Dish TV
-
ఒకే ప్లాన్‌తో టీవీ చానళ్లు, ఓటీటీ యాప్‌లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒకే ప్లాన్‌తో ఇటు టీవీ చానళ్లు, అటు ఓటీటీ యాప్స్‌ను కూడా పొందే విధంగా డిష్ టీవీ కొత్తగా స్మార్ట్‌ప్లస్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్లాన్ కిందే వీటిని పొందవచ్చని సంస్థ సీఈవో మనోజ్ దోభల్ తెలిపారు.రూ. 200 ప్యాక్ నుంచి ఇది అందుబాటులో ఉంటుంది. పాత, కొత్త కస్టమర్లు.. స్మార్ట్‌ప్లస్ కింద సదరు ప్లాన్‌లోని టీవీ ఛానళ్లతో పాటు డిఫాల్టుగా లభించే హంగామా వంటి అయిదు ఓటీటీ యాప్‌లతో పాటు జీ5, డిస్నీప్లస్ హాట్‌స్టార్, సోనీ లివ్ తదితర యాప్‌ల నుంచి ఒకటి ఎంచుకోవచ్చు. కావాలనుకుంటే మూడు రోజుల తర్వాత మరో యాప్‌నకు మారవచ్చు.పూర్తిగా 16 యాప్‌లు పొందాలంటే నెలకు రూ. 179 చార్జీ ఉంటుంది. కొత్త సర్వీసులతో మార్కెట్ వాటా 3–4 శాతం మేర పెంచుకోగలమని ఆశిస్తున్నట్లు మనోజ్ తెలిపారు. ప్రస్తుతం తమకు డీటీహెచ్ మార్కెట్లో 21 శాతం వాటా ఉందని వివరించారు. వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో ఆండ్రాయిడ్ 4కే బాక్స్, క్లౌడ్ టీవీ వంటి ఉత్పత్తులు అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. -
డిష్ టీవీ ఛైర్మన్ బై..బై! షేర్లు రయ్ రయ్..!
సాక్షి,ముంబై: డైరెక్ట్-టు-హోమ్ ఆపరేటర్ డిష్ టీవీ ఛైర్మన్ జవహర్ లాల్ గోయల్ కంపెనీ బోర్డు నుండి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని డిష్ టీవీ సోమవారంనాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీ అతిపెద్ద వాటాదారు యెస్ బ్యాంక్.. ఛైర్మన్ జవహర్ లాల్ గోయెల్ నేతృత్వంలోని ప్రమోటర్ కుటుంబం డిష్ టీవీ బోర్డు ప్రాతినిధ్యంపై వివాదం, లీగల్ ఫైట్ నేపథ్యంలో ఈ రాజీనామా చోటు చేసుకుంది. 24 శాతానికి పైగా వాటా ఉన్న వైబీఎల్ డిష్ టీవీ బోర్డుని పునర్నిర్మించాలని, గోయెల్‌తో పాటు మరికొందరు వ్యక్తులను తొలగించాలని ఒత్తిడి చేస్తోంది. ఈ నెల ప్రారంభంలో, యెస్ బ్యాంక్ ప్రతిపాదించిన ఏడుగురు స్వతంత్ర డైరెక్టర్లలో ముగ్గురిని నియమించడానికి డిష్ టీవీ అంగీకరించింది. మరోవైపు జూన్‌లో జరిగిన కంపెనీ అసాధారణ సాధారణ సమావేశంలో గోయల్‌ను మేనేజింగ్ డైరెక్టర్‌గా, అనిల్ కుమార్ దువాను కంపెనీ హోల్‌టైమ్ డైరెక్టర్‌గా పునః నియమించాలనే ప్రతిపాదనను 75 శాతం షేర్హోల్డర్లు తిరస్కరించారు. కాగా ఆగస్టు 30 నాటి కంపెనీ డిష్ టీవీ, రెగ్యులేటరీ ఫైలింగ్‌లో, ఛైర్మన్ జవహర్ లాల్ గోయెల్ సెప్టెంబర్ 26, 2022న జరగనున్న కంపెనీ ఏజీఎంలో పదవినుంచి వైదొలుగుతారని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో డీష్ టీవీ షేరు సోమవారం 10శాతం లాభపడగా, మంగళవారం మరో 6శాతం ఎగిసి 17.80 వద్ద కొనసాగుతోంది. -
సవాళ్లు ఎదురయ్యాయ్.. అయితేనేం అందులో ఒకటిగా నిలిచాం కదా!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) అటు కార్పొరేట్, ఇటు బిజినెస్‌ల విషయంలో సవాళ్లు ఎదుర్కొన్నట్లు డిష్ టీవీ గ్రూప్ సీఈవో అనిల్ కుమార్ దువా కంపెనీ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. అయితే సమస్యలు ఎదురైనప్పటికీ సామర్థ్యాలపై నమ్మకంతో ఆశావహంగా ముందుకు సాగినట్లు తెలియజేశారు. వెరసి దేశీయంగా కంటెంట్ డెలివరీ విభాగంలోని ప్రధాన సంస్థలలో ఒకటిగా నిలిచినట్లు వివరించారు. అతిపెద్ద వాటాదారు సంస్థ యస్ బ్యాంక్, కంపెనీ చైర్మన్ జవహర్ లాల్ గోయెల్ మధ్య న్యాయపరమైన వివాదం తలెత్తిన విషయం విదితమే. డిష్ టీవీ బోర్డులో ప్రతినిధుల అంశంపై వివాదం ఏర్పడింది. కంపెనీలో యస్ బ్యాంకుకు 24 శాతం వాటా ఉంది. గోయెల్‌తోపాటు కొంతమంది ఇతర సభ్యులను తప్పించడం ద్వారా బోర్డును పునర్వ్యవస్థీకరించమంటూ యస్ బ్యాంక్ డిమాండ్ చేస్తోంది. చదవండి: Cyrus Mistry: మిస్త్రీ కారు నడిపిన లేడీ డాక్టర్..‘నా కళ్లెదురుగా ప్రమాదం ఎలా జరిగిందంటే!..’ -
డిష్ టీవీకి షాక్! వాటాదారులతో అంత ఈజీ కాదు!
గతేడాది(2021) డిసెంబర్ 30న నిర్వహించిన సాధారణ వార్షిక సమావేశం(ఏజీఎం)లో ప్రతిపాదనలన్నీ వీగిపోయినట్లు డీటీహెచ్ సేవల కంపెనీ డిష్ టీవీ వెల్లడించింది. ఆర్థిక ఫలితాలు, డైరెక్టర్‌గా తిరిగి ఏఎం కురియన్ ఎంపిక తదితర మూడు ప్రతిపాదనలనూ వాటాదారులు తిరస్కరించినట్లు తాజాగా స్టాక్ ఎక్సేంజీలకు తెలియజేసింది. అతిపెద్దవాటాదారు అయిన యస్ బ్యాంక్‌తో న్యాయపరమైన వివాదాల కారణంగా ఇప్పటివరకూ వివరాలను బయటపెట్టలేదని కంపెనీ ప్రస్తావించింది. అయితే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సోమవారం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులతో ఈ అంశాలను వెల్లడించినట్లు డిష్ టీవీ పేర్కొంది. ఇటీవల జరిగిన 33వ ఏజీఎంలో ప్రతిపాదించిన 2021–22 ఏడాదికి కాస్ట్ ఆడిటర్స్ రెమ్యునరేషన్, స్టాండెలోన్, కన్సాలిడేటెడ్ ఫలితాలు, కురియన్ పునఃనియామకం అంశాలకు వ్యతిరేకంగా అధిక శాతం వోటింగ్ నమోదైనట్లు వివరించింది. -
ఏజీఎం ఓటింగ్ ఫలితాలు ప్రకటించండి
న్యూఢిల్లీ: గతేడాది డిసెంబర్ 30న వార్షిక సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం) నిర్వహించిన ఓటింగ్ ఫలితాలను తక్షణమే స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేయాలంటూ డిష్ టీవీ ఇండియాను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. వివిధ ప్రతిపాదనలపై జరిపిన ఓటింగ్ ఫలితాలను వెల్లడించకుండా డిష్ టీవీ తొక్కిపెట్టి ఉంచుతోందంటూ యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇతర షేర్హోల్డర్లు ఫిర్యాదు చేయడంతో సెబీ ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయంలో డైరెక్టర్లపై చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది. డిష్ టీవీ మాతృ సంస్థ అయిన ఎస్సెల్ గ్రూప్‌లో కొన్ని కంపెనీలు.. షేర్లను తనఖా పెట్టి యస్ బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నాయి. అవి డిఫాల్ట్ కావడంతో వాటి షేర్లను యస్ బ్యాంకు జప్తు చేసుకుంది. తనఖా పెట్టిన షేర్ల యాజమాన్య హక్కులపై ప్రమోటరు గ్రూప్ కంపెనీ డబ్ల్యూసీఏ, యస్ బ్యాంక్‌ల మధ్య వివాదం నెలకొంది. కంపెనీ ఏజీఎంలో వోటింగ్ హక్కులను నిరాకరించడంతో యస్ బ్యాంక్ .. సుప్రీం కోర్టును ఆశ్రయించగా, దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అయి తే, ఓటింగ్ ఫలితాలు మాత్రం డిష్ టీవీ వెల్లడించకపోవడం మరో వివాదానికి దారి తీసింది. -
డిష్ టీవీ ఫర్ సేల్..! పోటీలో ప్రధాన కంపెనీలు..!
లోన్ రికవరీలో భాగంగా డిష్ టీవీలో దక్కిన 25.6 శాతం వాటాలను యస్ బ్యాంకు అమ్మేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకుగాను యస్ బ్యాంకు దిగ్గజ శాటిలైట్ సంస్థలతో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. పోటీలో టాటా స్కై, భారతి ఎయిర్టెల్..! డిష్ టీవీను దక్కించుకునేందుకు దిగ్గజ శాటిలైట్ సంస్థలు టాటాస్కై, భారతీ ఎయిర్టెల్ ముందున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ వ్యవహారంపై ఇరు కంపెనీలు స్పందించలేదు. డిష్ టీవీ, యస్ బ్యాంకుల మధ్య గత కొద్ది రోజల నుంచి అనిశ్చితి నెలకొంది. కంపెనీపై బాధ్యతలు తమకే ఉంటాయని ఇరు వర్గాలు వాదనలు చేస్తున్నాయి. వారికే బెనిఫిట్..! డిష్ టీవీ వ్యవహారాలను కంపెనీ ప్రమోటర్ సుభాష్ చంద్ర ఫ్యామిలీ కంపెనీ కార్యకలాపాలను చూసుకుంటుంది. వీరికి కంపెనీలో ఆరు శాతం వాటాలు కల్గి ఉన్నారు. ఒకవేళ యస్‌బ్యాంకు డిష్‌టీవీ వాటాలను టాటాస్కై, లేదా ఎయిర్టెల్ దక్కించుకుంటే ఆయా శాటిలైట్ టీవీ కంపెనీలు వాటా గణనీయంగా పెరగనుంది. శాటిలైట్ డిష్ టీవీ మార్కెట్లో 88 శాతంతో టాటాస్కై మొదటిస్థానంలో ఉంది. ఎయిర్టెల్, డిష్ టీవీలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. మార్చి 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో డిష్ టీవీ ఆదాయం రూ.14 కోట్లుగా నమోదైంది. అలాగే రూ.67 కోట్ల నష్టాలను చవిచూసింది. డిష్ టీవీ మార్కెట్ విలువ రూ.8,268 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: 500 కోట్ల పరిహారం అడిగాడు.. ఆపై భార్యతో కలిసి ఫోన్లో బండబూతులు తిట్టాడు! -
ఎయిర్టెల్ డీటీహెచ్, ‘డిష్’ విలీనం!
ముంబై: దేశ టీవీ ప్రసార పంపిణీ విభాగంలో అతిపెద్ద కంపెనీ ఆవిర్భావానికి అడుగులు పడుతున్నాయి. ఎయిర్టెల్ డిజిటల్ టీవీ, డిష్ టీవీ విలీనానికి ఇరు కంపెనీల మధ్య కొన్ని నెలలుగా జరుగుతున్న చర్చలు ముగింపు దశకు చేరాయి. ఇరు కంపెనీల ప్రమోటర్లతోపాటు, ప్రైవేటు ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్‌పింకస్ డీల్ విషయమై ఒక అంగీకారానికి వచ్చినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ముందుగా డిష్ టీవీ తన డీటీహెచ్ వ్యాపారాన్ని వేరు చేస్తుంది. ఆ తర్వాత భారతీ టెలీ మీడియాతో విలీనం చేస్తుంది. ఎయిర్టెల్ డిజిటల్ టీవీకి భారతీ టెలీమీడియా మాతృ సంస్థగా ఉంది. ఇరు కంపెనీలు కలిస్తే 4 కోట్ల మంది టీవీ సబ్ర్‌స్కయిబర్లతో ప్రపంచంలో అతిపెద్ద టీవీ డి్రస్టిబ్యూషన్ కంపెనీగా అవతరిస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. విలీన పథకానికి సంబంధించి తుది అంశాలపై కసరత్తు జరుగుతున్నట్టు వెల్లడించాయి. ఆధిపత్యం.. ఎయిర్టెల్ డిజిటల్ టీవీ, డిష్ టీవీలు కలవడం వల్ల డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) టీవీ ప్రసారాల పంపిణీ మార్కెట్లో ఆధిపత్యానికి అవకాశం వచి్చనట్టు అవుతుంది. ఎందుకంటే అప్పుడు 87 శాతం మార్కెట్ కేవలం రెండు సంస్థల చేతుల్లోనే ఉంటుంది. ఎయిర్టెల్ డిజిటల్, డిష్ టీవీ విలీన కంపెనీకి 4 కోట్ల కస్టమర్లు ఉంటారు. తద్వారా 62 శాతం మార్కెట్ వాటా ఈ సంస్థ చేతుల్లోనే ఉంటుంది. సెపె్టంబర్ నాటికి డిష్ టీవీకి 23.94 మిలియన్ చందాదారులు, ఎయిర్టెల్ డిజిటల్‌కు 16.21 మిలియన్ చందాదారులు ఉన్నారు. టాటా స్కై 25 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. మిగిలిన వాటా సన్ టీవీకి చెందిన సన్ డైరెక్ట్ సొంతం. టెలికం మార్కెట్ మాదిరే డీటీహెచ్ మార్కెట్లోనూ ఒకప్పుడు ఆరుగురు ప్లేయర్లు ఉండేవారు. ఎస్సెల్ గ్రూపునకు చెందిన డిష్ టీవీ, కొంత కాలం క్రితం వీడియోకాన్ డీటీహెచ్‌ను కొనుగోలు చేసింది. రిలయన్స్ డిజిటల్ టీవీని వేరొక సంస్థ కొనుగోలు చేసింది. కానీ, ఈ సంస్థ సేవలు చాలా నామమాత్రంగానే ఉన్నాయి. ‘‘విలీనం వల్ల యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) పరంగా ఒత్తిడి తగ్గిపోతుంది. అప్పుడు రెండు దేశవ్యాప్త కంపెనీలు, ఒక ప్రాంతీయ కంపెనీయే ఉంటుంది’’ అని ఐడీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ డోకానియా తెలిపారు. విలీన కంపెనీ లిస్టింగ్ భారతీ టెలీమీడియాలో 20 శాతం వాటాను వార్బర్గ్ పింకస్ 2017 డిసెంబర్లో కొనుగోలు చేసింది. ఇందుకు 350 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. తాజా విలీనం తర్వాత కూడా వార్‌బర్గ్‌పింకస్ తన పెట్టుబడులను కొనసాగించనుంది. డీల్ అనంతరం భారతీ టెలీమీడియాను స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కూడా చేయనున్నారు. డిష్ టీవీ డీటీహెచ్ వ్యాపారాన్ని భారతీ టెలీమీడియాలో విలీనం తర్వాత.. నాన్ డీటీహెచ్ సేవలతో కొనసాగుతుంది. ఇందులో డిష్ ఇన్ఫ్రా సేవలు ఉంటాయి. అలాగే, సీఅండ్ఎస్ మీడియానెట్‌లో 51% వాటా కలిగి ఉంటుంది. ‘‘సెప్టెంబర్ నాటికే ఒప్పంద దశకు వచ్చారు. సుప్రీంకోర్టు తీర్పుతో అంతా ఆగిపోయింది. మళ్లీ చర్చలు మొదలయ్యాయి’’అని ఈ వ్యవహారం గురించి తెలిసిన ఓ వ్యక్తి తెలిపారు. టెలికం కంపెనీలు ఏజీఆర్ బకాయిలను 3 నెలల్లోపు చెల్లించాలంటూ ఇటీవల సుప్రీం తీర్పు వచి్చన విషయం తెలిసిందే. -
డిష్ టీవీ లాభాల దౌడు
సాక్షి, న్యూఢిల్లీ: డైరెక్ట్-టు-హోమ్ టెలివిజన్ ఆపరేటర్ డిష్ టీవీ దూసుకుపోతోంది. బుధవారం మధ్యాహ్నం ఉదయం 5 శాతానికిపై గా పుంజుకుని కొత్త గరిష్టాలను తాకింది. ఐదు బ్లాక్‌డీల్స్ ద్వారా 2.2 శాతం వాటాకు సమానమైన 3.95 కోట్ల షేర్లు చేతులు మారినట్లు డిష్ టీవీ తాజాగా వెల్లడించింది. దీంతో స్టాక్ డిష్ టీవీ టాప్ విన్నర్‌గా నిలిచింది. బ్లాక్‌డీల్ ద్వారా భారీ సంఖ్యలో షేర్లు చేతులు మారిన వార్తలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారు. అయితే అనంతరం లాభనష్టాల మధ్య ఊగిసలాడుతోంది. బుధవారం ప్రారంభ సమావేశంలో బిఎస్ఇ, ఎన్ఎస్ఇ రెండింటిపై డిష్ టీవీ షేర్లలో వరుస బ్లాక్ డీల్స్ కూడా కనిపించాయి. దీంతో డిష్ టీవీ మార్కెట్ కాపిటలైజేషన్ రూ .680 కోట్లు పెరిగింది. ఇవాల్టి లాభాలతో రూ .14,058 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ను డిష్ టీవీ సాధించింది. కాగా గతనెలలో విడుదల చేసిన మార్చి త్రైమాసికంలో రూ.118.21 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాలను సాధించింది. అందుకుముందు ఏడాది ఇదే క్వార్టర్లో రూ. 29.49 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. -
డిష్ టీవీలో వీడియోకాన్
న్యూఢిల్లీ: ఎట్టకేలకు డిష్ టీవీ ఇండియాలో వీడియోకాన్ డీ2హెచ్ విలీనం పూర్తయింది. దీంతో డైరెక్ట్ టు హోమ్(డీటీహెచ్) రంగంలో అతి పెద్ద సంస్థగా 2.8 కోట్ల మంది చందాదారులతో జీ గ్రూప్‌కు చెందిన డిష్ టీవీ ఇండియా అవతరించనుంది. ఈ విలీనానికి 2016 నవంబర్లోనే ఇరు కంపెనీల బోర్డ్లూ ఆమోదం తెలిపాయి. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తదితర సంస్థల నుంచి ఆమోదాలు పొందే ప్రక్రియ కారణంగా విలీనానికి ఇంత సమయం పట్టింది. మరోవైపు వీడియోకాన్ గ్రూప్ కంపెనీలు దివాలా ప్రక్రియలో ఉండటంతో వీడియోకాన్ డీ2హెచ్ విలీనంపై ఏమైనా ప్రభావం ఉంటుందేమోనన్న ఉద్దేశంతో డిష్ టీవీ తాత్కాలికంగా వెనక్కు తగ్గడం కూడా జాప్యానికి కారణమైంది. మొత్తం మీద గురువారం నుంచి వీడియోకాన్ డీ2హెచ్, డిష్ టీవీలు ఒక్క సంస్థగా కలసిపోయాయని డిష్ టీవీ ఇండియా సీఎండీ జవహర్ గోయల్ చెప్పారు. డిష్ టీవీకి 1.55 కోట్ల మంది, వీడియోకాన్ డీ2హెచ్‌కు 1.22 కోట్ల మంది చందాదారులున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో డిష్ టీవీ రూ.6,086 కోట్ల ఇబిటాను, వీడియోకాన్ డీ2హెచ్ రూ.1,909 కోట్ల ఇబిటాను ఆర్జించాయి. విలీనం పూర్తయిందన్న వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో డిష్ టీవీ 1.6% లాభపడి రూ.67 వద్ద ముగిసింది. -
స్టాక్స్ వ్యూ
డిష్ టీవీ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.78 టార్గెట్ ధర: రూ.106 ఎందుకంటే: ఎస్సెల్ గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ డైరెక్ట్ టు హోమ్(డీటీహెచ్) రంగంలో అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు పుంజుకున్నాయి. నిర్వహణ ఆదాయం 4 శాతం వృద్ధితో రూ.740 కోట్లకు పెరిగింది. ఒక్కో చందాదారుడి నుంచి వచ్చే సగటు రాబడి(ఏఆర్పీయూ) 10 శాతం వృద్ధితో రూ.148కు చేరడంతో పాటు నికర చందాదారుల సంఖ్య పెరుగుతుండటంతో సబ్స్క్రిప్షన్ ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.692 కోట్లకు పెరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన ఇబిటా 7 శాతం వృద్ధితో రూ.201 కోట్లకు, ఇబిటా మార్జిన్ 35 బేసిస్ పాయింట్లు వృద్ధి చెంది 27 శాతానికి పెరిగాయి. కంటెంట్ సంబంధిత వ్యయాలు, మార్కెటింగ్ ఖర్చులు పెరగడంతో ఇబిటా మార్జిన్ అంచనాల కంటే తక్కువగానే వచ్చింది. మొత్తం మీద నికర నష్టాలు ఈ క్యూ1లో రూ.14 కోట్లకు తగ్గాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పది లక్షల మంది కొత్త చందాదారులు లభిస్తారని కంపెనీ అంచనా వేస్తోంది. దీంతో ఏఆర్పీయూ మెరుగపడి ఆదాయం 7–8శాతం రేంజ్లో పెరగగలదని కంపెనీ భావిస్తోంది. అలాగే ఇబిటా మార్జిన్ 29–31 శాతం రేంజ్లో ఉండొచ్చని కంపెనీ అంచనా. ఈ ఏడాది అక్టోబర్ నాటికి వీడియోకాన్ డీ2హెచ్ విలీనం పూర్తి కానున్నది. ఈ విలీనం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.180 కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.510 కోట్ల మేర డిష్ టీవీకి ప్రయోజనం కలుగనున్నది. త్వరలో హైబ్రిడ్ సెట్–టాప్ బాక్స్(ఈ సెట్–టాప్ బాక్స్ ద్వారా డిజిటల్ కేబుల్ ప్రోగ్రామ్‌లను, ఇంటర్నెట్, లోకల్ ఐపీ నెట్వర్క్ అందించే వీడియోలను చూడొచ్చు)ను అందించనున్నది. అంతేకాకుండా కొత్త తరహాలో ఓటీటీ(ఓవర్ ద టాప్) సేవలను కూడా అందించనున్నది. రిలయన్స్ క్యాపిటల్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.783 టార్గెట్ ధర: రూ.905 ఎందుకంటే: ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విభిన్న విభాగాలు మంచి పనితీరును సాధిస్తుండటంతో ఆయా విభాగాల ఆర్ఓఈ(రిటర్న్ ఆన్ ఈక్విటీ)లే కాకుండా కంపెనీ లాభం కూడా మెరుగుపడనున్నది. ఐపీఓ ద్వారా వాటా విక్రయం, కీలకం కాని ఆస్తుల అమ్మకం ద్వారా కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరంలో మూల ధన లాభాలు, నెట్‌వర్త్ పెరగనున్నాయి. రుణ భారం తగ్గనున్నది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, స్టాక్ మార్కెట్ జోరుగా ఉండటంతో పొదుపులు పెరిగి కంపెనీ మ్యూచువల్ ఫండ్ వ్యాపారం... రిలయన్స్ ఏఎంసీ బాగా పుంజుకుంది. ఈ వ్యాపార విభాగం మొత్తం నిర్వహణ ఆస్తులు 20 శాతం వృద్ధితో రూ.3,62,500 కోట్లకు పెరిగాయి. రెండేళ్లలో ఈ ఆస్తులు 16 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ఈ విభాగం ఆర్ఈఓ 25 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే రిలయన్స్ ఏఎంసీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానున్నది. కమర్షియల్ ఫైనాన్స్, హోమ్ ఫైనాన్స్ విభాగాల వృద్ధి కూడా పుంజుకున్నది. హౌసింగ్ ఫైనాన్స్ విభాగాన్ని ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం కల్లా స్టాక్ మార్కెట్లో కంపెనీ లిస్ట్ చేయనున్నది. జీవిత బీమా వ్యాపార విభాగం బలహీనంగా ఉన్నప్పటికీ, సాధారణ బీమా వ్యాపార విభాగం మాత్రం మంచి పనితీరు కనబరుస్తోంది. సాధారణ బీమా వ్యాపార విభాగం 41 శాతం వృద్ధి చెందింది. రెండేళ్లలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 15% చొప్పున చక్రగతి వృద్ధితో రూ.1,426 కోట్లకు చేరవచ్చని భావిస్తున్నాం. అలాగే ఆదాయం 9% చక్రగతి వృద్ధితో రూ.20,990కోట్లకు, పెరుగుతుందని అంచనా. రెండేళ్లలో కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ 7–9 శాతం రేంజ్లో ఉండొచ్చు. ఈ మూలధన లాభాలను కూడా కలుపుకుంటే ఆర్ఓఈ 12 శాతంగా ఉండొచ్చు. -
రూ. 99కే 100 టీవీ చానల్స్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డెరైక్ట్ టు హోం (డీటీహెచ్) రంగంలో ఇటీవలే ప్రవేశించిన జింగ్ డిజిటల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లోకి బుధవారం అడుగు పెట్టింది. ప్రాంతీయ భాషల వీక్షకుల కోసం అతి తక్కువ ధరకే సేవలను అందించేందుకు జింగ్ బ్రాండ్‌ను డిష్ టీవీ ఆఫర్ చేస్తోంది. అస్సామీస్, బెంగాలీ, ఒరియా, మరాఠీ భాషల్లో సేవలను ప్రారంభించి కస్టమర్ల సంఖ్య పరంగా మూడంకెల వృద్ధి సాధించిన జింగ్, తాజాగా తెలుగులోనూ ప్రవేశించింది. రూ.99కే 100కుపైగా చానెళ్లు, సేవలను అందిస్తోంది. వీటిలో 17 తెలుగు చానెళ్లున్నాయి. సెట్ టాప్ బాక్స్ ధర రూ.1,099. ప్రస్తుతం మార్కెట్లో డీటీహెచ్ బేసిక్ ప్యాక్‌ల ధర నెలకు రూ.165-180 ఉంది. తక్కువ వ్యయంతో అనలాగ్ నుంచి డిజిటల్‌కు మారాలనుకునే వారికి జింగ్ చక్కని పరిష్కారమని డిష్ టీవీ ఇండియా సీవోవో సలీల్ కపూర్ బుధవారమిక్కడ తెలిపారు. ఇక్కడ మూడు డాలర్లలోపే.. అమెరికాలో ఒక్కో వినియోగదారు నుంచి డీటీహెచ్ కంపెనీకి నెలకు 70-80 డాలర్లు సమకూరుతోంది. భారత్‌లో ఇది రూ.170కి అటూ ఇటుగా ఉందని సలీల్ కపూర్ అన్నారు. భారత్‌లో లభించినంత తక్కువ ధరకు సేవలు మరెక్కడా అందుబాటులో లేవని చెప్పారు. ‘ఆరు డీటీహెచ్ కంపెనీలు ఇప్పటి వరకు భారత్‌లో రూ.27,000 కోట్లు వ్యయం చేశాయి. డిష్ టీవీ రూ.5,400 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఏ కంపెనీ లాభాలు ఆర్జించడం లేదు. విభిన్న పన్నులు, లెసైన్సు ఫీజు, సేవలు, వినోదపు పన్నులు పరిశ్రమ వృద్ధికి ఆటంకంగా మారాయి. టీవీ అంటే వినోదమొక్కటే కాదు. సమాచారమూ ఉంది’ అని అన్నారు. అడ్డంకులు తొలగితే సేవలు మరింత విస్తృతమవుతాయని చెప్పారు. దేశీయంగా బాక్సుల తయారీ.. దేశవ్యాప్తంగా ఏటా 70-90 లక్షల గృహాలు డీటీహెచ్‌కు మళ్లుతున్నాయి. మరోవైపు 2015 డిసెంబరుకల్లా దేశవ్యాప్తంగా డిజిటైజేషన్ పూర్తి చేయాలన్నది ప్రభుత్వ భావన. సెట్ టాప్ బాక్సులకై (ఎస్టీబీ) మన దేశం దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఎస్‌టీబీల తయారీలో పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహించాలని డిష్ టీవీ కోరుతోంది. డిజిటైజేషన్ తో లాభపడేది ప్రభుత్వమేనని చెబుతోంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 1.44 కోట్ల గృహాల్లో ఇప్పటికీ కేబుల్, శాటిలైట్ ద్వారా టీవీ వీక్షిస్తున్నారని డిష్ టీవీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అంజలి మల్హోత్రా నంద తెలిపారు. 33 లక్షల కనెక్షన్లు డిజిటైజేషన్ కాగా, వీటిలో 20 లక్షలకుపైగా డీటీహెచ్ వినియోగదారులు ఉన్నారు.