సర్కార్‌కు రెండేళ్ల పిల్లాడి సవాల్‌! | Toddler challenges AAP’s move to fix age limit for entry-level education | Sakshi
Sakshi News home page

సర్కార్‌కు రెండేళ్ల పిల్లాడి సవాల్‌!

Published Thu, Jan 7 2016 11:35 AM | Last Updated on Thu, Mar 28 2019 6:33 PM

సర్కార్‌కు రెండేళ్ల పిల్లాడి సవాల్‌! - Sakshi

సర్కార్‌కు రెండేళ్ల పిల్లాడి సవాల్‌!

న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో నర్సరీలో ప్రవేశాల కోసం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కనీస వయసు పరిమితిని విధించడాన్ని సవాల్‌ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రాథమిక విద్యలో భాగమైన ప్రి-స్కూల్‌లో ప్రవేశాల కోసం నాలుగేళ్లు, ప్రైమరీ స్కూల్‌కి ఐదేళ్లు, ఒకటో తరగతికి ఆరేళ్లు కనీస వయస్సుగా నిర్ధారిస్తూ ఢిల్లీ డైరెక్టరేట్‌ ఆఫ్ ఎడ్యుకేషన్ (డీవోఈ) డిసెంబర్ 18న సర్క్యులర్ జారీచేసింది. జనవరి 1 నుంచి 22 తేదీ వరకు హస్తినలో ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రెండున్నరేళ్ల బాలుడు ఉదయ్‌ప్రతాప్‌ సింగ్ కపూర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.

బాలుడి తరఫున న్యాయవాది అఖిల్ సచార్‌ వాదనలు వినిపిస్తూ డీవోఈ జారీచేసిన సర్క్యులర్‌ను కొట్టివేయాలని, ఈ సర్క్యులర్ వల్ల 2017 వరకు తన క్లయింట్ ప్రి-స్కూల్‌లో ప్రవేశం పొందే అవకాశం ఉండదని కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా మార్చి 31లోపు మూడేళ్ల వయస్సు పూర్తి చేసుకోని పిల్లలకు కూడా ప్రి-స్కూల్‌లో అడ్మిషన్స్‌ పొందకుండా ఈ సర్క్యులర్ అడ్డుకుంటోందని ఆయన కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన జస్టిస్ రాజీవ్ శక్‌ధర్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వం, డీవోఈ, లెఫ్టినెంట్ గవర్నర్‌కు నోటీసులు జారీచేసింది. పదిరోజుల్లో సమాధానం ఇవ్వాలని వారిని ఆదేశిస్తూ ఈ కేసు విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement