అస్తవ్యస్తంగా బడికొస్తా
►జిల్లాకు కేటాయించిన సైకిళ్లు 10,941
►చేరింది 5,600..పంపిణీ 4,050
►15 మండలాల్లో పథకం ఊసేలేదు
ఒంగోలు: ప్రభుత్వ పథకాలపై ప్రకటనల హోరులో ఉన్న యావ...పథకం అమలులో ఉండడం లేదు. గత ఏడాది ప్రకటించిన బడికొస్తా పథకానికి సంబంధించిన సైకిళ్లు నేటికీ జిల్లాలో పూర్తి స్థాయిలో పంపిణీ కాలేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పటి వరకు జిల్లాలోని పాఠశాలలు చేరిన సైకిళ్లే 50 శాతం అంటే పథకం అమలులో చిత్తశుద్ధి ఏపాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
జిల్లాకు కేటాయింపు 10,941:
జిల్లాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2016లో బడికొస్తా పథకాన్ని ప్రకటించింది. ప్రాథమికోన్నత విద్యతో బాలికలు బడిమానేయకుండా ఉన్నత విద్యను కూడా కొనసాగించాలనేదే ఈ పథకం లక్ష్యం. అందులో భాగంగా దూరం అంటూ చదువుకు స్వస్తి చెప్పకుండా , బాలికలను ప్రోత్సహించి వారు బడిలో చేరేందుకుగాను 9వ తరగతిలో చేరే ప్రతి బాలికకు ఒక సైకిల్ ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అట్టహాసంగా సైకిళ్ల పంపిణీ ప్రారంభించారు. అందులో భాగంగానే పాఠశాల ముగింపు రోజు జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు కూడా స్థానిక డీఆర్‌ఆర్‌ఎం ఉన్నత పాఠశాలలో బాలికలకు సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆ తరువాత విద్యా సంవత్సరం ముగియడంతో పాఠశాలలు పునఃప్రారంభం కాగానే ఈ సైకిళ్లు ఇస్తామంటూ ప్రకటించేసి చేతులు దులుకున్నారు.
కేటాయింపులో అందింది సగమే :
జిల్లాలోని 56 మండలాలకు గాను 15 మండలాలకు ఇప్పటి వరకు ఒక్క సైకిల్ కూడా అందలేదు. కురిచేడు 103, అర్ధవీడు 160, సీఎస్‌పురం 162, కంభం 232, హనుమంతునిపాడు 151, జె.పంగులూరు 204, కనిగిరి 383, కొమరోలు 169, కొరిశపాడు 134, పామూరు 182, పీసీపల్లి 102, పెద్దారవీడు 195, సంతమాగులూరు 222, వెలిగండ్ల 166, వేటపాలెం 172 చొప్పున మొత్తం 2737 సైకిళ్లు 9వ తరగతి బాలికలకు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు సంబంధిత 15 మండలాలకు ఒక్క సైకిల్ కూడా చేరలేదు. గత ఏడాది 9వ తరగతి చదివిన విద్యార్థినులకు వీటిని పంపిణీ చేయాలి. కానీ ప్రస్తుతం ఈ విద్యార్థినులు పదో తరగతిలో ప్రవేశం పొంది కూడా నెలరోజులు కావొస్తుండడం గమనార్హం.
ఇలా ఒక్క సైకిల్ కూడా చేరని మండలాల్లో సాక్షాత్తు రాష్ట్ర అటవీశాఖా మంత్రి శిద్దా రాఘవరావు నియోజకవర్గంలోని కురిచేడు కూడా ఒకటి కావడం గమనార్హం. ఇక చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ స్వంత మండలం అయిన వేటపాలెం, యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పెద్దారవీడు మండలాలకు కూడా ఒక్క సైకిల్ చేరలేదు. ఇక కనిగిరి నియోజకవర్గం పరిధిలో 6 మండలాలు ఉంటే వాటిలో ఒక్క మండలానికి కూడా అందలేదు. గిద్దలూరు పరిధిలోని అర్థవీడు, కంభం, కొమరోలు మండలాలకు, అద్దంకి నియోజకవర్గ పరి«ధిలోని సంతమాగులూరు, జె.పంగులూరు, కొరిశపాడు మండలాలు కూడా ఒక్క సైకిల్ కూడా అందుకోని మండలాల జాబితాలో ఉన్నాయి.
పంపిణీలోనూ కొనసాగుతున్న నిర్లక్ష్యం:
జిల్లాకు 10,941 సైకిళ్లకుగాను ఇప్పటి వరకు అందింది 5,600 మాత్రమే కాగా వాటిలో కేవలం 4050 సైకిళ్లను మాత్రమే ప్రధానోపాధ్యాయులు విద్యార్థినులకు పంపిణీ చేశారు. యద్దనపూడి 3.16 శాతం, బల్లికురవ 6.09 శాతం, మర్రిపూడి 9.03 శాతంతో చివరి మూడు స్థానాల్లో నిలిచాయి. అయితే జిల్లాకు అందిన సైకిళ్లలో పంపిణీ అయిన వాటి శాతాన్ని పరిశీలిస్తే 72.32 శాతంగా ఉంది. ఇది రాష్ట్రంలోనే ప్రథమ స్థానం కావడం గమనార్హం.
మండలాల వారీగా పంపిణీ అయిన సైకిళ్ల
వివరాలు: (బ్రాకెట్లలోవి కేటాయించిన సైకిళ్లు)
కొత్తపట్నం–215(241), కొనకనమిట్ల–111 (126), ఉలవపాడు–178 (203), జరుగుమల్లి– 119 (137), ముండ్లమూరు– 153 (180), లింగసముద్రం–118 (139), పుల్లలచెరువు–78(92), కారంచేడు–78(95), అద్దంకి–245 (301), కందుకూరు–196 (244), పొదిలి–168 (225), గుడ్లూరు– 65(88), సింగరాయకొండ–113(169), గిద్దలూరు– 211 (334), మార్కాపురం–284 (479), సంతనూతలపాడు–129 (219), మద్దిపాడు–111(197), రాచర్ల–87(156), యర్రగొండపాలెం–100(196), పి. దోర్నాల–90(177), మార్టూరు–131(263), చినగంజాం–78(159), దర్శి–146(304), పొన్నలూరు–54(120), తాళ్ళూరు–70(169), తర్లుపాడు–62(162), దొనకొండ–63 (169), నాగులుప్పలపాడు–69 (229), టంగుటూరు–53(177), ఒంగోలు–123(423), త్రిపురాంతకం–42(145), చీరాల–114(482), పర్చూరు–18(86), చీమకుర్తి–46(221), ఇంకొల్లు–30(1557), వలేటివారిపాలెం–22(119), కొండపి–24(157), బేస్తవారిపేట–26(201), మర్రిపూడి–14(155), బల్లికురవ–12(197), యద్దనపూడి–3(95).