The distribution of voter slips
-
అదే తీరు..మారని ఓటరు
బల్దియా ఎన్నికల్లో పెరగని ఓటింగ్ శాతం కొందరి ఓట్లు గల్లంతు ఓటరు స్లిప్పుల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం విద్యావంతుల్లో నిర్లిప్తత సిటీబ్యూరో: ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటి ఓటు హక్కును వినియోగించుకోవడంపై గ్రేటర్‌లోని మెజార్టీ ఓటర్లు శ్రద్ధ చూపలేదు. బల్దియా ఎన్నికల్లో కొన్ని డివిజన్లలో పోలింగ్ 45 శాతం...మరికొన్ని చోట్ల 35శాతం మించకపోవడం ఇదే విషయాన్ని సుస్పష్టం చేస్తోంది. ఇది నాణేనికి ఒక పార్శ్వంకాగా.. ఓటర్ల నిర్లిప్తతకు ఇతర కారణాలూ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. ఓటేయాలన్న కోరిక పౌరుల్లో బలంగా ఉన్నప్పటికీ... వివిధ రాజకీయ పార్టీలు కార్పొరేటర్ అభ్యర్థులను ఎంపిక చేసిన తీరు బాగాలేదని...ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకోవడం, డబ్బు, మద్యం పంపిణీతో ఓటర్లను ప్రలోభ పెట్టడం చూసి...విరక్తితో పోలింగ్‌కు దూరంగా ఉండిపోయారని చెబుతున్నారు. ఎన్నికల్లో ఓటేసినా తమ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన నిధులు, అధికారాలు బల్దియాకు లేవని.. అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయని ఓటర్లు అభిప్రాయపడుతున్నారని చెబుతున్నారు. ఓటేసినా.. వేయకున్నా ఒరిగేదేమీ లేదన్న నిస్పృహతోనే చాలామంది దూరంగా ఉన్నట్లు విశేషిస్తున్నారు. కారణాలెన్నో... మెహిదీపట్నం డివిజన్లో 34.28 శాతం, విజయనగర్ కాలనీలో 34.51 , అహ్మద్‌నగర్‌లో 37.11 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం పాతనగరంలో వివిధ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు అలజడి రేగడంతో పలువురు ఓటర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. జీహెచ్ఎంసీ అధికారులు ఈ డివిజన్లలో ఓటరు స్లిప్పులు సరిగా పంపిణీ చేయకపోవడం, భర్తకు ఓ డివిజన్లో.. భార్యకు మరో డివిజన్లో ఓటు హక్కు ఉండడం, మరికొందరి ఓట్లు గల్లంతవడం పోలింగ్ భారీగా పడిపోవడానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు.సరూర్‌నగర్ డివిజన్లో 37.89 శాతమే ఓటింగ్ నమోదైంది. దీనికి ప్రధాన కారణం ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్లలోనే ఉండిపోవడం. చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు పనుల్లో నిమగ్నమవడంతో ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గింది. కొన్నిచోట్ల ఓటర్లకు స్లిప్పులు అందలేదు. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు తమ ఐడీ కార్డులను మాత్రమే తీసుకొచ్చి అవస్థలు పడ్డారు. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓట్లు గల్లంతయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. వివేకానంద నగర్ డివిజన్లో అపార్ట్మెంట్ల వాసుల ఓట్లు కొన్ని గల్లంతయ్యాయి. గోషామహల్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి.మరికొన్ని చోట్ల ఓటరు కార్డులతో పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారు జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.ఓటర్ల జాబితాలో కొందరి పేర్లు రెండు, మూడు ప్రాంతాల్లో ఉండడంతో ఎక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో తెలియక గందరగోళానికి గురయ్యారు.2011, 2014లలో గ్రేటర్ జనాభా, ఓటర్ల లెక్కకు పొంతన కుదరకపోవడం కూడా పోలింగ్ శాతం తగ్గేందుకు కారణమని భావిస్తున్నారు. గత అనుభవాలే కారణమా? గత బల్దియా ఎన్నికల్లో తాము ఎన్నుకున్న కార్పొరేటర్లు సమస్యల పరిష్కారం విషయంలో... అందుబాటులో ఉండే విషయంలో తమను నిరాశ పరచడంతో పలువురు ఓటుకు దూరంగా ఉన్నట్లు విశ్లేషకుల అంచనా. ప్రామాణ్య స్ట్రాటజీ అనే రాజకీయ పరిశోధన సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో పలువురు ఓటర్లు ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. గతంలో తాము ఎన్నుకున్న కార్పొరేటర్లు ఫిర్యాదులపై స్పందించారని 39.8 శాతం మంది తెలపగా.. అంతగా చొరవ చూపలేదని, ముభావంగా స్పందించారని, చూద్దాం..చేద్దాం అన్న ధోరణితో వ్యవహరించారని 25.3 శాతం మంది తెలిపారు. 34.8 శాతం మంది తాము ఎనుకున్న కార్పొరేటర్లు సమస్యల వైపు కన్నెత్తి చూడలేదని కుండబద్దలు కొట్టడం ప్రస్తావనార్హం. -
ఇళ్లలోనూ సోదాలు!
నాకాబందీలు మరింత ముమ్మరం కీలక ప్రాంతాల మ్యాపుల అధ్యయనం ఉన్నతాధికారులతో కమిషనర్ల సమీక్ష ఓటరు స్లిప్పుల పంపిణీపై నిఘా అనుమానితుల కదలికపై డేగ కన్ను సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వం ముగియడం... కీలక ఘట్టమైన పోలింగ్ దగ్గర పడటంతో జంట కమిషనరేట్ల పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా ఎన్నికల ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించడానికితీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు పూర్తి చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ అన్ని విభాగాల ఉన్నతాధికారులతో విసృ్తత స్థాయి సమీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు రహదారులు, లాడ్జిలు, పబ్లిక్ ప్రదేశాలకు మా త్రమే పరిమితమైన తనిఖీలను రానున్న రెండు రోజు ల్లో అనుమానాస్పద ఇళ్లకూ విస్తరింపజేయాలని నిర్ణయించారు. దాదాపు 15 రోజులుగా పోలీసులు చేసిన తనిఖీల్లో భారీ మొత్తాలే దొరికాయి. అవి పార్టీలకు సంబంధించిన వని చెప్పడానికి పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ నేపథ్యంలోనే ఆది, సోమవారాల్లో నిఘా, తనిఖీలు మరింత విస్తరించాలని నిర్ణయించారు. మంగళవారం పోలింగ్ ఉండటంతో ఈ రెండు రోజులూ ఓటర్లను ప్రలోభ పెట్టడానికి నగదు, మద్యం పంపిణీలు జోరుగా సాగుతాయని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోపక్క కొన్ని రాజకీయ పార్టీలు ద్విచక్ర వాహనాలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులనూ పంపిణీకి సిద్ధం చేస్తున్నాయనే సమాచారం అందుకున్న పోలీసులు ఈ విషయాలనూ సీరియస్‌గా తీసుకున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న జంట కమిషనర్లు పక్కా ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశిం చారు. అనుమానాస్పదంగా ఉన్నా, ఏదైనా సమాచారం అందినా ఇళ్లలోనూ సోదాలు చేయాలని స్పష్టం చేశారు. వీటి వల్ల సామాన్యులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మ్యాపుల అధ్యయనం... మఫ్టీ సిబ్బంది ఎన్నికల నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాలను అక్కడి పరిస్థితుల ఆధారంగా సున్నిత, అతి సున్నిత, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక విభాగాలుగా విభజించారు. వీటికి సంబంధించిన మ్యాపులను అధ్యయనం చేస్తున్నారు. ఏయే ప్రాంతాల్లో సమస్యలు సృష్టించే ఆస్కారం ఉంది? ఎటు నుంచి అల్లరి మూకలు విరుచుకుపడే ప్రమాదం ఉంది? తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని మ్యాపుల్లో మార్కింగ్ చేస్తున్నారు. వీటికి అనుగుణంగా ఆ ప్రాంతాల్లో సిబ్బందిని నియమిస్తారు. పోలింగ్ రోజు కొన్ని కీలక ప్రాంతాల్లో భారీగా సాయుధ బలగాలను రంగంలోకి దింపనున్నారు. మహి ళా పోలీసులనూ ఎక్కువ సంఖ్యలోనే నియమిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అణువణువూ చిత్రీకరించేలా వీడి యో, డిజిటల్ కెమెరాలు వినియోగిస్తున్నారు. భారీ స్థాయిలో మఫ్టీ దళాలను రంగంలోకి దింపుతున్నారు. నగర వ్యాప్తంగా ఉండే ఈ పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలతో పాటు అనుమానాస్పద వ్యక్తులను అనునిత్యం వెంటాడుతూ ఉంటారు. సాధారణంగా స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది మాత్రమే మఫ్టీల్లో సంచరిస్తుంటారు. ఈసారి మాత్రం వీరితో పాటు ఇతర విభాగాల అధికారులనూ మఫ్టీల్లో మోహరిస్తున్నారు. ‘స్లిప్పర్ల’పై డేగకన్ను... నగర వ్యాప్తంగా నాకాబందీలతో పాటు ప్రత్యేకంగా అనుమానాస్పద ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఓటరు స్లిప్పులను సరఫరా చేయడం రాజ కీయ పార్టీలకు పరిపాటి. ఈసారి ఎన్నికల సంఘం అనేక ఏర్పాట్లు చేసినప్పటికీ నిరక్షరాస్యులు తదితరులకు స్లిప్పులు పంచడానికి కొందరు సంచరిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ ‘స్లిప్పర్ల’ ద్వారా నగదు, మద్యం పంపిణీ చేయిస్తారనే అనుమానాల నేపథ్యంలో వీరి కదలికలను క్షుణ్ణంగా పర్యవేక్షించాలని నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేకంగా మొబైల్, షాడో పార్టీలను రంగంలోకి దింపారు.