ఆ ముగ్గురి మరణాలు.. 20 ఏళ్లుగా మూతబడిన డిస్నీపార్కు
డిస్నీపార్కుల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. వాల్ట్ డిస్నీ నెలకొల్పిన డిస్నీ థీమ్ పార్కులు ప్రపంచంలో పన్నెండు ఉన్నాయి. ఈ పార్కులన్నీ సందర్శకులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. రోజూ వేలాది సందర్శకులు వీటిని సందర్శిస్తుంటారు. ఇవి ఈనాటికీ దేశ విదేశాల సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే, డిస్నీ థీమ్ పార్కుల్లో ఒకటైన ‘డిస్నీ రివర్ కంట్రీ’ మాత్రం దాదాపు ఇరవై ఏళ్లుగా మూతబడింది. ఇప్పుడు ఈ పార్కు పాడుబడి దెయ్యాల నివాసాన్ని తలపించేలా తయారైంది.
డిస్నీ థీమ్ పార్కుల్లో భాగంగా వాల్ట్ డిస్నీ కంపెనీ 1976 జూన్ 20న ఫ్లోరిడాలోని బే లేక్ తీరం వద్ద ‘డిస్నీ రివర్ కంట్రీ’ పార్కును నెలకొల్పింది. వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన మిగిలిన డిస్నీ పార్కుల్లాగానే ఇది కూడా సందర్శకులతో కిటకిటలాడేది. నిత్యం కోలాహలంగా కనిపించేది. వ్యాపారపరంగా లాభసాటిగానే నడిచేది. ఇందులో రెండు స్విమింగ్‌పూల్స్, ఐదు వాటర్ స్లైడ్స్ ఉన్నాయి. సమీపంలోని బే లేక్ నుంచి వీటికి నీరు చేరవేసేవారు. బే లేక్ నుంచి వచ్చే నీటిని వడబోసేందుకు అడుగు భాగాన ఇసుక నింపిన ఫిల్టర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
అయితే, ఈ పార్కులోని నీటి నాణ్యతపై అనుమానాలు తలెత్తడం, దీనిపై జనాల్లో ఆందోళన మొదలవడంతో ఇది 2001 నవంబర్ 2న మూతబడింది. అప్పటి నుంచి దీనిని మళ్లీ తెరిచే ప్రయత్నాలేవీ ఇంతవరకు జరగలేదు. ఈ పార్కులోని నీటి నాణ్యతపై అనుమానాలు 1980లోనే మొదలయ్యాయి. ఇక్కడి స్విమింగ్‌పూల్‌లో ఈత కొట్టిన ఒక పదకొండేళ్ల బాలుడికి మెదడులో అమీబిక్ ఇన్ఫెక్షన్ ఏర్పడింది. ఆ ఇన్ఫెక్షన్తోనే అతడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత 1982లో ఒకరు, 1989లో మరొకరు ఇలాగే నీటివల్ల కలిగే ఇన్ఫెక్షన్ల బారినపడి మరణించారు.
చాలామంది ఇన్ఫెక్షన్ల బారిన పడినా, చికిత్స తర్వాత కోలుకున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్ల ఈ పార్కులో అడుగుపెట్టడానికి జనాలు భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. వాల్ట్ డిస్నీ కంపెనీ 2001 నవంబర్ 2న ఈ పార్కును మూసివేస్తున్నప్పుడు దీనిలోని నీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరించి, 2002 ఏప్రిల్ 11న పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
అయితే, ‘వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన తొలి వాటర్ థీమ్ పార్కు శాశ్వతంగా మూతబడినట్లే’ అంటూ పత్రికల్లో వార్తలు వచ్చాయి. వాల్ట్ డిస్నీ కంపెనీ ప్రకటించినట్లుగా ఇది పునఃప్రారంభం కాలేదు. వార్తాకథనాలు ఊహించినట్లుగానే జరిగింది. ప్రస్తుతం ఇది పూర్తిగా పాడుబడి అత్యంత దయనీయంగా కనిపిస్తోంది. వాల్ట్ డిస్నీ కంపెనీ చరిత్రలో ఇలాంటి వైఫల్యం ఇదొక్కటే!