసరించి... జూన్ 2016 నుంచి జనవరి 2018 వరకు అదనంగా వసూలు చేసిన ఫీజుపై 9 శాతం వడ్డీ కూడా చెల్లించే విధంగా నిబంధనలు రూపొందించింది. ఈ మొత్తాన్ని వారం రోజుల్లోగా తిరిగి చెల్లించాలంటూ స్కూళ్లను ఆదేశించింది. ఈమేరకు 6వ చెల్లింపు కమిషన్ సిఫారసులు అమలు చేయాల్సిందిగా ఢిల్లీలోని 575 పాఠశాలలకు నోటీసులు జారీచేసింది. అలా చేయని పక్షంలో ఢిల్లీ విద్యా చట్టం- 1973 ప్రకారం తీవ్రమైన చర్యలు తీసుకుంటామని డీవోఈ హెచ్చరించింది. డీవోఈ నివేదికలో పేర్కొన్నట్లుగా అదనపు ఫీజు వసూలు చేసిన స్కూళ్ల వివరాలు 15 రోజుల్లోగా అందజేయాల్సిందిగా ఆయా జిల్లాల డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లను ఆదేశించింది. గతేడాది 449 పాఠశాలలకు.. అదనపు ఫీజులు వసూలు చేసిన 449 పాఠశాలలకు గతేడాది కూడా ఢిల్లీ సర్కారు షోకాజ్ నోటీసులు పంపింది. తల్లిదండ్రులను పిలిపించి రెండు వారాల్లోగా ఫీజు చెల్లించాలంటూ ప్రభుత్వం షరతులు విధించడంతో.. కొన్ని పాఠశాలలు వార్తా పత్రికల్లో ప్రకటనల ద్వారా డబ్బులు వాపసు తీసుకోవాల్సిందిగా తల్లిదండ్రులను కోరాయి. అయితే అలా చెల్లించని పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలనే యోచనలో ఉన్నప్పటికీ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయా స్కూళ్లను ప్రభుత్వమే టేకోవర్ చేయాలనుకుంటుందని విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా సలహాదారు అతీషి మర్లేనా తెలిపారు. -
లెక్కల్లో వెనుకబడ్డ ఢిల్లీ పిల్లలు!
సాక్షి, న్యూఢిల్లీ: తాజాగా ఎన్సీఈఆర్టీ నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో దేశ రాజధాని ఢిల్లీ విద్యార్థులు వెనుకబడ్డారు. ఆంగ్లంలో వెనుకబడిన రాష్ట్రాల్లో ఢిల్లీ ఐదో స్థానంలో, గణితంలో వెనకబడిన రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉంది. విద్యార్థుల సామర్థ్యాన్ని, విద్యా ప్రమాణాలను పరిశీలించేందుకు జాతీయ విద్యా పరిశోధన సంస్థ(ఎన్సీఈఆర్టీ) దేశవ్యాప్తంగా నేషనల్ అచీవ్మెంట్ సర్వే నిర్వహించింది. సర్వేలో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థుల్లో 32శాతం మాత్రమే ఆంగ్లంలో అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పారు. గణిత ప్రశ్నలకు 34 శాతం విద్యార్థులు మాత్రమే సమాధానం చెప్పారు. మూడో తరగతి విద్యార్థులపై సర్వే నిర్వహించగా 54శాతం గణిత ప్రశ్నలకు, 58 శాతం ఆంగ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఐదో తరగతి విద్యార్థుల్లో 44 శాతం గణిత ప్రశ్నలకు, 52శాతం ఆంగ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. నాస్ సర్వేలో రాజస్తాన్, కర్ణాటక రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ వెనుకబడి ఉంది. ఢిల్లీకి చెందిన జానకి రాజన్ అనే ప్రొఫెసర్ నాస్ సర్వేపై స్పందిస్తూ...విద్యార్థులకు లెక్కలు కూడా రాకుండా విద్యాశాఖ మంత్రి బెస్ట్ ఎడుకేషన్ మినిస్టర్ గా అవార్డులు ఎలా తీసుకుంటున్నారని ప్రశ్నించారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంచాలకులు సౌమ్య గుప్తా స్పందిస్తూ.. నాస్ సర్వే ఫలితాలకు తాము ఆశ్యర్యం చెందలేదని, తమ సర్వేలో విద్యార్థులకు నేర్చుకునే నైపుణ్యం లేదని తేలిందని తెలిపారు. అయితే, లక్షకుపైగా విద్యార్థులకు చదివే నైపుణ్యం మెరుగుపడిందని తెలిపారు. -
సర్కార్‌కు రెండేళ్ల పిల్లాడి సవాల్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో నర్సరీలో ప్రవేశాల కోసం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కనీస వయసు పరిమితిని విధించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రాథమిక విద్యలో భాగమైన ప్రి-స్కూల్లో ప్రవేశాల కోసం నాలుగేళ్లు, ప్రైమరీ స్కూల్‌కి ఐదేళ్లు, ఒకటో తరగతికి ఆరేళ్లు కనీస వయస్సుగా నిర్ధారిస్తూ ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (డీవోఈ) డిసెంబర్ 18న సర్క్యులర్ జారీచేసింది. జనవరి 1 నుంచి 22 తేదీ వరకు హస్తినలో ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రెండున్నరేళ్ల బాలుడు ఉదయ్‌ప్రతాప్ సింగ్ కపూర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. బాలుడి తరఫున న్యాయవాది అఖిల్ సచార్ వాదనలు వినిపిస్తూ డీవోఈ జారీచేసిన సర్క్యులర్‌ను కొట్టివేయాలని, ఈ సర్క్యులర్ వల్ల 2017 వరకు తన క్లయింట్ ప్రి-స్కూల్లో ప్రవేశం పొందే అవకాశం ఉండదని కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా మార్చి 31లోపు మూడేళ్ల వయస్సు పూర్తి చేసుకోని పిల్లలకు కూడా ప్రి-స్కూల్లో అడ్మిషన్స్ పొందకుండా ఈ సర్క్యులర్ అడ్డుకుంటోందని ఆయన కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన జస్టిస్ రాజీవ్ శక్ధర్ నేతృత్వంలోని ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వం, డీవోఈ, లెఫ్టినెంట్ గవర్నర్‌కు నోటీసులు జారీచేసింది. పదిరోజుల్లో సమాధానం ఇవ్వాలని వారిని ఆదేశిస్తూ ఈ కేసు విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది. -
ఎంతమందిని చేర్చుకున్నారో చెప్పండి
న్యూఢిల్లీ: నగర డెరైక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్(డీఓఈ), ఈడీఎంసీ తీరుపై ఢిల్లీ హైకోర్టు మండిపడింది. పరిసర ప్రభుత్వ పాఠశాలల్లో 81 మంది విద్యార్థులను చేర్చుకోవాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోకపోవడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఓఈకి సోమవారం జస్టిస్ వీకే షాలీ నేతృత్వంలోని ధర్మాసనం కోర్టుధిక్కారణ నోటీసు జారీ చేసింది. అదేవిధంగా తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు కూడా కోర్టు ధిక్కారణ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఎంతమందిని చేర్చుకొన్నారో చెప్పాలని ప్రశ్నించింది. 81 మంది విద్యార్థులను పరిసర ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించుకో లేదని ఎన్జీవోస్ సామాజిక న్యాయ నిపుణుడు సెప్టెంబర్, 17వ తేదీన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను కోర్టు జనవరి 28, 2015కు వాయిదా వేస్తూ, ఈ విషయమై సరైన నివేదకను అందజేయాలని డీఓఈ, ఈడీఎంసీలకు సూచించింది .కేసు పూర్వాపరాలిలా ఉన్నాయి.. స్థానికతను తెలియజేసే ధ్రువీకరణ, పుట్టినతేదీ పత్రాలు లేని కారణంగా స్కూళ్లలో అడ్మిషన్లను తిరస్కరించినట్లు ఆరోపిస్తూ 14 ఏళ్ల వయస్సు ఉన్న 81 మంది విద్యార్థులు సెప్టెంబర్, 17వ తేదీన పిటిషనర్ ద్వారా కోర్టును ఆశ్రయించారు. పై కారణాలను సాకుగా చూపుతూ తమకు ఈడీఎంసీ స్కూళ్లలో అడ్మిషన్లు నిరాకరించినట్లు తూర్పు ఢిల్లీలోని యమునాఖాదర్ ప్రాంతంలోని విద్యార్థులు పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన ధర్మాసనం అడ్మిషన్లకోసం స్కూళ్లను సంప్రదించాలని విద్యార్థులకు సూచిస్తూ, ఈ మేరకు స్కూళ్లను కూడా వారికి అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. డివిజన్ బెంచ్ ఆదేశాలను స్కూళ్లు పట్టించుకోలేదని ఎన్జీవోస్ తరఫు న్యాయవాది అశోక్ అగర్వాల్ సోమవారం తుది విచారణలో కోర్టు ముందు వాదించారు. విద్యాహక్కు చట్టాన్ని (ఆర్టీఈ) ఢిల్లీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనే విషయం ఈ కేసులో స్పష్టంగా వెల్లడైందన్నారు. పేద విద్యార్థులను కావాలనే విద్య దూరం చేస్తున్నారని వాదించారు.