ప్లాస్టిక్ లంచ్ బాక్సులతో అనర్థాలు
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు: 3,295
ప్రాథమికోన్నత పాఠశాలలు: 500
ఉన్నత పాఠశాలలు: 610
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు: 3.45 లక్షలు
(వివరాలు 2016–17 నాటివి)
నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఇదే తరుణంలో బడికి వెళ్లే పిల్లల ఆహార విషయంలో అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులకు నిపుణులు సూచిస్తున్నారు. వారు తీసుకెళ్లే లంచ్ బాక్సులతో మొదలు.. బయట కొనిపెట్టే ఇతర తిండి పదార్థాల వరకూ అన్నింటా ఎన్నో సమస్యలు అంటిపెట్టుకుని ఉన్నాయి. లంచ్ బాక్సులను సరిగ్గా శుభ్రం చేయకుండా ఆహార పదార్ధాలు ఉంచితే, ఆహారం విషతుల్యమై వాంతులు, విరేచనాల బారిన పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
- గుమ్మఘట్ట
ప్యాకింగ్ పదార్థాలు వద్దు
బడికి వెళ్లే పిల్లలకు సాధ్యమైనంత వరకూ ఇంటిలో తయారు చేసిన పదార్థాలనే ఇస్తే బాగుంటుంది. హోటళ్ల నుంచి తెప్పించి లంచ్ బాక్స్‌లో సర్ది ఇవ్వడం మంచిది కాదు. పిల్లలు తినే సమయానికి అవి పాడైపోతుంటాయి. దీని ఫుడ్‌పాయిజన్ అవుతుంది. ప్లాస్టిక్ కవర్లలో ఆహారాన్ని ప్యాక్ చేయడం వల్ల అందులో ధూళి చేరి పిల్లలు అనారోగ్యం బారిన పడే ప్రమాదముంది. ప్లాస్టిక్ బాక్స్‌ల్లో ఆహార పదార్థాలను తీసుకెళ్లడం మంచిది కాదు. ఎందుకంటే ప్లాస్టిక్ బాక్స్‌లకు రసాయనిక రంగులు వాడుతుంటారు. అంతేకాదు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు 30 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుకుంటే సూక్ష్మజీవులు చేరేందుకు అవకాశం ఉంది. ఫలితంగా ఆహారం విషతుల్యమవుతుంది. హాట్‌బాక్స్‌లు లేదా స్టీల్ బాక్స్‌ల్లో ఆహారాన్ని తీసుకెళ్లడం మంచిది. అయితే వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
లంచ్ బాక్స్‌లు ఇలా..
పిల్లలకు ఆహారాన్ని అందించే లంచ్ బాక్స్‌లు నాణ్యమైనవిగా ఉండాలి. రసాయనిక రంగులు వాడిన బాక్స్‌లు వద్దు. పోషకాలు ఉన్న ఆహారాన్ని అందించండి. భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకునేలా చైతన్య పరచండి. తొలివిడతగా పది లక్షల పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచాం. మరో పది లక్షల పుస్తకాలు ఒకటిరెండ్రోజుల్లో రానున్నాయి.
– లక్ష్మినారాయణ, జిల్లా విద్యాధికారి, అనంతపురం
శుభ్రం అవసరం
వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలి. నిర్లక్ష్యం చేయకూడదు ఈగలు, దోమలు పెరిగి ఇళ్లలో ఉండే ఆహార పదార్ధాలపై చేరుతాయి. వీటిని పిల్లలకు అందించడం వల్ల పలు రకాల జబ్బుల బారిన పడతారు. పిల్లల పట్ల ప్రత్యే శ్రద్ద వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– డాక్టర్ సత్యనారాయణ, ప్రభుత్వ వైద్యుడు, రాయదుర్గం