పోలీసులతో వాగ్వాదం చేస్తున్న రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, కుటుంబ సభ్యులు
జిల్లాలో తెలుగుదేశం నాయకుల దాష్టీకాలు పెరిగిపోతున్నాయి. ఉనికి చాటుకునేందుకు దాడులకు దిగుతున్నారు. మొన్న చాపాడులో దళితులపై దౌర్జన్యకాండ సాగించిన నేతలు నేడు ఖాజీపేట, పెండ్లిమర్రి, ఓబులవారిపల్లె మండలాల్లో అరాచకాలకు పాల్పడ్డారు.
సాక్షి ప్రతినిధి కడప: పంచాయతీ ఎన్నికలు వేదికగా జిల్లాలో ప్రతిపక్ష టీడీపీ నేతలు దౌర్జన్యకాండకు దిగుతున్నారు. ఎన్నికలలో నిబంధనలను ఉల్లంఘించి డబ్బు పంపిణీ చేస్తున్నారు. తమకే ఓట్లు వేయాలంటూ ఓటర్లను బెదిరిస్తున్నారు. దీనిని అడ్డుకున్న పోలీసులను దుర్భాషలాడుతున్నారు. మీ సంగతి తేలుస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజల మద్దతు కోల్పోయి విచక్షణ మరిచి టీడీపీ నేతలు బరి తెగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి తీరును ప్రజలు నిరసిస్తున్నారు. తాజాగా బుధవారం ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, ఆయన సోదరులు ఎన్నికల్లో డబ్బు పంచుతూ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో పోలీసులు రెడ్యం సోదరులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో రెచ్చిపోయిన రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పోలీసులపై దుర్భాషలకు దిగారు. మీ సంగతి తేలుస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. (చదవండి: టీడీపీ కిడ్నాప్ డ్రామా బట్టబయలు..)
రెడ్యం సోదరుడు రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి సతీమణి రెడ్యం అరుణ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో బుధవారం ఉదయం పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో డబ్బు పంపిణీతోపాటు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వెళ్లారు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన వారి అనుచరులు డబ్బులు పంపిణీ అర్ధంతరంగా నిలిపివేసి పరారు కాగా రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డితోపాటు మరికొందరు పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి కొంత మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకుని వారిని ఖాజీపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు.(చదవండి: స్థానిక ఎన్నికలు: బీజేపీ.. ఓటుకు రేటు)
ఆ తర్వాత పోలీసులు దుంపలగట్టు గ్రామంలో ఇరువర్గాల ఇళ్లను తనిఖీ చేసేందుకు వెళ్లారు. తన సోదరులు డబ్బు పంపిణీలో పట్టుబడి స్టేషన్‌లో ఉన్నారన్న విషయం తెలుసుకున్న రెడ్యం వెంకట సుబ్బారెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులు తనిఖీలో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన సోదరులనే అరెస్టు చేస్తావా...అంటూ రెడ్యంతోపాటు ఆయన కుటుంబ సభ్యులు అక్కడున్న ఎస్‌ఐతోపాటు మిగిలిన పోలీసులను చుట్టుముట్టి బెదిరింపులకు దిగారు. పోలీసులను బెదిరించకూడదంటూ ఎస్‌ఐ ఎంత చెప్పినా వినకుండా రెడ్యం మరింత రెచ్చిపోయారు. ఎస్‌ఐ, సీఐలపై దౌర్జన్యానికి దిగారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి పోలీసులు రెడ్యం సోదరులపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే చాపాడు మండలం బద్రిపల్లెలో ఈనెల 1వ తేదీన టీడీపీ వర్గీయులు దళితులపై దౌర్జన్యానికి దిగారు. తాము చెప్పినట్లు నామినేషన్ వేయాలని, ఉపసంహరణకు వీలు లేదని నెర్రవాడ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దళితులను బెదిరించారు. బద్రిపల్లె పరిధిలోని దళితులందరూ వైఎస్సార్ సీపీ మద్దతుదారుడికి మద్దతుగా నిలవాలని నిర్ణయించారు.
అయితే పంచాయతీ పరిధిలోని 9వ వార్డులో టీడీపీ నేతలు చంద్రలీల అనే మహిళ చేత బలవంతంగా నామినేషన్ వేయించారు. టీడీపీ వారి దౌర్జన్యాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. చివరకు నామినేషన్ ఉపసంహరించేందుకు సిద్ధమయ్యారు. అయితే నామినేషన్ ఉపసంహరణకు వీలు లేదంటూ టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. దీనిని నిరసించిన దళితులు పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన చేయడంతోపాటు టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతూ ఓటర్లను భయబ్రాంతులకు గురి చేయడమే కాకుండా ప్రలోభ పర్వానికి తెర లేపారు. ఏకంగా పోలీసులపైనే దౌర్జన్యానికి దిగుతున్నారు. టీడీపీ నేతల చర్యలను ప్రజలు నిరసిస్తున్నారు.
రెడ్యంపై కేసు నమోదు
ఖాజీపేట: నాకా బందీ నిర్వహిస్తున్న పోలీసులను అడ్డుకుని వారిని దుర్భాషలాడి విధులకు ఆటంకం కల్గించిన సంఘటనపై టీడీపీ నాయకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ఆయన సతీమణి రెడ్యం లక్ష్మి ప్రసన్న తోపాటు మరికొందరి పై కేసు నమోదు చేశారు. దుంపలగట్టు గ్రామంలో బుధవారం ఉదయం మైదుకూరు రూరల్ సీఐ కొండారెడ్డి, ఎస్‌ఐలు అరుణ్‌రెడ్డి, శ్రీనివాసులు, కుళ్లాయప్పతో పాటు పోలీసు సిబ్బంది నాకాబందీ నిర్వహించారు. అందులో భాగంగా రెడ్యం ఇంటి వద్దకు రాగానే పోలీసులను దూషిస్తూ మాట్లాడారు. దీనిపై కేసు నమోదు చేశారు. అలాగే పంచాయతీ ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకులు రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి, రెడ్యం ఆదినారాయణరెడ్డి, ఆదిముల్లా మల్లికార్జున, గంగా సుబ్బరాయుడుతో పాటు తవ్వా రామసుబ్బారెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 1040లను స్వాదీనం చేసుకున్నారు. పోలీసులను చూసి వారి వద్ద ఉన్న డబ్బును ముళ్ల పొదల్లోకి విసిరేశారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేశామని రూరల్ సీఐ కొండారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment