Distributing bicycles
-
బడికొస్తాం.. బరితెగిస్తాం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అరాచక పాలనతో తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న అధికార తెలుగుదేశం పార్టీ అడ్డదారులు తొక్కుతోంది. ఇందుకోసం తమ కనుసన్నల్లో పనిచేసే కొందరు అధికారులను యథేచ్ఛగా వాడుకుంటోంది. ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోంది. ఫలితంగా జిల్లాలో ఎన్నికల నిబంధనావళి అమలు ప్రశ్నార్థకంగా మారింది. కొందరు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ సేవలో తరిస్తుండగా.. వారిని అడ్డం పెట్టుకొని ఆ పార్టీ నేతలు ఎక్కడికక్కడ కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు. కోడ్ కొండెక్కడానికి సూత్రధారులు, పాత్రధారులుగా ఉన్న అధికారులే.. దీనిపై ఫిర్యాదులు అందాక తమకేమీ తెలియదన్నట్టుగా హడావుడి చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇదే తంతు నడుస్తోంది. ఉల్లంఘన జరుగుతోందిలా.. చాలాచోట్ల ఆదరణ యూనిట్లు లోపాయికారీగా పంపిణీ చేస్తున్నారు. ఇటీవల తుని, కాకినాడలో ఈ వ్యవహారం మీడియా కంట పడింది. అయినా రహస్యంగా యూనిట్ల పంపిణీ నడుస్తునే ఉంది మరోవైపు ‘బడికొస్తా’ పథకం కింద విద్యార్థినులకు విద్యా సంవత్సరం ఆరంభంలో ఇవ్వాల్సిన సైకిళ్ల పంపిణీని ఇప్పుడు ఎన్నికల వేళ చేపడుతున్నారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా ఉన్నత పాఠశాలల్లో ఈ సైకిళ్లను అందుబాటులోకి తెచ్చి ఉంచారు. కొన్నిచోట్ల రహస్యంగా పంపిణీ చేయగా, మరికొన్ని పంపిణీకి సిద్ధం చేశారు. విశేషమేమిటంటే పాఠశాలల ఆవరణల్లోనే సైకిళ్లు బిగిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఇటువంటి వ్యవహారాలకు స్వస్తి చెప్పాలి. కానీ, అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లతో లోపాయికారీగా పంపిణీ చేసేందుకు అందుబాటులో ఉంచుతున్నారు. అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చంద్రబాబు ఫొటోలతో ఉన్న దాదాపు 100 సైకిళ్లను విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పినిపే విశ్వరూప్ అక్కడి ఆర్డీవోకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. దీంతోపాటు మిగతాచోట్ల కూడా ఈ వ్యవహారం బయటపడింది. అమలాపురం రూరల్ బండారులంకలో సైకిళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. గోకవరం మండలం కామరాజుపేట జెడ్పీ హైస్కూల్లో ‘బడికొస్తా’ సైకిళ్లను వ్యాన్‌లో ఆయా పాఠశాలలకు తరలిస్తుండగా నిలిపివేశారు. పెద్దాపురం లూథరన్ హైస్కూల్లో పంపిణీకి సిద్ధంగా ఉన్న ‘బడికొస్తా’ సైకిళ్లను వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డుకున్నారు. రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. రామచంద్రపురంలో వివిధ పాఠశాలల్లో పంపిణీకి సిద్ధంగా ఉన్న సైకిళ్లను డీఈవో ఆదేశాల మేరకు పంపిణీ చేయకుండా నిలిపివేశారు. రావులపాలెం మండలం ఈతకోట ఉన్నత పాఠశాలలో కూడా పంపిణీకి సుమారు 200 సైకిళ్లను సిద్ధంగా ఉంచారు. పెదపూడి మండలంలో 550 సైకిళ్లను పంపిణీకి సిద్ధం చేశారు. అడ్డతీగల మండలంలోని అడ్డతీగల, ఎల్లవరం, రాయపల్లి, గొంటువానిపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న 300 మంది ఎనిమిది, తొమ్మిదో తరగతుల విద్యార్థినులకు పంపిణీ చేసే నిమిత్త సైకిళ్ల విడిభాగాలను తీసుకొచ్చి అడ్డతీగల జెడ్పీ ఉన్నత పాఠశాలలోని 105 నంబర్ పోలింగ్ బూత్ గదిలో ఉంచారు. ఎవరైనా అడిగితే ఎన్నికల కోడ్ కారణంగా పంపిణీని నిలిపివేశామని చెబుతున్నారు. అడగనిచోట గుట్టు చప్పుడు కాకుండా పంపిణీ చేసేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆ సైకిళ్లు బయటకు రాకుండా భద్రపరచాలి. అలాకాకుండా పాఠశాలల్లో ఎక్కడిక్కడ బిగించి, అందుబాటులో ఉంచుతున్నారంటే ఏమనాలో అధికారులే చెప్పాలని పలువురు అంటున్నారు. ఈ రోజు కాకపోయినా రేపైనా వీటిని పంపిణీ చేసేస్తారన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా పంపిణీకి సిద్ధంగా ఉన్న సైకిళ్ల వెనక ఓ విద్యాశాఖాధికారి ఆదేశాలున్నట్టు తెలుస్తోంది. జిల్లా ఉన్నతాధికారి లోపాయికారీగా ఇచ్చిన ఆదేశాల మేరకే ఒక విద్యాశాఖాధికారి పథకం ప్రకారం ఈ సైకిళ్లను పాఠశాలల్లో అందుబాటులో ఉంచినట్టు తెలిసింది. వ్యవహారం మీడియా కంట పడడంతో వెంటనే పంపిణీని నిలిపివేయాలని యుద్ధ ప్రాతిపదికన ఆదేశాలిచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. -
అస్తవ్యస్తంగా బడికొస్తా
►జిల్లాకు కేటాయించిన సైకిళ్లు 10,941 ►చేరింది 5,600..పంపిణీ 4,050 ►15 మండలాల్లో పథకం ఊసేలేదు ఒంగోలు: ప్రభుత్వ పథకాలపై ప్రకటనల హోరులో ఉన్న యావ...పథకం అమలులో ఉండడం లేదు. గత ఏడాది ప్రకటించిన బడికొస్తా పథకానికి సంబంధించిన సైకిళ్లు నేటికీ జిల్లాలో పూర్తి స్థాయిలో పంపిణీ కాలేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పటి వరకు జిల్లాలోని పాఠశాలలు చేరిన సైకిళ్లే 50 శాతం అంటే పథకం అమలులో చిత్తశుద్ధి ఏపాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జిల్లాకు కేటాయింపు 10,941: జిల్లాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2016లో బడికొస్తా పథకాన్ని ప్రకటించింది. ప్రాథమికోన్నత విద్యతో బాలికలు బడిమానేయకుండా ఉన్నత విద్యను కూడా కొనసాగించాలనేదే ఈ పథకం లక్ష్యం. అందులో భాగంగా దూరం అంటూ చదువుకు స్వస్తి చెప్పకుండా , బాలికలను ప్రోత్సహించి వారు బడిలో చేరేందుకుగాను 9వ తరగతిలో చేరే ప్రతి బాలికకు ఒక సైకిల్ ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అట్టహాసంగా సైకిళ్ల పంపిణీ ప్రారంభించారు. అందులో భాగంగానే పాఠశాల ముగింపు రోజు జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు కూడా స్థానిక డీఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాలలో బాలికలకు సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆ తరువాత విద్యా సంవత్సరం ముగియడంతో పాఠశాలలు పునఃప్రారంభం కాగానే ఈ సైకిళ్లు ఇస్తామంటూ ప్రకటించేసి చేతులు దులుకున్నారు. కేటాయింపులో అందింది సగమే : జిల్లాలోని 56 మండలాలకు గాను 15 మండలాలకు ఇప్పటి వరకు ఒక్క సైకిల్ కూడా అందలేదు. కురిచేడు 103, అర్ధవీడు 160, సీఎస్‌పురం 162, కంభం 232, హనుమంతునిపాడు 151, జె.పంగులూరు 204, కనిగిరి 383, కొమరోలు 169, కొరిశపాడు 134, పామూరు 182, పీసీపల్లి 102, పెద్దారవీడు 195, సంతమాగులూరు 222, వెలిగండ్ల 166, వేటపాలెం 172 చొప్పున మొత్తం 2737 సైకిళ్లు 9వ తరగతి బాలికలకు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు సంబంధిత 15 మండలాలకు ఒక్క సైకిల్ కూడా చేరలేదు. గత ఏడాది 9వ తరగతి చదివిన విద్యార్థినులకు వీటిని పంపిణీ చేయాలి. కానీ ప్రస్తుతం ఈ విద్యార్థినులు పదో తరగతిలో ప్రవేశం పొంది కూడా నెలరోజులు కావొస్తుండడం గమనార్హం. ఇలా ఒక్క సైకిల్ కూడా చేరని మండలాల్లో సాక్షాత్తు రాష్ట్ర అటవీశాఖా మంత్రి శిద్దా రాఘవరావు నియోజకవర్గంలోని కురిచేడు కూడా ఒకటి కావడం గమనార్హం. ఇక చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ స్వంత మండలం అయిన వేటపాలెం, యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పెద్దారవీడు మండలాలకు కూడా ఒక్క సైకిల్ చేరలేదు. ఇక కనిగిరి నియోజకవర్గం పరిధిలో 6 మండలాలు ఉంటే వాటిలో ఒక్క మండలానికి కూడా అందలేదు. గిద్దలూరు పరిధిలోని అర్థవీడు, కంభం, కొమరోలు మండలాలకు, అద్దంకి నియోజకవర్గ పరి«ధిలోని సంతమాగులూరు, జె.పంగులూరు, కొరిశపాడు మండలాలు కూడా ఒక్క సైకిల్ కూడా అందుకోని మండలాల జాబితాలో ఉన్నాయి. పంపిణీలోనూ కొనసాగుతున్న నిర్లక్ష్యం: జిల్లాకు 10,941 సైకిళ్లకుగాను ఇప్పటి వరకు అందింది 5,600 మాత్రమే కాగా వాటిలో కేవలం 4050 సైకిళ్లను మాత్రమే ప్రధానోపాధ్యాయులు విద్యార్థినులకు పంపిణీ చేశారు. యద్దనపూడి 3.16 శాతం, బల్లికురవ 6.09 శాతం, మర్రిపూడి 9.03 శాతంతో చివరి మూడు స్థానాల్లో నిలిచాయి. అయితే జిల్లాకు అందిన సైకిళ్లలో పంపిణీ అయిన వాటి శాతాన్ని పరిశీలిస్తే 72.32 శాతంగా ఉంది. ఇది రాష్ట్రంలోనే ప్రథమ స్థానం కావడం గమనార్హం. మండలాల వారీగా పంపిణీ అయిన సైకిళ్ల వివరాలు: (బ్రాకెట్లలోవి కేటాయించిన సైకిళ్లు) కొత్తపట్నం–215(241), కొనకనమిట్ల–111 (126), ఉలవపాడు–178 (203), జరుగుమల్లి– 119 (137), ముండ్లమూరు– 153 (180), లింగసముద్రం–118 (139), పుల్లలచెరువు–78(92), కారంచేడు–78(95), అద్దంకి–245 (301), కందుకూరు–196 (244), పొదిలి–168 (225), గుడ్లూరు– 65(88), సింగరాయకొండ–113(169), గిద్దలూరు– 211 (334), మార్కాపురం–284 (479), సంతనూతలపాడు–129 (219), మద్దిపాడు–111(197), రాచర్ల–87(156), యర్రగొండపాలెం–100(196), పి. దోర్నాల–90(177), మార్టూరు–131(263), చినగంజాం–78(159), దర్శి–146(304), పొన్నలూరు–54(120), తాళ్ళూరు–70(169), తర్లుపాడు–62(162), దొనకొండ–63 (169), నాగులుప్పలపాడు–69 (229), టంగుటూరు–53(177), ఒంగోలు–123(423), త్రిపురాంతకం–42(145), చీరాల–114(482), పర్చూరు–18(86), చీమకుర్తి–46(221), ఇంకొల్లు–30(1557), వలేటివారిపాలెం–22(119), కొండపి–24(157), బేస్తవారిపేట–26(201), మర్రిపూడి–14(155), బల్లికురవ–12(197), యద్దనపూడి–3(95). -
ఆర్భాటంగా సైకిళ్ల పంపిణీ
►సైకిల్‌పై సీఎం స్టిక్కర్ వేసేంత వరకు పిల్లలకు ఇవ్వొద్దని హుకుం ►అరకొరగా జిల్లాకు వచ్చిన సైకిళ్లు చిత్తూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నో సేవలు చేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బడికొస్తా... అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని కణ్ణన్ కళాశాల ప్రాంగణంలో అమరనాథరెడ్డి చేతుల మీదుగా సైకిళ్లు పంపిణీ చేశారు. అమరనాథరెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ పరిధిలో ఉన్న జెడ్పీ, మోడల్ స్కూల్స్, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో 2016–17 విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదివిన బాలికలకు బడికొస్తా పథకం కింద సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, ఎమ్మెల్యే సత్యప్రభ, మేయర్ కటారి హేమలత, ఎమ్మెల్సీలు గౌనివారి శ్రీనివాసులు, రాజసింహులు, ఇన్చార్జ్ డీఈవో శామ్యూల్, చిత్తూరు డీవైఈవో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సీఎం బొమ్మ వేసేంత వరకు ఇవ్వొద్దు పేద విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని కార్యక్రమంలో గొప్పలు చెప్పిన మంత్రి, కార్యక్రమం ముగిశాక సైకిళ్లపై సీఎం బొమ్మ వేసిన తరువాత విద్యార్థినులకు ఇవ్వాలని హుకుం జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. సైకిళ్లపై సీఎం బొమ్మ లేదని తెలిసినప్పటికీ మంత్రి ఎందుకు పంపిణీ కార్యక్రమం చేపట్టారని పలువురు విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో 16,722 మంది విద్యార్థులు 9వ తరగతి చదువుతున్నారు. అయితే ఆ విద్యార్థినులందరికీ సైకిళ్లను పంపిణీ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రం నుంచి జిల్లాకు 16,100 సైకిళ్లు మాత్రమే వచ్చాయి. ఇంకా 622 సైకిళ్లు రావాల్సి ఉంది. ప్రభుత్వం సైకిళ్లను సరఫరా చేసేందుకు ఓ ప్రైవేటు కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ కంపెనీ జిల్లాకు మొత్తం సైకిళ్లను ఇచ్చేశామని చెప్పి తప్పించుకున్నట్లు విద్యాశాఖ అధికారుల ద్వారా తెలిసింది. పూర్తి స్థాయిలో జిల్లాకు సైకిళ్లు చేరకపోయినా టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రజల మెప్పు పొందడానికి పలు చోట్ల ప్రారంభ కార్యక్రమాలు హడావిడిగా చేపట్టారు. మిగిలిన సైకిళ్లను విద్యార్థినులకు ఎలా అందజేయాలో తెలియక విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.