ఇచ్చిన హామీలు అమలు చేయాలి
Published Mon, Jul 25 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
కాకినాడ సిటీ :
ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేసింది. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో వేదిక జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో దివ్యాంగులకు ఇచ్చే పింఛనును రెండు రకాలుగా విభజించడమేమిటని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగులందరికీ రూ.1500 పింఛను ఇవ్వాలన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుంటే ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమన్నారు. నిధులు లేవనే సాకుతో సదరమ్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను నిలిపివేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. సర్టిఫికెట్ల జారీకి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే వికలాంగుల బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సమాన హక్కులు, సమాన విద్యావకాశాలు, సమాన ఉద్యోగ అవకాశాలు కల్పించేవిధంగా బిల్లు తయారు చేసి చట్టబద్ధం చేయడంలో జాప్యం చేయడం దారుణమన్నారు. శాసనసభలోనూ ఈ బిల్లు ప్రవేశపెట్టాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరంపూడి మాణిక్యాలరావు, జిల్లా కార్యదర్శి మోర్త నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement