distribution of money
-
ప్రలోభాలతో ఓటర్లకు టీడీపీ ఎర
నగరంపాలెం(గుంటూరు): పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఓటర్లకు స్టీల్ గిన్నెలను పంపిణీ చేసేందుకు సిద్ధమైన నలుగురిని అరెస్టు చేసినట్లు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..ఈ నెల 19వ తేదీన మేడికొండూరు గ్రామ పంచాయతీలోని ఇంద్రియానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గుంటూరు–హైదరాబాద్ రాష్ట్ర రహదారిపై దక్షిణ జోన్ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, సీఐ ఎన్.మహతి సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 400 స్టీల్ గిన్నెలను గుర్తించి దర్యాప్తు వేగవంతం చేశారు. టీడీపీ సానుభూతి పరులుగా గుర్తింపు పొందిన ఇంద్రియానగర్ వాసులు బద్దెపోగు శివప్రసాద్, పెడిపాగా లూర్ధు, చెరుకూరి చెంచయ్య, చెరుకూరి లాజర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నేరం రుజువు కావడంతో ఆ నలుగురిని అరెస్టు చేసి, 400 స్టీలు గిన్నెలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, అరెస్టయిన నలుగురిలో ఒకరైన బద్దెపోగు శివప్రసాద్ అభ్యర్థి. గ్రామ పంచాయతీలోని 10వ వార్డు ఓటర్లకు పంపిణీ చేసేందుకు వాటిని తెచ్చారు. సీజ్ చేసిన గిన్నెలను అర్బన్ ఎస్పీ పరిశీలించారు. చీరలు పంచుతూ పట్టుబడిన టీడీపీ తోటపల్లిగూడూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపలి్లడూగూడూరు మండలం పోట్లపూడి పంచాయతీకి టీడీపీ మద్దతిచ్చిన సర్పంచ్ అభ్యర్థి నాశిన కల్పన తరఫున శనివారం రాత్రి గ్రామంలో ఓటర్లకు చీరలను పంచిపెట్టారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అజ్మతుల్లాఖాన్,ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి 34 చీరలు, రెండు మోటారు బైక్‌లు,కరపత్రాలను స్వాధీనం చేసుకుని ఇద్దరు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. టీడీపీ, జనసేన చీరలు, డబ్బు పంపిణీ ! పెదకాకాని(పొన్నూరు): పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు బలపరచిన అభ్యర్థులకు ఓట్లు వేయాలని కోరుతూ డబ్బు, చీరలు పంపిణీ చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలో టీడీపీ కార్యకర్తలు ఓటుకు రూ.1000 చొప్పున డబ్బు పంపిణీ చేయడంతో పాటు ఆ పార్టీ బలపరచిన అభ్యర్థులకు సంబంధించిన కరపత్రాలు, నగదు పంపిణీ చేస్తుండగా పోలీసులు స్టేషన్‌కు తరలించారు. వారిలో మున్నంగి నాగరాజు, కాకాని అన్వేష్‌కుమార్, మున్నంగి నాగప్రసాద్ ఉన్నారు. గోళ్ళమూడి గ్రామంలో జనసేన బలపరచిన వార్డు అభ్యర్థి పసుపులేటి శ్రీనివాసరావు చీరలు పంపిణీ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఓట్ల లెక్కింపులో అవకతవకలపై ఆర్వోకు నోటీసులు కారంచేడు: పంచాయతీ ఎన్నికల లెక్కింపుల్లో అవకతవకలు జరిగాయని ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామ సర్పంచ్ అభ్యర్థి, వైఎస్సార్సీపీ సానుభూతి పరురాలు కుంబా సుజాత ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో రిటర్నింగ్ అ«ధికారి లింగరాజు సుధాకరరావుతో పాటు సిబ్బందికి ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినట్లు తహసీల్దారు సీతారత్నం, ఎంపీడీవో ఎం.నాగభూషణరావు తెలిపారు. చదవండి: నాలుగో దశ: పెనుగొలనులో టీడీపీకి ఎదురుదెబ్బ జెడ్పీ అధికారులపై టీడీపీ నేతల దౌర్జన్యం -
స్థానిక ఎన్నికలు: టీడీపీ నేతల దౌర్జన్యకాండ
జిల్లాలో తెలుగుదేశం నాయకుల దాష్టీకాలు పెరిగిపోతున్నాయి. ఉనికి చాటుకునేందుకు దాడులకు దిగుతున్నారు. మొన్న చాపాడులో దళితులపై దౌర్జన్యకాండ సాగించిన నేతలు నేడు ఖాజీపేట, పెండ్లిమర్రి, ఓబులవారిపల్లె మండలాల్లో అరాచకాలకు పాల్పడ్డారు. సాక్షి ప్రతినిధి కడప: పంచాయతీ ఎన్నికలు వేదికగా జిల్లాలో ప్రతిపక్ష టీడీపీ నేతలు దౌర్జన్యకాండకు దిగుతున్నారు. ఎన్నికలలో నిబంధనలను ఉల్లంఘించి డబ్బు పంపిణీ చేస్తున్నారు. తమకే ఓట్లు వేయాలంటూ ఓటర్లను బెదిరిస్తున్నారు. దీనిని అడ్డుకున్న పోలీసులను దుర్భాషలాడుతున్నారు. మీ సంగతి తేలుస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజల మద్దతు కోల్పోయి విచక్షణ మరిచి టీడీపీ నేతలు బరి తెగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి తీరును ప్రజలు నిరసిస్తున్నారు. తాజాగా బుధవారం ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, ఆయన సోదరులు ఎన్నికల్లో డబ్బు పంచుతూ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో పోలీసులు