బషీరాబాద్: ఉపాధి హామీ కూలి డబ్బుల పంపిణీలో మణిపాల్ సిబ్బంది, సీఎస్పీలు చేతివాటం ప్రదర్శించారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, సామాజిక పింఛన్ల అందజేతలో భారీ అవకతవకలకు పాల్పడ్డారు. ప్రతినెలా 330 మంది పేరిట మణిపాల్ సిబ్బంది, సీఎస్పీలు రూ.82,500 స్వాహా చేస్తూ వస్తున్నారు. కూలీలకు డబ్బులు చెల్లించినట్లు రికార్డులు సృష్టించిన సీఎస్పీలు, మణిపాల్ సంస్థ మండల కోఆర్డినేటర్‌లు పేదల కడుపుకొడుతూ వస్తున్న విషయం తాజాగా వెలుగు చూసింది. గురువారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జయమ్మ అధ్యక్షతన గ్రామసభ జరిగింది. ఇందులో సామాజిక పింఛన్‌లు, ఉపాధి పనులకు సంబంధించి పలు అక్రమాలు జరిగినట్లు వాస్తవాలు వెల్లడయ్యాయి.
స్థానిక సీఎస్పీ ఉపాధి కూలీలకు, పింఛన్‌దారులకు, విద్యార్థులకు స్కాలర్‌షిప్ డబ్బులు అందించినట్లు రికార్డులు సృష్టించి రూ.5.5 లక్షలు స్వాహా చేశారని సామాజిక తనిఖీలో వెలుగుచూసింది. కాగా ఈ గ్రామ సభకు సీఎస్పీ హాజరు కాలేదు. అవకవతవలకు పాల్పడినవారిపై కేసు నమోదు చేయాలని, కూలిడబ్బులు ఇప్పించాలంటూ పలువురు కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ అధికారులు, సీఎస్పీలు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను తమ దృష్టికి తీసుకురాకపోవడంపై సర్పంచ్ జయమ్మ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.
లక్షలాది రూపాయలు దుర్వినియోగమయ్యాక గ్రామసభకు పిలవడం ఏంటని ప్రశ్నించారు. 330 మంది చిరునామా లేని వారికి ప్రతినెలా డబ్బులు చెల్లించడం ఏమిటని విస్మయం చెందారు. 25 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వకుండానే ఇచ్చినట్లు గ్రామసభలో వెల్లడయింది. ఆమ్ ఆద్మీ పథకంలో భాగంగా ఆరుగురు మృతిచెందినట్లు రికార్డులు సృష్టించి బీమా డబ్బులను డ్రా చేసినట్లు బయటపడింది. ఇందులో ఐదుగురు గ్రామంలోనే లేరని నాయకులు, గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేశారు. ఇందిరానగర్‌కు చెందిన లక్షప్ప అనే యువకుడు మృతిచెందినట్లు రూ. 30 వేలు స్వాహా చేశారని సామాజిక తనిఖీ బృందం తేల్చింది.
సీఎస్పీలను తొలగించాలి..
ఉపాధి కూలీల డబ్బులు, సామాజిక పింఛన్లు పంపిణీ చేసే సీఎస్పీలను తొలగించి డబ్బులు నేరుగా అందించాలని స్థానికులు డిమాండ్ చేశారు. మణిపాల్ సంస్థ సిబ్బందితో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీఓ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
కూలీల డబ్బులు కాజేశారు!
Published Fri, Dec 5 2014 12:12 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement