పెద్దాపురంలో కోడ్ ఉల్లంఘనపై ఉపాధ్యాయుడుని నిలదీస్తున్న దవులూరి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అరాచక పాలనతో తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న అధికార తెలుగుదేశం పార్టీ అడ్డదారులు తొక్కుతోంది. ఇందుకోసం తమ కనుసన్నల్లో పనిచేసే కొందరు అధికారులను యథేచ్ఛగా వాడుకుంటోంది. ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోంది. ఫలితంగా జిల్లాలో ఎన్నికల నిబంధనావళి అమలు ప్రశ్నార్థకంగా మారింది. కొందరు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ సేవలో తరిస్తుండగా.. వారిని అడ్డం పెట్టుకొని ఆ పార్టీ నేతలు ఎక్కడికక్కడ కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు. కోడ్ కొండెక్కడానికి సూత్రధారులు, పాత్రధారులుగా ఉన్న అధికారులే.. దీనిపై ఫిర్యాదులు అందాక తమకేమీ తెలియదన్నట్టుగా హడావుడి చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇదే తంతు నడుస్తోంది.
ఉల్లంఘన జరుగుతోందిలా..
- చాలాచోట్ల ఆదరణ యూనిట్లు లోపాయికారీగా పంపిణీ చేస్తున్నారు. ఇటీవల తుని, కాకినాడలో ఈ వ్యవహారం మీడియా కంట పడింది. అయినా రహస్యంగా యూనిట్ల పంపిణీ నడుస్తునే ఉంది
- మరోవైపు ‘బడికొస్తా’ పథకం కింద విద్యార్థినులకు విద్యా సంవత్సరం ఆరంభంలో ఇవ్వాల్సిన సైకిళ్ల పంపిణీని ఇప్పుడు ఎన్నికల వేళ చేపడుతున్నారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా ఉన్నత పాఠశాలల్లో ఈ సైకిళ్లను అందుబాటులోకి తెచ్చి ఉంచారు. కొన్నిచోట్ల రహస్యంగా పంపిణీ చేయగా, మరికొన్ని పంపిణీకి సిద్ధం చేశారు. విశేషమేమిటంటే పాఠశాలల ఆవరణల్లోనే సైకిళ్లు బిగిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఇటువంటి వ్యవహారాలకు స్వస్తి చెప్పాలి. కానీ, అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లతో లోపాయికారీగా పంపిణీ చేసేందుకు అందుబాటులో ఉంచుతున్నారు.
- అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చంద్రబాబు ఫొటోలతో ఉన్న దాదాపు 100 సైకిళ్లను విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పినిపే విశ్వరూప్ అక్కడి ఆర్డీవోకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. దీంతోపాటు మిగతాచోట్ల కూడా ఈ వ్యవహారం బయటపడింది.
- అమలాపురం రూరల్ బండారులంకలో సైకిళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు.
- గోకవరం మండలం కామరాజుపేట జెడ్పీ హైస్కూల్‌లో ‘బడికొస్తా’ సైకిళ్లను వ్యాన్‌లో ఆయా పాఠశాలలకు తరలిస్తుండగా నిలిపివేశారు.
- పెద్దాపురం లూథరన్ హైస్కూల్‌లో పంపిణీకి సిద్ధంగా ఉన్న ‘బడికొస్తా’ సైకిళ్లను వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డుకున్నారు. రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.
- రామచంద్రపురంలో వివిధ పాఠశాలల్లో పంపిణీకి సిద్ధంగా ఉన్న సైకిళ్లను డీఈవో ఆదేశాల మేరకు పంపిణీ చేయకుండా నిలిపివేశారు.
- రావులపాలెం మండలం ఈతకోట ఉన్నత పాఠశాలలో కూడా పంపిణీకి సుమారు 200 సైకిళ్లను సిద్ధంగా ఉంచారు.
- పెదపూడి మండలంలో 550 సైకిళ్లను పంపిణీకి సిద్ధం చేశారు.
- అడ్డతీగల మండలంలోని అడ్డతీగల, ఎల్లవరం, రాయపల్లి, గొంటువానిపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న 300 మంది ఎనిమిది, తొమ్మిదో తరగతుల విద్యార్థినులకు పంపిణీ చేసే నిమిత్త సైకిళ్ల విడిభాగాలను తీసుకొచ్చి అడ్డతీగల జెడ్పీ ఉన్నత పాఠశాలలోని 105 నంబర్ పోలింగ్ బూత్ గదిలో ఉంచారు.
- ఎవరైనా అడిగితే ఎన్నికల కోడ్ కారణంగా పంపిణీని నిలిపివేశామని చెబుతున్నారు. అడగనిచోట గుట్టు చప్పుడు కాకుండా పంపిణీ చేసేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆ సైకిళ్లు బయటకు రాకుండా భద్రపరచాలి. అలాకాకుండా పాఠశాలల్లో ఎక్కడిక్కడ బిగించి, అందుబాటులో ఉంచుతున్నారంటే ఏమనాలో అధికారులే చెప్పాలని పలువురు అంటున్నారు. ఈ రోజు కాకపోయినా రేపైనా వీటిని పంపిణీ చేసేస్తారన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
- జిల్లావ్యాప్తంగా పంపిణీకి సిద్ధంగా ఉన్న సైకిళ్ల వెనక ఓ విద్యాశాఖాధికారి ఆదేశాలున్నట్టు తెలుస్తోంది. జిల్లా ఉన్నతాధికారి లోపాయికారీగా ఇచ్చిన ఆదేశాల మేరకే ఒక విద్యాశాఖాధికారి పథకం ప్రకారం ఈ సైకిళ్లను పాఠశాలల్లో అందుబాటులో ఉంచినట్టు తెలిసింది. వ్యవహారం మీడియా కంట పడడంతో వెంటనే పంపిణీని నిలిపివేయాలని యుద్ధ ప్రాతిపదికన ఆదేశాలిచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment