Pre school
-
అంగన్వాడీ బుజ్జాయిలకు ప్రత్యేక కిట్లు
సాక్షి, అమరావతి: అంగన్వాడీల్లోని చిన్నారులు ఆడుతూ పాడుతూ అభ్యాసం చేయడం ద్వారా వారి చదువులకు బలమైన పునాదులు వేసేలా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపట్టింది. 3 నుంచి ఆరేళ్లలోపు వయసు గల చిన్నారులకు ప్రీ ప్రైమరీ (పీపీ–1, 2) విద్యాభ్యాసానికి దోహదం చేసే సామగ్రిని అందిస్తోంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న 8.50 లక్షల మంది పిల్లలకు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (పీఎస్ఈ) కిట్ల పంపిణీ చేపట్టింది. వీటిలో ఒక పలక, 12 రంగుల స్కెచ్ పెన్సిళ్లు, రెండు పెన్సిళ్లు, ఒక రబ్బరు (ఎరేజర్), షార్ప్‌నర్‌తో కూడిన కిట్‌ను ప్రతి విద్యార్థికి అందజేస్తున్నారు. ఈ నెలాఖరులోగా వీటి పంపిణీ పూర్తి చేసేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒక్కో స్పెషల్ కిట్ రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. ప్రతి కేంద్రానికీ 19 రకాల ఆట వస్తువులతోపాటు మేధస్సుకు పదును పెట్టి విద్యాభ్యాసానికి దోహదం చేసే ప్రత్యేక కిట్లను ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒక్కొక్కటి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది. ఆ కిట్‌లో చిన్నారులకు ఉపయోగపడే మ్యాట్, సాఫ్ట్ బాల్, చెక్కతో చేసిన సంఖ్యల పజిల్, పెగ్ బోర్డు, అబాకస్, చెక్క బూట్లు, బిల్డింగ్ బ్లాక్‌లు, గమ్ స్టిక్స్, 25 ముక్కల రంగుల పేపర్లు, 5 సెట్ల వాటర్ కలర్స్, 5 సెట్ల స్కెచ్ పెన్నులు, 5 ప్యాకెట్ల పెన్సిల్స్, 5 రబ్బర్లు, 5 షార్పనర్లు, నమూనాల ట్రేసింగ్ బోర్డు, డాఫ్లి, బ్లోయింగ్ సంగీత వాయిద్యాలు, 20 పలకలు, బొమ్మలు తయారు చేసేలా 5 సెట్ల మౌల్డింగ్ క్లే, మూడు ప్యాకెట్ల డస్ట్ ఫ్రీ సుద్దలు, బంతితో బాస్కెట్ బాల్ హోప్, కథల పుస్తకాలు 20 అందించారు. వీటిని ఆయా అంగన్వాడీలకు వచ్చే చిన్నారులు అక్కడే వినియోగించుకుని ఆడుతూ పాడుతూ ఆసక్తిగా అభ్యాసం చేసేలా ఏర్పాట్లు చేశారు. -
ప్లీజ్ ఇలాంటి స్కూల్లో పిల్లలను చేర్పించకండి.. షాకింగ్ వీడియో
బెంగళూరు: పేరెంట్స్ మీ పిల్లలను ప్రీ స్కూల్స్‌కు పంపిస్తున్నారా?. అయితే, ఈ వీడియో తప్పనిసరిగా చూడండి. మీ బిడ్డ చదువుతున్న స్కూల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఒక్కసారి కచ్చితంగా తెలుసుకోంది. ఈ వీడియోలో టీచర్ల నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రీ స్కూల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్కూల్లో ఓ కుర్రాడు మరో చిన్నారిపై దాడి చేశాడు. ఈ వీడియో బాధిత చిన్నారి తల్లి కంటతడి పెట్టింది. ఇక, ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చిక్కలసండ్రలోని టెండర్ ఫూట్ ప్రీ స్కూల్లోని ఓ రూమ్‌లో పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ సమయంలో క్లాస్ రూంలో నుంచి ఓ టీచర్, ఆయా బయటకు వెళ్లడంతో ఓ బాలుడు మరో చిన్నారిని కొట్టడం ప్రారంభించాడు. చేతులతో కొడుతూ, కాళ్లతో తన్నుతూ దాడి చేశాడు. మధ్యలో క్లాస్ రూం కిటికీలో నుంచి టీచర్ వస్తున్నది లేనిదీ చూసుకుంటూ పదే పదే చిన్నారిపై దాడి చేశాడు. ఆ చిన్నారిని కింద పడేసి కాళ్లతో తన్నడం, మెడ కొరకడం వంటివి చేశాడు. ఇక, ఇదంతా క్లాస్‌రూంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలో బయటపడింది. ఈ విషయం బాధిత చిన్నారి పేరెంట్స్‌కు తెలియడంతో పిల్లలను అలా వదిలేసి వెళ్లడంపై తల్లిదండ్రులు యాజమాన్యాన్ని నిలదీశారు. తలుపు వేసి ఉన్న రూంలో పిల్లలను ఎలా వదిలేశారని మండిపడ్డారు. అనంతరం, ఈ ఘటనపై చిన్నారి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చట్టప్రకారం స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోను ఈస్ట్ బెంగళూరుకు చెందిన సిటిజన్స్ మూమెంట్ ట్విట్టర్ హ్యాండిల్ పోస్టు చేసింది. ఈ క్రమంలో పిల్లల పేరెంట్స్‌ను హెచ్చరించింది. ఈ స్కూల్లో మీ పిల్లలను చేర్పించవద్దని సూచించింది. ఇక, ఈ వీడియో చూసి పేరెంట్స్ షాక్ అవుతున్నారు. సదరు స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. We received a disturbing video of a preschool where toddlers are left unattended in a closed room. A senior kid is seen hitting repeatedly a junior school. The school's name is Tenderfoot, Chikkalasandra, Bengaluru- 560061. Please don’t send your kid there! 🙏🏻 #childabuse pic.twitter.com/IeGsj2M9b2 — Citizens Movement, East Bengaluru (@east_bengaluru) June 22, 2023 ఇది కూడా చదవండి: కనిమొళి అభినందన.. ఆమె ఉద్యోగం పోయిందా?.. అసలేం జరిగిందంటే.. -
అంగన్వాడీల్లో ప్రీ స్కూల్స్ బోధన జాడేదీ?
అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్స్‌గా మారుస్తామన్న గత తెలుగుదేశం ప్రభుత్వం మాటలు నీటిమూటలయ్యాయి. కార్పొరెట్ స్కూల్స్‌కు ధీటుగా తీర్చి దిద్దుతామని చిన్నారులకు చిన్ననాటి నుంచే ఇంగ్లిష్ బోధన అలావాటు చేస్తామని టీవీ, ప్రొజెక్టర్ ద్వారా విద్యా బోధన అందిస్తామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు ఎర్పాటు చేస్తామని మాజీ మంత్రి నారాయణ చెప్పిన మాటలకు అక్షరాల నాలుగు సంవత్సరాలు. అవి ఇప్పటికీ ఆతీగతీ లేదు. ప్రీ స్కూల్స్ బోధన దేవుడెరుగు.అంగన్వాడీ సెంటర్లలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించటంలో గత ప్రభుత్వంఅలసత్వం వహించింది. ఒంగోలు వన్‌టౌన్: జిల్లా వ్యాప్తంగా సగనికి పైగా అంగన్వాడీ కేంద్రాలు ఆధ్వానంగా ఉన్నాయి. గత పాలకులు అంగన్వాడీ సెంటర్లను నిర్లక్ష్యం చేశారు. గొప్పలకు పోయి పబ్లిసిటీ చేసుకోటానికి కొన్ని సెంటర్లకు రంగులు వేయించారు. అంగన్వాడీ సెంటర్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతామాని ప్రగల్భాలు పలికారు. ప్రభుత్వ ఉద్యోగులను ఎన్ని విధాల వాడుకోవాలో టీడీపీ పాలకులకు తేలిసిన విధంగా ప్రపంచంలో ఎవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదేమో. ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయటమే కాదు పల్స్ సర్వే, పల్స్ పోలియో జనాభా లెక్కలు, ఇలా ఒకటేమిటి ప్రభుత్వం చేసే ప్రతి పనికీ ఉద్యోగులతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. అంగన్వాడీ కార్యకర్తలు సెంటర్లలో కంటే ఎక్కువ రోజులు ప్రభుత్వ పథకాల ప్రచారంతోనే బయట గడుపుతారు. సగనికిపైగా అంగన్వాడీ కేంద్రాల్లో టీవీ, ప్రొజెక్టర్ నిరుపయోగంగా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ఇంగ్లిష్ మీడియం బుక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవి కేంద్రాల్లో నిరుపయోగంగా పడి ఉన్నాయి. ప్రీ స్కూల్స్ జిల్లా కోఆర్డినేటర్‌గా గత ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం ఒక అధికారిని కుడా నియమించింది. అయినా అంగన్వాడీ కేంద్రాల్లో ఎటువంటి మార్పు రాలేదు. పర్యవేక్షణ లోపంతో పాటు అంగన్వాడీ కార్యకర్తలకు సక్రమంగా దిశా నిర్దేశం చేయటంలో కోఆర్డినేటర్ పూర్తిగా విఫలమయ్యారని చెప్పాలి. జిల్లా వ్యాప్తంగా 534 అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్స్‌గా గత ప్రభుత్వం ఎన్నుకోవడం జరిగింది. సుమారు 50 వేల మంది చిన్నారులు ప్రీ స్కూల్స్ సెంటర్లలో ఉన్నారు. గడిచిన ఎడాది నుంచి అంగన్వాడీ కార్యకర్తలకు సార్వత్రిక ఎన్నికల హడావిడిలో గడిపారు. గత ఏడాది చిన్నారులకు విద్య కుడా సక్రమంగా చేప్పలేని పరిస్థితి. ఈ వేసవిలో అంగన్వాడీ కార్యకర్తలకు మే 15 నుంచి 31 వరకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. జూన్ 1 నుంచి చిన్నారులకు కొత్త విద్యా సంవత్సరం బోధన ప్రారంభం కాబోతుంది. కోంత మంది అధికారులు కేంద్రాల్లో చిన్నారులకు విద్యతో పాటు పౌష్టికాహారం సక్రమంగా అందుతుందో లేదో పర్యేవేక్షించాల్సింది పోయి. మిగతా వాటిపై ఎక్కువ దృష్టి సాధిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో పక్క కార్యకర్తలకు సక్రమంగా జీతలను కుడా అందడంలేదని గత ప్రభుత్వాలు. మూడు నెలలకు ఒకసారి నాల్గు నెలలకు ఒక సారి ఇచ్చే జీతాలను కాకుండా సేంటర్లకు కనీసం అద్దెలు కుడా సక్రమంగా అందించలేని పరిస్థితి నెలకొని ఉందని కార్యకర్తలు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు నిద్రమత్తు వదిలి చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
చిన్నారుల ఉక్కరి బిక్కిరి
ఈ చిత్రంలోని చిన్నారులను చూశారా? బొబ్బిలి మున్సిపాలిటీ 17వ వార్డులోగల చంద్రన్న ప్రీస్కూల్లో చిన్నారులు వీరు. ఉక్కపోత తీవ్రంగా ఉండటంతో ఇదిగో ఇలా ఒకే చోట పడుకున్నారు.ఈ ప్రీస్కూల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదువుతున్న పిల్లలున్నారు. పాపం చిన్నారుల కోసం ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని గత కమిషనర్‌ను అడిగితే మీకు మూతులు కూడా కడుగుతాం లెండి! అని చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారట. ఇక చేసేది లేక కార్యకర్తలు ఫ్యాన్ల ఊసెత్తలేదు. ఇలా చిన్నారులను ఉక్కపోతలోనే ఉంచుతున్నారు. విజయనగరం , బొబ్బిలి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పబ్లిసిటీకి, ప్రచార యావకూ చిన్నారులను కూడా వదలడం లేదు. ఏ సౌకర్యం కల్పించకుండా అన్నీ కల్పిస్తున్నట్టు రంగు రంగుల బొమ్మలేసిన ప్రీ స్కూళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. పట్టణఅంగన్వాడీ కేంద్రాలనే రెండు మూడింటిని ఒక చోట చేర్చి చంద్రన్న ప్రీస్కూళ్లుగా నామకరణం చేశారు. జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలోని 446 అంగన్వాడీ కేంద్రాలుంటే వారికి చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్ మీడియం చదువులు చెబుతామని ప్రీస్కూళ్లు ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు ఫొటోలు పెట్టి, మొత్తం పసుపు రంగుగా మార్చేసిన ఈ కేంద్రాల్లో ఒక సారి ఇచ్చిన టీవీలు పాడయ్యాయి. కొన్ని గదులకు రంగులు వేయలేదు. మరికొన్ని కేంద్రాలకు ప్రొజెక్టర్లను ఇటీవల ఇచ్చినా ఆయా కేంద్రాల్లోని కార్యకర్తలకు శిక్షణ ఇవ్వలేదు. అలాగే వారి సెల్‌తో ప్రొజెక్టర్లకు అనుసంధానం చేసి రైమింగ్, పాటలు, చూపించాల్సి ఉన్నా అవేవీ జరగడం లేదు. అసౌకర్యాలతో అవస్థలు ముఖ్యంగా కేంద్రాల్లోని చిన్నారులకు సౌకర్యాల్లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ విధానాలతో చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఇలాంటి అసౌకర్యాల ప్రీస్కూళ్లలో ఉంచాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. నేటికీ అన్ని స్కూళ్లలో పూర్తి స్థాయి సౌకర్యాల్లేవు. ఫ్యాన్లు ఇచ్చిన చోట టేబుళ్లు లేవు. టేబుళ్లు ఇచ్చిన చోట విద్యుత్ ఉండదు. దీంతో చిన్నారులను ఇబ్బందులకు గురిచేసినట్టవుతోంది. జిల్లాలో దాదాపు అన్ని కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితి దారుణంగా ఉంది. అసలే వేసవి కాలం ఫ్యాన్లు లేకుండా చిన్నారులను ఇరుకు గదుల్లో ఉంచుతున్నారు. అప్పటివరకూ ఏడుస్తూ అల్లరి చేసిన వారికి పాటలు పాడించి కాస్త తినిపించి ఆయా గదుల్లో పడుకోబెడుతున్నారు. ఫ్యాన్లు లేక తీవ్ర అవస్థలతో వారు ఉక్కబోతలోనే నిద్రావస్థలోకి జారుకుంటున్నారు. రంగులు మార్చారు... సౌకర్యాలు మరిచారు... జిల్లాలోని అర్బన్ అంగన్వాడీ కేంద్రాలను చంద్రన్న ప్రీస్కూళ్లుగా మార్చి అందంగా రంగులు వేసి ముస్తాబు చేసి కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చారు. కానీ ఫ్యాన్లు, విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడంతో అభం శుభం తెలియని చిన్నారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న చంద్రన్న అంగన్వాడీల్లో చాలా వాటికి మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలు లేవు. ఆయాలు, కార్యకర్తలు సుదూర తీరాల నుంచి తాగునీటిని బకెట్లతో తెచ్చుకుంటున్నారు. దీనిపై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నింటికి ఏర్పాటు చేయాల్సి ఉంది. జిల్లాలో కొన్నింటికి ఫ్యాన్లు, టేబుళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. దశల వారీగా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ప్రొజెక్టర్లకూ కార్యకర్తల సెల్ఫోన్లకూ అనుసంధానం చేసి యాప్‌ను ఏర్పాటు చేయాలి. వాటిని ఇప్పుడు చేపడుతున్నాం.– లక్ష్మి, జిల్లా కోఆర్డినేటర్,చంద్రన్న ప్రీస్కూల్స్ -
ప్రీస్కూల్ ఊబకాయంతో ఖర్చు మోతెక్కుతోంది!
