dist meeting
-
22 నుంచి ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలు
ఏలూరు సిటీ : భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) 39వ జిల్లా మహాసభలను ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహించనున్నట్టు నగర కార్యదర్శి కె.క్రాంతిబాబు తెలిపారు. మంగళవారం స్థానిక సంఘ జిల్లా కార్యాలయంలో నగర ముఖ్య కార్యకర్తల సమావేశం ఉపాధ్యక్షుడు సీహెచ్ భరత్ అధ్యక్షతన నిర్వహించారు. భీమవరం కిరాణా మర్చంట్స్ హాల్లో జిల్లా మహాసభలు నిర్వహిస్తామని, జిల్లా నలుమూలల నుంచి దాదాపు 350 మంది విద్యార్థి ప్రతినిధులు హాజరవుతారని కార్యదర్శి క్రాంతిబాబు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు విద్యార్థి లోకం నాంది పలికేలా మహాసభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
ఇచ్చిన హామీలు అమలు చేయాలి
కాకినాడ సిటీ : ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేసింది. ఆర్అండ్బీ అతిథి గృహంలో వేదిక జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో దివ్యాంగులకు ఇచ్చే పింఛనును రెండు రకాలుగా విభజించడమేమిటని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగులందరికీ రూ.1500 పింఛను ఇవ్వాలన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుంటే ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమన్నారు. నిధులు లేవనే సాకుతో సదరమ్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను నిలిపివేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. సర్టిఫికెట్ల జారీకి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే వికలాంగుల బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సమాన హక్కులు, సమాన విద్యావకాశాలు, సమాన ఉద్యోగ అవకాశాలు కల్పించేవిధంగా బిల్లు తయారు చేసి చట్టబద్ధం చేయడంలో జాప్యం చేయడం దారుణమన్నారు. శాసనసభలోనూ ఈ బిల్లు ప్రవేశపెట్టాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరంపూడి మాణిక్యాలరావు, జిల్లా కార్యదర్శి మోర్త నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
నేడు లోటస్‌పాండ్‌లో వైఎస్సార్సీపీ జిల్లా సమావేశం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా సమీక్ష సమావేశం బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షత వహిస్తారన్నారు. జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్మాణం, మండలస్థాయి కమిటీల నియామకంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతుందని తెలిపారు. సమీక్ష సమావేశానికి జిల్లాలోని పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, సింగిల్‌విండో చైర్మన్లు, మండల, జిల్లా, రాష్ట్ర నాయకులు హాజరుకావాలన్నారు.