40% ఉంటే కొలువులు
సాక్షి, హైదరాబాద్: వికలాంగుల కోటా ఉద్యోగాల నియామక నిబంధనలను ప్రభుత్వం సవరించింది. వికలాంగ కోటాకు అర్హత కోసం కనీసం 40 శాతం వైకల్యాన్ని ప్రామాణికం (బెంచ్‌మార్క్ డిసెబిలిటీ)గా నిర్దేశించింది. వికలాంగ కోటాకు అర్హుల జాబితాలో కొత్తగా తక్కువ దృష్టి (లో విజన్), వినికిడి కష్టం (హార్డ్ హియరింగ్), కండరల వ్యాధి (మస్క్యులర్ డిస్ట్రొఫి), నయమైన కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, ఆటిజం, మేథోపర వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిసెబిలిటీ, మానసిక రోగాలతో బాధపడే వ్యక్తులను చేర్చింది. ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లను వర్తింపజేసేందుకు అమలు చేసే రోస్టర్ పాయింట్ల పట్టికలో ఇప్పటికే వికలాంగుల కోసం 6వ, 31వ, 56వ పాయింట్లు కేటాయించగా తాజాగా 82వ పాయింట్‌ను ఆటిజం, మేథోపర వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిసెబిలిటీ, మానసిక రోగం, చెవిటి–అంధత్వంతో బాధపడే వారి కోసం కేటాయించింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్–1996కు కీలక సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వైకల్యం ఉన్నా అర్హులే...
కొత్త నిబంధనల ప్రకారం 40 శాతానికి తగ్గకుండా నిర్దేశిత వైకల్యం కలిగి ఉంటే వికలాంగ కోటాలో ఉద్యోగార్హతకు ప్రామాణిక వైకల్యం (బెంచ్‌మార్క్ డిజేబిలిటీ)గా పరిగణిస్తారు. వైకల్యం లెక్కింపునకు నిబంధనలు ఉన్నా, లేకపోయినా అర్హులే కానున్నారు. అంటే లెక్కించదిగిన వైకల్యం గలవారితోపాటు లెక్కించలేని వైకల్యంగల వారూ అర్హులు కానున్నారు. ఓపెన్ కాంపిటీషన్ పద్ధతిలో భర్తీ చేసే ప్రతి 50 ఉద్యోగాల్లో 3 ఉద్యోగాలను వికలాంగుల కోసం రిజర్వు చేయాలన్న పాత నిబందనను ప్రభుత్వం తొలగించింది. ఓపెన్ కాంపిటీషన్ పద్ధతిలో భర్తీ చేసే ప్రతి 50 ఉద్యోగాల్లో 4 ఉద్యోగాలను ప్రామాణిక వైకల్యంగల వారికి రిజర్వు చేయాలనే కొత్త నిబంధనను దాని స్థానంలో పొందుపరిచింది.
కేటగిరీల మార్పిడి ఇలా..
ఏదైనా నిర్దేశిత కేటగిరీ వికలాంగులకు రిజర్వ్ అయిన పోస్టుల భర్తీకి సంబంధిత కేటగిరీలో అర్హులైన వికలాంగులు లేకపోతే అనుసరించా ల్సిన విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
- ఒక నియామక సంవత్సరంలో ప్రామాణిక వైకల్యంగల అర్హుడైన వ్యక్తి అందుబాటులో లేకపోవడం/ఇతర కారణాలతో ఏదైనా పోస్టు భర్తీకానప్పుడు, ఆ పోస్టును తదుపరి నియామక సంవత్సరంలో భర్తీ చేసేందుకు క్యారీ ఫార్వర్డ్ చేయాలి. తదుపరి నియామక సంవత్సరంలోనూ ప్రామాణిక వైకల్యంగల అర్హుడు లభించనిపక్షంలో, ఐదు వికలాంగ కేటగిరీల్లో అంతర్గత మార్పులు జరపడం ద్వారా ఆ పోస్టును భర్తీ చేయాలి. మూడో నియామక సంవత్సరం లో ఏ కేటగిరీ వికలాంగుడూ అందుబాటులో లేనిపక్షంలో ఆ ఏడాది సకలాంగుడితో పోస్టును భర్తీ చేయవచ్చు.
- ఏదైనా శాఖలో పోస్టుల స్వభావ రీత్యా ఏదైనా కేటగిరీ వికలాంగుడికి ఉద్యోగం కల్పించే అవకాశం లేకపోతే స్త్రీ, శిశు సంక్షేమశాఖ జీవో నం.10 ప్రకారం ఐదు వికలాంగ కేటగిరీల్లో అంతర్గత మార్పులు జరపడం ద్వారా ఆ పోస్టును భర్తీ చేయాలి.
- రోస్టర్ పాయింట్ ప్రకారం మహిళా వికలాంగులకు కేటాయించిన పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్థులు అందుబాటులో లేకపోతే మరో నియామక సంవత్సరం వరకు వేచి చూడకుండా ఆ పోస్టును అదే వికలాంగ కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులతో భర్తీ చేయాలి. అదే కేటగిరీ పురుష అభ్యర్థులు సైతం అందుబాటులో లేకపోతే ఆ పోస్టును తదుపరి నియామక సంవత్సరంలో భర్తీ చేసేందుకు క్యారీ ఫార్వర్డ్ చేయాలి. తదుపరి నియామక సంవత్సరంలో తొలుత సంబంధిత కేటగిరీ మహిళ అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈసారి కూడా మహిళా అభ్యర్థులు అందుబాటులో లేనిపక్షంలో అదే కేటగిరీ పురుష అభ్యర్థులతో భర్తీ చేయాలి. రెండో నియామక సంవత్సరంలోనూ సంబంధిత కేటగిరీ మహిళ, పురుష అభ్యర్థులు అందుబాటులో లేనిపక్షంలో పోస్టును రోస్టర్ పాయిం ట్లలోని తదుపరి వికలాంగ కేటగిరీ వారితో భర్తీ చేయాలి. అయినా అర్హులైన అభ్యర్థులు లేకుంటే రోస్టర్ పాయింట్‌లోని ఆ తర్వాతి వికలాంగ కేటగిరీ వారికి కేటాయించాలి.
- ఏ వైకలాంగ కేటగిరీ అభ్యర్థులు కూడా అందుబాటులో పక్షంలో మాత్రమే సకాలంగులతో పోస్టులు భర్తీ చేసుకోవాలి.
- ఏదైనా కేటగిరీ వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని, రిజర్వేషన్ల కోటా తగ్గించాలని, పని స్వభావం రీత్యా వికలాంగ కేటగిరీల్లో అంతర్గత మార్పిళ్లు జరపాల్సి ఉందని ప్రభుత్వశాఖలు భావిస్తే స్త్రీ, శిశు సంక్షేమశాఖ జీవో నం. 10 ప్రకారం వికలాంగ రిజర్వేషన్ల అమలు నుంచి సదరు శాఖకు పాక్షిక లేదా పూర్తిగా మినహాయింపు కల్పించాలని ఇంటర్ డిపార్ట్మెంట్ కమిటీని కోరవచ్చు.
కొత్త రోస్టర్ పాయింట్లు ఇలా...
- రోస్టర్ పాయింట్ల చక్రంలో 6వ, 31వ, 56వ స్థానాలను వరుసగా అంధత్వం/అథమ దృష్టి సామర్థ్యం (మహిళలు)... చెవిటి/వినికిడి కష్టం (ఓపెన్)... లోకోమోటార్ డిసెబిలిటీ, సెరెబ్రల్ పాల్సీ, నయమైన కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, జన్యుపరంగా కండరాల బలహీనత (ఓపెన్) గల వ్యక్తులకు కేటాయించాలి.
- 100 రోస్టర్ పాయింట్ల తర్వాత రెండో, మూడో, నాలుగో చక్రంలో ఈ కింది పాయింట్లు చేరుతాయి..
- 106, 206, 306 – అంధత్వం, తక్కువ దృష్టి సామర్థ్యం (ఓపెన్)
- 131, 231, 331 – చెవిటి, వినికిడి కష్టం (131–విమెన్, 231–ఓపెన్, 331–ఓపెన్)
- 156, 256, 356 – లోకోమోటార్ డిసెబిలిటి, సెరెబ్రల్ పాల్సీ, నయమైన కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, జన్యుపరంగా కండరాల బలహీనత (156–ఓపెన్, 256–విమెన్, 356–ఓపెన్)
- 182, 282, 382 – ఆటిజం, మేథోపర వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిసెబిలిటి, మానసిక రోగులు, చెవిటి+అంధతోపాటు అంధులు, తక్కువ దృష్టి సామర్థ్యం, చెవిటి/వినికిడి కష్టం, లోకోమోటార్ డిసెబిలిటి, సెరెబ్రల్ పాల్సీ, నయమైన కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, జన్యుపరంగా కండరాల బలహీనత, ఆటిజం, మేథోపర వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిసెబిలిటి, మానసిక రోగాల్లో ఒకటికి మించి రోగాలుగల వారు.(182–ఓపెన్, 282–ఓపెన్, 382–విమెన్)