ప్రీస్కూల్ ఊబకాయంతో ఖర్చు మోతెక్కుతోంది!
సిడ్నీ: ఊబకాయం.. పెద్దలకే కాదు ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా పెద్ద సమస్యగా మారింది. అయితే ఐదేళ్లలోపే పిల్లలు ఊబకాయం బారిన పడితే వారి ఆరోగ్య సంరక్షణ ఖర్చులు దాదాపు 60 శాతం పెరుగుతాయని తాజా అధ్యయనంలో తేలింది. ప్రీ స్కూల్ పిల్లల్లో ఊబకాయం వల్ల శ్వాస సమస్యలు(చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినవి) తలెత్తుతాయని, దీంతో చికిత్స నిమిత్తం తరచూ వారిని ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ పరిశోధకులు తెలిపారు. ఐదేళ్లలోపే ఊబకాయం బారిన పడిన దాదాపు 350 మంది పిల్లలపై పరిశోధన చేశారు.
ఆ చిన్నారులకు ఇచ్చే మందులు, వ్యాధి పరీక్షల గురించి తెలుసుకోవడానికి పిల్లల వైద్యులను రీసెర్చర్స్ కలిశారు. వారిని కొన్ని ప్రశ్నలు అడిగి కొంత సమాచారం సేకరించారు. వీటి ఆధారంగా సేకరించిన సమాచారం ప్రకారం... ఐదేళ్ల పైబడిన వారితో పోలిస్తే ప్రీ స్కూల్ వయసు(ఇంకా స్కూళ్లో చేరని, చేరి కొన్ని నెలలు మాత్రమే అయిన) పిల్లల ఆరోగ్య సంరక్షణ ఖర్చు ఎక్కువగా ఉందని నిర్ధారించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో దాదాపు 6.9 శాతం మంది ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అల్సన్ హేస్ తెలిపారు.