సెల్ఫీ స్టిక్స్‌పై డిస్నీ నిషేధం..
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పర్యాటకులు సందర్శించే డిస్నీ వరల్డ్ పార్కుల్లోకి సెల్ఫీ స్టిక్స్‌ని అనుమతించకూడదని ఆ సంస్థ నిర్ణయించింది. అనేక దేశాల్లో డిస్నీ వరల్డ్‌కి చెందిన వినోద కేంద్రాలున్నాయి. చిన్న పిల్లలతో సహా పెద్దలను సైతం ఆకట్టుకునేలా రూపొందిన ఈ పార్కుల్లో సందర్శకుల భద్రతా కారణాల రీత్యా సెల్ఫీ స్టిక్స్‌ని అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వాల్ట్ డిస్నీ తెలిపింది. సందర్శకులకు మంచి అనుభూతిని మిగల్చాలనుకుంటున్నప్పటికీ, ఎవరికీ ఇబ్బంది కలగకూడదని సెల్ఫీ స్టిక్స్‌పై నిషేధం విధించామని ప్రకటించింది. ఇటీవల రోలర్ కోస్టర్‌లో తిరుగుతుండగా ఓ వ్యక్తి తన సెల్ఫీ స్టిక్‌ని విసిరేయడంతో కోస్టర్ గంటపాటు నిలిచిపోయింది. ఈ ఘటన తాజా నిర్ణయానికి కారణమైంది.
సెల్ఫీస్టిక్: ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన సెల్ఫీలు తీసుకునేందుకోసం ప్రత్యేకంగా రూపొందిన పరికరమే సెల్ఫీ స్టిక్. ఈ స్టిక్ లోహంతో తయారై దాదాపు 40 అంగుళాల పొడవుంటుంది. సాధారణంగా స్మార్ట్‌ఫోన్స్, టాబ్లెట్స్, క్యాంపాక్ట్ కెమెరాలను ఈ స్టిక్స్‌కి అమర్చి ఫొటో తీసుకోవచ్చు. మామూలుగా తీసుకునే సెల్ఫీ కన్నా స్టిక్స్ వినియోగించి తీసుకునే సెల్ఫీలతో ఎక్కువ ప్రదేశాన్ని చిత్రీకరించొచ్చు. దీని వల్ల సెల్ఫీలో ఎక్కువ మంది రావడంతోపాటు, వెనుక ఉండే ప్రదేశం కూడా కనిపిస్తుంది.