రెడ్యం సోదరులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో రెచ్చిపోయిన రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పోలీసులపై దుర్భాషలకు దిగారు. మీ సంగతి తేలుస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. (చదవండి: టీడీపీ కిడ్నాప్ డ్రామా బట్టబయలు..) రెడ్యం సోదరుడు రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి సతీమణి రెడ్యం అరుణ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో బుధవారం ఉదయం పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో డబ్బు పంపిణీతోపాటు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వెళ్లారు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన వారి అనుచరులు డబ్బులు పంపిణీ అర్ధంతరంగా నిలిపివేసి పరారు కాగా రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డితోపాటు మరికొందరు పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి కొంత మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకుని వారిని ఖాజీపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు.(చదవండి: స్థానిక ఎన్నికలు: బీజేపీ.. ఓటుకు రేటు) ఆ తర్వాత పోలీసులు దుంపలగట్టు గ్రామంలో ఇరువర్గాల ఇళ్లను తనిఖీ చేసేందుకు వెళ్లారు. తన సోదరులు డబ్బు పంపిణీలో పట్టుబడి స్టేషన్లో ఉన్నారన్న విషయం తెలుసుకున్న రెడ్యం వెంకట సుబ్బారెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులు తనిఖీలో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన సోదరులనే అరెస్టు చేస్తావా...అంటూ రెడ్యంతోపాటు ఆయన కుటుంబ సభ్యులు అక్కడున్న ఎస్ఐతోపాటు మిగిలిన పోలీసులను చుట్టుముట్టి బెదిరింపులకు దిగారు. పోలీసులను బెదిరించకూడదంటూ ఎస్ఐ ఎంత చెప్పినా వినకుండా రెడ్యం మరింత రెచ్చిపోయారు. ఎస్ఐ, సీఐలపై దౌర్జన్యానికి దిగారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి పోలీసులు రెడ్యం సోదరులపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే చాపాడు మండలం బద్రిపల్లెలో ఈనెల 1వ తేదీన టీడీపీ వర్గీయులు దళితులపై దౌర్జన్యానికి దిగారు. తాము చెప్పినట్లు నామినేషన్ వేయాలని, ఉపసంహరణకు వీలు లేదని నెర్రవాడ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దళితులను బెదిరించారు. బద్రిపల్లె పరిధిలోని దళితులందరూ వైఎస్సార్ సీపీ మద్దతుదారుడికి మద్దతుగా నిలవాలని నిర్ణయించారు. అయితే పంచాయతీ పరిధిలోని 9వ వార్డులో టీడీపీ నేతలు చంద్రలీల అనే మహిళ చేత బలవంతంగా నామినేషన్ వేయించారు. టీడీపీ వారి దౌర్జన్యాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. చివరకు నామినేషన్ ఉపసంహరించేందుకు సిద్ధమయ్యారు. అయితే నామినేషన్ ఉపసంహరణకు వీలు లేదంటూ టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. దీనిని నిరసించిన దళితులు పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన చేయడంతోపాటు టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతూ ఓటర్లను భయబ్రాంతులకు గురి చేయడమే కాకుండా ప్రలోభ పర్వానికి తెర లేపారు. ఏకంగా పోలీసులపైనే దౌర్జన్యానికి దిగుతున్నారు. టీడీపీ నేతల చర్యలను ప్రజలు నిరసిస్తున్నారు. రెడ్యంపై కేసు నమోదు ఖాజీపేట: నాకా బందీ నిర్వహిస్తున్న పోలీసులను అడ్డుకుని వారిని దుర్భాషలాడి విధులకు ఆటంకం కల్గించిన సంఘటనపై టీడీపీ నాయకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ఆయన సతీమణి రెడ్యం లక్ష్మి ప్రసన్న తోపాటు మరికొందరి పై కేసు నమోదు చేశారు. దుంపలగట్టు గ్రామంలో బుధవారం ఉదయం మైదుకూరు రూరల్ సీఐ కొండారెడ్డి, ఎస్ఐలు అరుణ్‌రెడ్డి, శ్రీనివాసులు, కుళ్లాయప్పతో పాటు పోలీసు సిబ్బంది నాకాబందీ నిర్వహించారు. అందులో భాగంగా రెడ్యం ఇంటి వద్దకు రాగానే పోలీసులను దూషిస్తూ మాట్లాడారు. దీనిపై కేసు నమోదు చేశారు. అలాగే పంచాయతీ ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకులు రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి, రెడ్యం ఆదినారాయణరెడ్డి, ఆదిముల్లా మల్లికార్జున, గంగా సుబ్బరాయుడుతో పాటు తవ్వా రామసుబ్బారెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 1040లను స్వాదీనం చేసుకున్నారు. పోలీసులను చూసి వారి వద్ద ఉన్న డబ్బును ముళ్ల పొదల్లోకి విసిరేశారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేశామని రూరల్ సీఐ కొండారెడ్డి తెలిపారు. -
కూలీల డబ్బులు కాజేశారు!
బషీరాబాద్: ఉపాధి హామీ కూలి డబ్బుల పంపిణీలో మణిపాల్ సిబ్బంది, సీఎస్పీలు చేతివాటం ప్రదర్శించారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, సామాజిక పింఛన్ల అందజేతలో భారీ అవకతవకలకు పాల్పడ్డారు. ప్రతినెలా 330 మంది పేరిట మణిపాల్ సిబ్బంది, సీఎస్పీలు రూ.82,500 స్వాహా చేస్తూ వస్తున్నారు. కూలీలకు డబ్బులు చెల్లించినట్లు రికార్డులు సృష్టించిన సీఎస్పీలు, మణిపాల్ సంస్థ మండల కోఆర్డినేటర్లు పేదల కడుపుకొడుతూ వస్తున్న విషయం తాజాగా వెలుగు చూసింది. గురువారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జయమ్మ అధ్యక్షతన గ్రామసభ జరిగింది. ఇందులో సామాజిక పింఛన్లు, ఉపాధి పనులకు సంబంధించి పలు అక్రమాలు జరిగినట్లు వాస్తవాలు వెల్లడయ్యాయి. స్థానిక సీఎస్పీ ఉపాధి కూలీలకు, పింఛన్‌దారులకు, విద్యార్థులకు స్కాలర్షిప్ డబ్బులు అందించినట్లు రికార్డులు సృష్టించి రూ.5.5 లక్షలు స్వాహా చేశారని సామాజిక తనిఖీలో వెలుగుచూసింది. కాగా ఈ గ్రామ సభకు సీఎస్పీ హాజరు కాలేదు. అవకవతవలకు పాల్పడినవారిపై కేసు నమోదు చేయాలని, కూలిడబ్బులు ఇప్పించాలంటూ పలువురు కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ అధికారులు, సీఎస్పీలు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను తమ దృష్టికి తీసుకురాకపోవడంపై సర్పంచ్ జయమ్మ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయలు దుర్వినియోగమయ్యాక గ్రామసభకు పిలవడం ఏంటని ప్రశ్నించారు. 330 మంది చిరునామా లేని వారికి ప్రతినెలా డబ్బులు చెల్లించడం ఏమిటని విస్మయం చెందారు. 25 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వకుండానే ఇచ్చినట్లు గ్రామసభలో వెల్లడయింది. ఆమ్ ఆద్మీ పథకంలో భాగంగా ఆరుగురు మృతిచెందినట్లు రికార్డులు సృష్టించి బీమా డబ్బులను డ్రా చేసినట్లు బయటపడింది. ఇందులో ఐదుగురు గ్రామంలోనే లేరని నాయకులు, గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేశారు. ఇందిరానగర్‌కు చెందిన లక్షప్ప అనే యువకుడు మృతిచెందినట్లు రూ. 30 వేలు స్వాహా చేశారని సామాజిక తనిఖీ బృందం తేల్చింది. సీఎస్పీలను తొలగించాలి.. ఉపాధి కూలీల డబ్బులు, సామాజిక పింఛన్లు పంపిణీ చేసే సీఎస్పీలను తొలగించి డబ్బులు నేరుగా అందించాలని స్థానికులు డిమాండ్ చేశారు. మణిపాల్ సంస్థ సిబ్బందితో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీఓ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
‘రెండో విడత’ టీడీపీ డబ్బు పంపిణీ
సాక్షి, తిరుపతి: రెండో విడత పరిషత్ ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రంతో తెరపడటంతో ఓటర్లను తాయిలాలతో ఆకట్టుకునేందు కు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. పోలింగ్ కు 24 గంటలు మాత్రమే సమయం ఉండటంతో డబ్బు పంపిణీతో పాటు రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తోంది. తొలివిడతలో భారీగా డబ్బు పంపిణీ చేసినా ఓటింగ్ సరళి అనుకూలంగా లేకపోవడంతో రెండో విడత మరింత ఎక్కువగా పంపిణీ చే స్తున్నారు. ఆ పార్టీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ అభ్యర్థి, జెడ్పీటీసీ అభ్యర్థులు, ఎంపీపీ అభ్యర్థులు పోటీలు పడి ఎంపీటీసీ అభ్యర్థులకు డబ్బు చేరవేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎంపీటీసీ అభ్యర్థులు డబ్బుతో పాటు తాయిలాల పం పిణీలో తలమునకలయ్యారు. సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం మండలంలో టీడీపీ వారు రూ.కోటి వరకు పంపిణీ చేశారని సమాచారం. ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ ఓటుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. సత్యవేడు మండలం లో ఒక్కో ఎంపీటీసీ స్థానానికి పది లక్షల రూపాయలు అందజేశారు. ఇక్కడ ఓట్ల సంఖ్యతో పనిలేకుండా ఇంటికి రెండు వేల రూపాయల వంతున పంపిణీ చేస్తున్నారు. పుత్తూరు మండలంలో మహిళలకు ముక్కుపుడకలు, వెండి కుంకుమ భరిణెలు, యువకులకు క్రికెట్ కిట్లు అందజేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి బ్యాలెట్ నమూనాలు చూపించి తాయిలాలు ఇస్తున్నారు. ఇక్కడ మద్యం కూడా భారీగా పంపిణీ చేస్తున్నారు. ఈ వ్యవహారం పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. పూతలపట్టు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ ఓటుకు 500 నుంచి వెయ్యి రూపాయలు వంతున పం పిణీ చేస్తున్నారు. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో గురువారం డబ్బు పంపిణీ చేపట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. -
‘కట్టలు’ తెగుతున్నాయ్.. కోట్లు మారుతున్నాయ్
పాలకొల్లు/తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : మునిసిపల్ ఎన్నికల ప్రచారం గడువు శుక్రవారం సాయంత్రంతో ముగియడంతో అభ్యర్థులు ఆఖరి అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ప్రచారం ముగిసిందో లేదో నోట్ల కట్టలు తెగిపడ్డాయి. పాలకొల్లులో సుమారు రూ. 5 కోట్ల మేర పంపిణీ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా పెద్దమొత్తంలో డబ్బు పంపిణీ జరగడం విశేషం. గతంలోజరిగిన ఎన్నికల్లో గృహోపకరణాలు, చీరలు వంటి బహుమతులు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో అభ్యర్థులు నగదు పంపిణీపైనే ఎక్కువగా దృష్టిపెట్టారు. పాలకొల్లు పట్టణంలో టీడీపీకి చెందిన పలువురు అభ్యర్థులు శుక్రవారం సాయంత్రం నుంచే నగదు పంపిణీని ప్రారంభించారు. కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా నగదు పంపిణీలో ముందున్నారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కో ఓటరుకు రూ.500 నుంచి రూ.3 వేల వరకు పంపిణీ చేస్తున్నట్టు తెలిసింది. పట్టణంలోని ఒక వార్డులో ప్రముఖుడు పోటీ చేయడంతో అందరి దృష్టి దానిపైనే ఉంది. ఆయన ఒక్కో ఓటరుకు రూ. 3 వేలు చొప్పున పంపిణీ చేసినట్లు చెబుతున్నారు. కొంతమంది అభ్యర్థులు ఎన్నికల రోజు తెల్లవారుజామున మహిళలకు ప్రత్యేకంగా చీరలు పంపిణీ చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. తాడేపల్లిగూడెం పట్టణంలోనూ ఇదే పరిస్థితి. పట్టణంలో ఓటర్లకు పంచేందుకు గోదాములలో ఓ పార్టీకి చెందిన వ్యక్తులు పట్టు పంచెలు, పట్టు జాకెట్లు సిద్ధంగా ఉంచినట్టు సమాచారం. చీరలు, హాట్ ప్యాక్‌లు నజరానాలుగా ఇవ్వడానికి అభ్యర్థులు రూట్ మ్యాప్‌లు సిద్ధం చేశారు. ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ. 2 వేల వరకు పంపకాలు జరుగుతున్నాయి. ఓ పార్టీకి చెందిన నేత రెండు వార్డులలో నోట్లను ఓటు స్లిప్‌కు పిన్ చేసి మరీ పంచుతున్నట్టు ఓటర్లు చెబుతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు మిన్నకుండిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో వైసీపీకి చెందిన అభ్యర్థులను టార్గెట్ చేసుకుని ఇబ్బందిపెడుతున్నట్టు ఆ పార్టీ అభ్యర్థులు వాపోతున్నారు.