Disciples of Guru
-
సాక్షితో సిరివెన్నెల చివరి ఇంటర్వ్యూ: ‘ఆ సమయంలో క్రిష్ మీద అలిగాను’
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా సిరివెన్నల సీతారామశాస్త్రి, క్రిష్‌లను సాక్షి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది.. ఆ వివరాలు.. క్రిష్: ‘వీడు పెద్ద దర్శకుడు కాబోతున్నాడు’ అని నా మొదటి సినిమా రిలీజ్ కాకముందే సిరివెన్నెలగారు చెప్పినప్పుడు అందరూ అతిశయోక్తి అనుకున్నారు. నేను ఎవరో తెలియనప్పుడు, నేను ‘గమ్యం’ కథ రాసుకుని వెళ్లినప్పుడు ఆయన విని, కొన్ని సలహాలు ఇచ్చారు.. అప్పటినుంచి ఇప్పటి వరకూ ఆయనతో పని చేసిన ప్రతిరోజూ ఓ అందమైన జ్ఞాపకం. సిరివెన్నెల: ఒక్క ముక్కలో చెప్పాలంటే అది అతని (క్రిష్) సంస్కారం. రెండో ముక్కలో చెప్పాలంటే మన సంప్రదాయంలో గురు శిష్యుల బంధం గురించి శాంతి మంత్రం ఉంది. గురుశిష్యుల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. నా సిద్ధాంతం ప్రకారం శిష్యుణ్ణి గురువు తయారు చేయడు.. గురువును శిష్యుడు తయారు చేస్తాడు. వయసును బట్టి పుత్ర వాత్సల్యం ఉంటుంది.. బాధ్యతను బట్టి గురుపీఠం ఉంటుంది. తల్లీతండ్రి, ఉపాధ్యాయులతో ఉండే అనుబంధం రుణబంధం. దాన్ని గుర్తుంచుకోవడం శిష్యుడి సంస్కారం. అలాంటి ప్రతి శిష్యుడు గురువు అవుతాడు. సిరివెన్నెల: క్రిష్ నా వద్దకు వచ్చి ‘గమ్యం’ కథ చెప్పినప్పుడు ‘ఈ సినిమాకి పాటలు రాసేంత అవకాశం.. వ్యవదానం నాకు కనిపించడం లేదబ్బాయ్’ అన్నాను. ‘ప్రవచనాలకు సినిమా అనేది వేదిక కాదు.. నా అభిప్రాయాన్ని నువ్వు అంగీకరిస్తే నేను ఓ విషయం చెబుతాను అన్నాను. తను చెప్పమనగానే.. ఇంత లోతైనటువంటి ప్రవచనాన్ని ప్రేక్షకులు తీసుకోలేరు.. ఒక వినోదంతో కలిగిన సందేశం ఉంటే బాగుంటుంది.. హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అంటున్నావు.. మిత్ర సమేతం కూడా ఉంటే బాగుంటుంది. లాజిక్కులు అడక్కు.. నువ్వు చేస్తే చెయ్.. లేకుంటే లేదు’ అన్నాను. ‘మీరు ఒక్కరు కన్విన్స్ అయితే చాలు.. అందుకు నేను ఏం చేయాలో చెప్పండి’ అన్నారు క్రిష్. నా ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పుమన్నాను.. నేను పూర్తిగా కన్విన్స్ అవడానికి చాలా సమయం పడుతుంది.. అప్పటి వరకూ నువ్వు సినిమా వాయిదా వేయాలన్నాను. వేరే ఎవరైనా అయితే ఒప్పుకునేవారు కాదు. కానీ తను ఎనిమిది నెలలు నా కోసం సినిమా వాయిదా వేశాడు. క్రిష్: ‘కృష్ణం వందే జగద్గురమ్’ సినిమాలో గురువుగారు ఓ 14 నిమిషాల పాట రాశారు. ఇప్పుడైతే ఒప్పుకునేవాడినేమో! అప్పుడు నాకు దర్శకుడిగా తెలుగులో మూడో సినిమాయే. ఏదో అపనమ్మకం. నేను సినిమాగా చూస్తూ ఎడిటింగ్ గురించి ఆలోచిస్తున్నాను. గురువుగారేమో పాటగా చూస్తున్నారు. ఓ రెండు మూడు చరణాలు నేను వాడలేదు. అప్పుడు నేను గురువుగారి మాట వినలేదు. అందుకు ఆయన అలిగారు. సిరివెన్నెల: సినిమా అనేది మహాద్భుతమైన వేదిక అని తెలుసుకుని, దానిని వాడుకుంటున్నవారు చాలా తక్కువమంది ఉన్నారు. అలాంటి తక్కువవారిలో క్రిష్ ఒకరు. ఇప్పటివరకు దర్శకులు కె. విశ్వనాథ్‌గారికి, క్రిష్‌కు, మరికొంతమందికి (పేర్లు చెప్పకూడదు) రెండో వెర్షన్ ఇవ్వలేదు... ఇవ్వాల్సిన అవసరం రాలేదు. అంటే వారి ఒప్పుదల, నా శ్రమ ఎక్కడైతే ఏకీభవిస్తాయో అక్కడ ఓకే అన్నమాట. క్రిష్: ‘సిరివెన్నెల’గారు నాకు మొదట గురువుగారే. ఆ తర్వాత తండ్రి అయ్యారు. సిరివెన్నెల: సినిమా నన్ను ఎంటర్టైన్ చేయాలి.. అదే సమయంలో నన్ను నిద్రపుచ్చకుండా కూడా చూడాలి. అలాంటి సినిమాలను తీసే పని క్రిష్ చేస్తాడు. క్రిష్ కథల్లో కొందరు కమర్షియాలిటీ లేదంటుంటారు. ఎక్కువమంది ఒప్పుకుంటే అది కమర్షియాలిటీ అవుతుంది. రామాయణ, మహాభారతాలను మించిన కమర్షియాలిటీ కథలు ఇంకేమీ ఉండవు. క్రిష్: ‘కంచె’ అప్పుడు చాలామంది అభ్యంతరం తెలుపుతూ మాట్లాడారు. రెండో ప్రపంచయుద్ధం కాలం నాటి కథను ఎవరు చూస్తారు? అసలు హిట్లర్‌కు మనకూ సంబంధం ఏంటీ? అన్నది వారి అభిప్రాయం. కానీ మన తెలుగు సైనికులు గ్రామాల నుంచి వేల సంఖ్యలో యుద్ధాలకు వెళ్లిన కథలను ఎవరూ చెప్పలేదు. ‘వేదం’ సినిమాలో రాముల కథ కావొచ్చు.. సరోజ కథ కావొచ్చు. నాదైన శైలి కథలను ప్రేక్షకులకు చూపిస్తూ సంతృప్తి చెందుతాను. సిరివెన్నెల: మనిషి అనే మూడు అక్షరాల పదాన్ని పట్టుకుని నిరంతరం పాకులాడటం అనేది మా ఇద్దరికీ ఉన్న కామన్ పాయింట్. ఒక మనిషిని 360 కోణాల్లో ఏ విధంగానైనా చూడొచ్చు. అలా క్రిష్ ఏ కథ చెప్పినా మనిషి గురించే చెప్పాడు. ఆ విధంగా క్రిష్ వివిధ విధాలుగా ఒకటే సినిమా తీశాడు. నేనూ ఒకటే పాట రాశాను. కాకపోతే వివిధ రకాలుగా... మనిషి గురించి. ఒక సినిమా చూస్తూ వందమంది చప్పట్లు కొడతారు. ఒక్క మనిషి చప్పట్లు కొట్టకుండా ఉంటాడు. చప్పట్లు కొట్టడం కూడా మరిచిపోయేంతలా సినిమాలో లీనం అయితే అది సార్థకి. అలాంటివాడు ఒక్కడైనా చాలు.. అయితే ఆశయంతో.. కాదు పొగరుబోతుతనంతో పని చేస్తున్నాడు. క్రిష్ డైరెక్షన్లో వచ్చిన ప్రతి సినిమా నాకు ఇష్టమే. ‘గమ్యం’ సినిమా ట్రెండ్ సెట్టర్. కానీ ‘కంచె’ ఓ అద్భుతం... మాస్టర్‌పీస్. మా ఇద్దరికీ ప్రపంచమే గురువు. క్రిష్: జీవితంలో మనం పరిపక్వత చెందుతూ ఉంటాం. అలాంటి జీవితంలో ఇలాంటి ఓ గురువు చేయి పట్టుకుని ఉంటే... జీవితం నేర్పించబోయే క్లిష్టతరమైన పాఠాలకు సంసిద్ధులుగా ఉంటాం. -