సిడ్నీ: ఊబకాయం.. పెద్దలకే కాదు ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా పెద్ద సమస్యగా మారింది. అయితే ఐదేళ్లలోపే పిల్లలు ఊబకాయం బారిన పడితే వారి ఆరోగ్య సంరక్షణ ఖర్చులు దాదాపు 60 శాతం పెరుగుతాయని తాజా అధ్యయనంలో తేలింది. ప్రీ స్కూల్ పిల్లల్లో ఊబకాయం వల్ల శ్వాస సమస్యలు(చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినవి) తలెత్తుతాయని, దీంతో చికిత్స నిమిత్తం తరచూ వారిని ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ పరిశోధకులు తెలిపారు. ఐదేళ్లలోపే ఊబకాయం బారిన పడిన దాదాపు 350 మంది పిల్లలపై పరిశోధన చేశారు. ఆ చిన్నారులకు ఇచ్చే మందులు, వ్యాధి పరీక్షల గురించి తెలుసుకోవడానికి పిల్లల వైద్యులను రీసెర్చర్స్ కలిశారు. వారిని కొన్ని ప్రశ్నలు అడిగి కొంత సమాచారం సేకరించారు. వీటి ఆధారంగా సేకరించిన సమాచారం ప్రకారం... ఐదేళ్ల పైబడిన వారితో పోలిస్తే ప్రీ స్కూల్ వయసు(ఇంకా స్కూళ్లో చేరని, చేరి కొన్ని నెలలు మాత్రమే అయిన) పిల్లల ఆరోగ్య సంరక్షణ ఖర్చు ఎక్కువగా ఉందని నిర్ధారించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో దాదాపు 6.9 శాతం మంది ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అల్సన్ హేస్ తెలిపారు. -
సర్కార్‌కు రెండేళ్ల పిల్లాడి సవాల్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో నర్సరీలో ప్రవేశాల కోసం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కనీస వయసు పరిమితిని విధించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రాథమిక విద్యలో భాగమైన ప్రి-స్కూల్లో ప్రవేశాల కోసం నాలుగేళ్లు, ప్రైమరీ స్కూల్‌కి ఐదేళ్లు, ఒకటో తరగతికి ఆరేళ్లు కనీస వయస్సుగా నిర్ధారిస్తూ ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (డీవోఈ) డిసెంబర్ 18న సర్క్యులర్ జారీచేసింది. జనవరి 1 నుంచి 22 తేదీ వరకు హస్తినలో ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రెండున్నరేళ్ల బాలుడు ఉదయ్‌ప్రతాప్ సింగ్ కపూర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. బాలుడి తరఫున న్యాయవాది అఖిల్ సచార్ వాదనలు వినిపిస్తూ డీవోఈ జారీచేసిన సర్క్యులర్‌ను కొట్టివేయాలని, ఈ సర్క్యులర్ వల్ల 2017 వరకు తన క్లయింట్ ప్రి-స్కూల్లో ప్రవేశం పొందే అవకాశం ఉండదని కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా మార్చి 31లోపు మూడేళ్ల వయస్సు పూర్తి చేసుకోని పిల్లలకు కూడా ప్రి-స్కూల్లో అడ్మిషన్స్ పొందకుండా ఈ సర్క్యులర్ అడ్డుకుంటోందని ఆయన కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన జస్టిస్ రాజీవ్ శక్ధర్ నేతృత్వంలోని ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వం, డీవోఈ, లెఫ్టినెంట్ గవర్నర్‌కు నోటీసులు జారీచేసింది. పదిరోజుల్లో సమాధానం ఇవ్వాలని వారిని ఆదేశిస్తూ ఈ కేసు విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది.