పచ్చని చెట్లతో తిరుమల క్షేత్రం అభివృద్ధి
టీటీడీ ఈవో సాంబశివరావు
వికలాంగుల క్యూ మార్పునకు ఆదేశం
సాక్షి,తిరుమల : తిరుమల క్షేత్రాన్ని పచ్చని చెట్లు, మనసుదోచే పుష్పాల మొక్కలతో అభివృద్ధి చేస్తామని టీటీడీ ఈవో డి.సాంబశివరావు అన్నారు. గురువారం ఆయన ఆలయ నాలుగు మాడ వీధులతోపాటు పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్తోపాటు ఎక్కడ చూసినా పచ్చదనం కనిపించేలా మొక్కలు నాటే పనులు ప్రారంభించాలని అధికారులను ఈవో ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
వేసవి రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని అన్ని విభాగాలను ఆదేశించామన్నారు. కల్యాణకట్టల్లో సత్వరమే గుండ్లు కొట్టేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అక్కడ కూడా పారిశుధ్యం మరింత మెరుగుపడేలా సత్వర చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. యాత్రాసదన్లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామన్నారు.
వికలాంగుల క్యూ మార్పునకు ఆదేశం
వికలాంగులు, వృద్ధుల నడక భారాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం అనుమతించే తిరుమల ఆలయం నుంచి కాకుండా ఇకపై సహస్రదీపాలంకరణ మండపం ఎదురుగా ఉండే అత్యవసర ద్వారం నుంచే అనుమతించే ఏర్పాట్లు చేయాలని ఈవో సాంబశివరావు ఇంజినీర్లను ఆదేశించారు. ఉదయం10, మధ్యాహ్నం 3 గంటలకు అనుమతించే సమయంలో తాత్కాలిక క్యూలు ఏర్పాటు చేసి వారి నడక భారాన్ని తగ్గించాలని ఆయన ఆదేశించారు.