గురుశిష్యుల సంవాదమే... కేనోపనిషత్తు
గతవారం ఈశావాస్యోపనిషత్తు గురించి తెలుసుకున్నాం కదా, ఈ వారం కేనోపనిషత్తు గురించి తెలుసుకుందాం. కేనోపనిషత్తులో నాలుగు ఖండాలున్నాయి. మొత్తం ముప్ఫయి నాలుగు మంత్రాలు ఉన్నాయి. గురుశిష్యుల మధ్య జరిగిన ప్రశ్న- సమాధానాలుగా ఈ ఉపనిషత్తు ఏర్పడింది. మొదటి మంత్రంలో శిష్యుడు కేనేషితం పతతి ప్రేషిత మనః అంటే ఎవరి ప్రేరేపణతో మనస్సు పరుగెత్తుతోంది? అనే ప్రశ్న వేస్తాడు. ఇందులో మొదటిపదం ‘కేన (ఎవని చేత, దేని చేత) అనేది ప్రశ్న వాచకం. అందుచేత ఇది కేనోపనిషత్తు అయింది. యువతరం ప్రశ్నించాలి. సందేహాలు నివృత్తి చేసుకోవాలి. గుడ్డిగా నమ్మకూడదు. మొండిగా వ్యతిరేకించకూడదు. గురువు దగ్గర కూర్చొని వినాలి. చర్చించాలి. అదే ఉపనిషత్తుల ఉద్దేశం, ప్రయోజనం! సామవేద ఉపనిషత్తులు మొత్తం పదహారు. వాటిలో మొదటిది, దశోపనిషత్తుల్లో రెండవది కేనోపనిషత్తు. సామవేదానికి చెందిన ఏ ఉపనిషత్తు అయినా మొదటా చివరా చదివే శాంతిమంత్రం అందరికీ తెలిసిందే. ఓం సహనా వవతు సహనోభువన్తు సహవీర్యం కరవావహై తేజస్వినావ ధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః (మేము ఇద్దరమూ శక్తిమంతులం అగుదుముగాక! కలిసి భుజింతుము గాక కలసి మహాకార్యాలను చేయుదుముగాక! అధ్యయనంతో తేజోవంతులం అగుదుముగాక ఒకరినొకరు ద్వేషించకుందుముగాక!) ఈ శాంతిమంత్రంలో మేమిద్దరం అనేది గురుశిష్యులకు, జీవబ్రహ్మములకు వర్తిస్తుంది. మొదటి ఖండం మొదటి మంత్రంలో శిష్యుడు గురువుగారిని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ‘‘గురుదేవా! ఎవరి ప్రేరణతో మనస్సు దూకుతోంది? ఎవరి చేత నియోగించబడి ప్రాణం కదులుతోంది? ఎవనిచేత మాట్లాడే శక్తి వాక్కుకు, చూసే శక్తి కంటికి, వినే శక్తి చెవికి వస్తున్నాయి? ఏ దేవుడు వీటినన్నిటినీ వినియోగిస్తున్నాడు?’’ అనే ప్రశ్నలు అడిగాడు. గురువు సమాధానాలు చెప్పి సందేహ నివృత్తి చేస్తున్నాడు - ‘‘ఆత్మ శక్తితోనే చెవి వినగలుగుతోంది. మనస్సు గ్రహిస్తోంది. వాక్కు పలుకుతోంది. ప్రాణం ఉంటోంది. కన్ను చూస్తోంది. ఈ సత్యాన్ని, ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవారు అమృతత్వాన్ని పొందుతారు’’ అన్నాడు. ఈ ఆత్మను అనగా బ్రహ్మపదార్థాన్ని ఎలా చూడాలి? ఎలా చెప్పాలి? మొదలైన ప్రశ్నలు శిష్యునికి వస్తాయని గురువే ఊహించి సమాధానం చెబుతున్నాడు. ‘దానిని కళ్లతో చూడలేము. వాక్కుతో చెప్పలేము. మనసుతో తెలుసుకోలేము. దానిని మేము తెలుసుకోలేకపోయాము. అది మనకు తెలిసిన వాటన్నింటికీ వేరైనది. తెలియని వాటికి పైన ఉంటుంది. ఇట్లా మా పూర్వికులు మాకు వివరించారు’ అనే సమాధానం తరతరాలుగా జరుగుతున్న అన్వేషణను తెలుపుతోంది. తెలియనిదానిని గురించి ఒక్కొక్కరు ఒక్కోవిధంగా ఊహించి అదే సత్యం అనుకుంటారు. నలుగురు గుడ్డివాళ్లు ఏనుగు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నారు. ఒకడు తొండం పట్టుకుని తొండమే ఏనుగు అన్నాడు. మరొకడు తోక పట్టుకొని తోకే ఏనుగు అన్నాడు. ఇంకొకడు కాలు, మరొకడు దంతాన్ని పట్టుకుని అవే ఏనుగు అనుకున్నారు. వారికి తెలిసిన పాక్షిక సత్యాన్ని అజ్ఞానంతో అహంకారంతో సంపూర్ణ సత్యంగా ప్రకటిస్తున్నారు. పాక్షిక సత్యాన్ని విని మోసపోవద్దని గురువు శిష్యునికి పదే పదే చెప్పడం ఈ ఉపనిషత్తు విశిష్టత. ‘‘దేనిని మాటలతో చెప్పలేమో, దేనితో మాటలు ఏర్పడ్డాయో అదే అసలైన బ్రహ్మపదార్థం. నువ్వు భ్రమతో అనుకునేది నిజమైనది కాదు’’ ‘‘ఏది మనస్సుకు తెలియదో, దేనివల్ల మనస్సు అన్నిటినీ తెలుసుకోగలుగుతోందో అదే అసలైన బ్రహ్మం’’ ‘‘దేనిని కళ్లతో చూడలేమో, దేనివల్ల కళ్లు చూడగలుగుతున్నాయో అదే బ్రహ్మం అని తెలుసుకో’’. ‘‘దేనిని చెవితో వినలేమో, దేనివల్ల చెవి వినగలుగుతోందో అదే బ్రహ్మం అని తెలుసుకో’’. ‘‘దేనిని ప్రాణం బతికించలేదో ప్రాణం దేనివల్ల ఉంటున్నదో అదే బ్రహ్మం అని తెలుసుకో’’ - అని మొదటి ఖండంలో గురువు పాక్షిక సత్యాలను తాత్కాలిక ఫలితాలను నమ్మి మోసపోవద్దని చెబుతున్నాడు. మాటలతో, మనసుతో, చూపుతో, వినికిడితో, ప్రాణంతో పరబ్రహ్మజ్ఞానం కలిగినట్లు భావించరాదు. అంతరిక్షంలోకి పోయే వాహనంలో కొన్ని భాగాలు ఎక్కడికక్కడ విడిపోయి పడిపోతూ ఉంటాయి. అసలైన ఉపగ్రహాన్ని పైకి చేర్చటమే వాటి పని. అంతేకాని అవి ఉపగ్రహం కావు. వాక్కు, మనస్సు, కన్ను, చెవి, ప్రాణం అలాంటివి. సగుణోపాసన అలాంటిదే అని ఈ ఉపనిషత్తు స్పష్టంగా చెబుతోంది. (ద్వితీయ ఖండంలో గురువు ఇంకా సూటిగా, పరిశోధన, అన్వేషణ ఎలా జరగాలో చెబుతాడు. అది వచ్చేవారం) - డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్