ఇళ్లలోనూ సోదాలు!
నాకాబందీలు మరింత ముమ్మరం
కీలక ప్రాంతాల మ్యాపుల అధ్యయనం
ఉన్నతాధికారులతో కమిషనర్ల సమీక్ష
ఓటరు స్లిప్పుల పంపిణీపై నిఘా
అనుమానితుల కదలికపై డేగ కన్ను
సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వం ముగియడం... కీలక ఘట్టమైన పోలింగ్ దగ్గర పడటంతో జంట కమిషనరేట్ల పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా ఎన్నికల ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించడానికితీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు పూర్తి చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ అన్ని విభాగాల ఉన్నతాధికారులతో విసృ్తత స్థాయి సమీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు రహదారులు, లాడ్జిలు, పబ్లిక్ ప్రదేశాలకు మా త్రమే పరిమితమైన తనిఖీలను రానున్న రెండు రోజు ల్లో అనుమానాస్పద ఇళ్లకూ విస్తరింపజేయాలని నిర్ణయించారు. దాదాపు 15 రోజులుగా పోలీసులు చేసిన తనిఖీల్లో భారీ మొత్తాలే దొరికాయి. అవి పార్టీలకు సంబంధించిన వని చెప్పడానికి పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ నేపథ్యంలోనే ఆది, సోమవారాల్లో నిఘా, తనిఖీలు మరింత విస్తరించాలని నిర్ణయించారు.
మంగళవారం పోలింగ్
ఉండటంతో ఈ రెండు రోజులూ ఓటర్లను ప్రలోభ పెట్టడానికి నగదు, మద్యం పంపిణీలు జోరుగా సాగుతాయని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోపక్క కొన్ని రాజకీయ పార్టీలు ద్విచక్ర వాహనాలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులనూ పంపిణీకి సిద్ధం చేస్తున్నాయనే సమాచారం అందుకున్న పోలీసులు ఈ విషయాలనూ సీరియస్‌గా తీసుకున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న జంట కమిషనర్లు పక్కా ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశిం చారు. అనుమానాస్పదంగా ఉన్నా, ఏదైనా సమాచారం అందినా ఇళ్లలోనూ సోదాలు చేయాలని స్పష్టం చేశారు. వీటి వల్ల సామాన్యులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మ్యాపుల అధ్యయనం... మఫ్టీ సిబ్బంది
ఎన్నికల నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాలను అక్కడి పరిస్థితుల ఆధారంగా సున్నిత, అతి సున్నిత, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక విభాగాలుగా విభజించారు. వీటికి సంబంధించిన మ్యాపులను అధ్యయనం చేస్తున్నారు. ఏయే ప్రాంతాల్లో సమస్యలు సృష్టించే ఆస్కారం ఉంది? ఎటు నుంచి అల్లరి మూకలు విరుచుకుపడే ప్రమాదం ఉంది? తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని మ్యాపుల్లో మార్కింగ్ చేస్తున్నారు. వీటికి అనుగుణంగా ఆ ప్రాంతాల్లో సిబ్బందిని నియమిస్తారు. పోలింగ్ రోజు కొన్ని కీలక ప్రాంతాల్లో భారీగా సాయుధ బలగాలను రంగంలోకి దింపనున్నారు. మహి ళా పోలీసులనూ ఎక్కువ సంఖ్యలోనే నియమిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అణువణువూ చిత్రీకరించేలా వీడి యో, డిజిటల్ కెమెరాలు వినియోగిస్తున్నారు. భారీ స్థాయిలో మఫ్టీ దళాలను రంగంలోకి దింపుతున్నారు. నగర వ్యాప్తంగా ఉండే ఈ పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలతో పాటు అనుమానాస్పద వ్యక్తులను అనునిత్యం వెంటాడుతూ ఉంటారు. సాధారణంగా స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది మాత్రమే మఫ్టీల్లో సంచరిస్తుంటారు. ఈసారి మాత్రం వీరితో పాటు ఇతర విభాగాల అధికారులనూ మఫ్టీల్లో మోహరిస్తున్నారు.
‘స్లిప్పర్ల’పై డేగకన్ను...
నగర వ్యాప్తంగా నాకాబందీలతో పాటు ప్రత్యేకంగా అనుమానాస్పద ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఓటరు స్లిప్పులను సరఫరా చేయడం రాజ కీయ పార్టీలకు పరిపాటి. ఈసారి ఎన్నికల సంఘం అనేక ఏర్పాట్లు చేసినప్పటికీ నిరక్షరాస్యులు తదితరులకు స్లిప్పులు పంచడానికి కొందరు సంచరిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ ‘స్లిప్పర్ల’ ద్వారా నగదు, మద్యం పంపిణీ చేయిస్తారనే అనుమానాల నేపథ్యంలో వీరి కదలికలను క్షుణ్ణంగా పర్యవేక్షించాలని నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేకంగా మొబైల్, షాడో పార్టీలను రంగంలోకి దింపారు.