ఈ చిత్రంలోని చిన్నారులను చూశారా? బొబ్బిలి మున్సిపాలిటీ 17వ వార్డులోగల చంద్రన్న ప్రీస్కూల్‌లో చిన్నారులు వీరు. ఉక్కపోత తీవ్రంగా ఉండటంతో ఇదిగో ఇలా ఒకే చోట పడుకున్నారు.ఈ ప్రీస్కూల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చదువుతున్న పిల్లలున్నారు. పాపం చిన్నారుల కోసం ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని గత కమిషనర్‌ను అడిగితే మీకు మూతులు కూడా కడుగుతాం లెండి! అని చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారట. ఇక చేసేది లేక కార్యకర్తలు ఫ్యాన్ల ఊసెత్తలేదు. ఇలా చిన్నారులను ఉక్కపోతలోనే ఉంచుతున్నారు.
విజయనగరం , బొబ్బిలి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పబ్లిసిటీకి, ప్రచార యావకూ చిన్నారులను కూడా వదలడం లేదు. ఏ సౌకర్యం కల్పించకుండా అన్నీ కల్పిస్తున్నట్టు రంగు రంగుల బొమ్మలేసిన ప్రీ స్కూళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. పట్టణఅంగన్వాడీ కేంద్రాలనే రెండు మూడింటిని ఒక చోట చేర్చి చంద్రన్న ప్రీస్కూళ్లుగా నామకరణం చేశారు. జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలోని 446 అంగన్వాడీ కేంద్రాలుంటే వారికి చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్ మీడియం చదువులు చెబుతామని ప్రీస్కూళ్లు ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు ఫొటోలు పెట్టి, మొత్తం పసుపు రంగుగా మార్చేసిన ఈ కేంద్రాల్లో ఒక సారి ఇచ్చిన టీవీలు పాడయ్యాయి. కొన్ని గదులకు రంగులు వేయలేదు. మరికొన్ని కేంద్రాలకు ప్రొజెక్టర్లను ఇటీవల ఇచ్చినా ఆయా కేంద్రాల్లోని కార్యకర్తలకు శిక్షణ ఇవ్వలేదు. అలాగే వారి సెల్‌తో ప్రొజెక్టర్లకు అనుసంధానం చేసి రైమింగ్, పాటలు, చూపించాల్సి ఉన్నా అవేవీ జరగడం లేదు.
అసౌకర్యాలతో అవస్థలు
ముఖ్యంగా కేంద్రాల్లోని చిన్నారులకు సౌకర్యాల్లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ విధానాలతో చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఇలాంటి అసౌకర్యాల ప్రీస్కూళ్లలో ఉంచాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. నేటికీ అన్ని స్కూళ్లలో పూర్తి స్థాయి సౌకర్యాల్లేవు. ఫ్యాన్లు ఇచ్చిన చోట టేబుళ్లు లేవు. టేబుళ్లు ఇచ్చిన చోట విద్యుత్ ఉండదు. దీంతో చిన్నారులను ఇబ్బందులకు గురిచేసినట్టవుతోంది. జిల్లాలో దాదాపు అన్ని కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితి దారుణంగా ఉంది. అసలే వేసవి కాలం ఫ్యాన్లు లేకుండా చిన్నారులను ఇరుకు గదుల్లో ఉంచుతున్నారు. అప్పటివరకూ ఏడుస్తూ అల్లరి చేసిన వారికి పాటలు పాడించి కాస్త తినిపించి ఆయా గదుల్లో పడుకోబెడుతున్నారు. ఫ్యాన్లు లేక తీవ్ర అవస్థలతో వారు ఉక్కబోతలోనే నిద్రావస్థలోకి జారుకుంటున్నారు.
రంగులు మార్చారు... సౌకర్యాలు మరిచారు...
జిల్లాలోని అర్బన్ అంగన్వాడీ కేంద్రాలను చంద్రన్న ప్రీస్కూళ్లుగా మార్చి అందంగా రంగులు వేసి ముస్తాబు చేసి కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చారు. కానీ ఫ్యాన్లు, విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడంతో అభం శుభం తెలియని చిన్నారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న చంద్రన్న అంగన్వాడీల్లో చాలా వాటికి మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలు లేవు. ఆయాలు, కార్యకర్తలు సుదూర తీరాల నుంచి తాగునీటిని బకెట్లతో తెచ్చుకుంటున్నారు. దీనిపై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొన్నింటికి ఏర్పాటు చేయాల్సి ఉంది.
జిల్లాలో కొన్నింటికి ఫ్యాన్లు, టేబుళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. దశల వారీగా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ప్రొజెక్టర్లకూ కార్యకర్తల సెల్‌ఫోన్లకూ అనుసంధానం చేసి యాప్‌ను ఏర్పాటు చేయాలి. వాటిని ఇప్పుడు చేపడుతున్నాం.– లక్ష్మి, జిల్లా కోఆర్డినేటర్,చంద్రన్న ప్రీస్కూల్స్
Comments
Please login to add a commentAdd a comment