బెట్టింగ్ బంగార్రాజులు!
‘గ్రేటర్’ ఎన్నికల నేపథ్యంలో పెరిగిన వ్యవహారాలు
నగర వ్యాప్తంగా స్పెషల్ టీమ్స్ నిఘా
ఆన్‌లైన్ వ్యవహారాల పైనా దృష్టి
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ ఘట్టం పూర్తయింది. పందెం రాయుళ్లకు పని పెరిగింది. దీంతో పోలీసులు బెట్టింగ్ వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించారు. ఈసారి పోలింగ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో పందాలు జోరందుకుంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోపక్క ఆన్‌లైన్ బెట్టింగుల పైనా నిఘా ఉంచాలని నిర్ణయించారు. వీటి నిర్వాహకులకు చెక్ చెప్పడానికి హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ) పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ‘గ్రేటర్’ పరిధిలోని 150 డివిజన్లకు పోలింగ్ పూర్తయి... అభ్యర్థుల భవిత ఈవీఎంలలోకి చేరింది. దీంతో నాయకులంతా ఎక్కడిక్కడ గెలుపోటముల లెక్కల్లో బిజీ అయిపోయారు. మంగళవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌తో పందెంరాయుళ్ల పల్స్ మారింది. దీంతో బుకీలు బెట్టింగులకు తెరలేపారు. కౌంటింగ్‌కు మరో రెండు రోజుల గడువు ఉండటంతో బెట్టింగ్స్ పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ పార్టీల చోటా నేతలతో సహా అనేక మంది రూ.లక్షల్లో బెట్టింగులకు పాల్పడతారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యవహారం జోరుగా సాగుతోందనే సమాచారం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అభ్యర్థుల ఖర్చు కంటే ఎక్కువగానే బెట్టింగులు పెడుతున్నట్టు పోలీసులు అంచనా.
డివిజన్ నుంచి మెజారిటీ వరకు...
ఈసారి బెట్టింగుల్లో కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల గెలుపోటముల పైనే కాకుండా... వారికి లభించే మెజారిటీ ఎంత? రెండో స్థానంలో ఎవరుంటారు? మొత్తమ్మీద గ్రేటర్‌లో ఏఏ పార్టీలు ఎలా ఉంటాయి? ఫలానా పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయి? అనే అంశాలపైనా జోరుగా పందా లు కడుతున్నారు. మరోపక్క రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పందాలరాయుళ్లతో ఫోన్‌లో టచ్‌లో ఉంటున్న బుకీలు గ్రేటర్ ఎన్నికలపై ఆన్‌లైన్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు. వీ టిపై దృష్టి పెట్టిన జంట కమిషనరేట్ల పోలీ సులు నిఘా ముమ్మరం చేశారు. బుకీల ఆట కట్టించడానికి చర్యలు తీసుకుంటున్నారు. స్థా నిక పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఓటీ అధికారులూ వేగులను అప్రమత్తం చేశారు.
ఈ ప్రాంతాల్లోనే అధికం...
శివార్లలోని అత్తాపూర్, శంషాబాద్, సరూర్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లతో పాటు నగరంలోని బేగంబజార్, కాచిగూడ, సికిం ద్రాబాద్, అబిడ్స్, మోతీనగర్, ఎస్సార్ నగర్, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాలు బెట్టింగ్ వ్యవహారాలకు కేంద్రాలుగా ఉన్నాయి. వీటికి తోడు నగరం బయట ఉన్న అనేక గెస్ట్‌హౌస్‌లు, ఫామ్ హౌస్‌లు బుకీలకు వేదికలుగా మారుతున్నాయని పోలీసుల అనుమానం. పార్టీ, అభ్యర్థి, డివిజన్‌లను బట్టి ఈ పందాల్లో 1:1 నుంచి 1:10 వరకు ఇచ్చేలా బుకీలు ఆకర్షిస్తున్నారు. ముంబయికి చెందిన కొందరు బుకీలు సైతం రంగంలోకి దిగారని తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఈ తరహా కేసుల్లో అరెస్టయి... బెయిల్‌పై విడుదలైన వారిపై డేగకన్ను వేసి ఉంచారు. బెట్టింగ్ పరిభాషలో పందాలు కాసే వారిని పంటర్లని, వీటిని నిర్వహించే వారిని బుకీలని సంబోధిస్తారు. అత్యంత గుట్టుగా వ్యవహారాలు సాగించే ‘కాయ్ రాజా’ల ఆట కట్టించడానికి ప్రజల సహకారం ఎంతో కీలకమని పోలీసులు చెబుతున్నారు. బెట్టింగ్ ముఠా లు, బుకీలకు సంబంధించిన సమాచారం తెలిస్తే తమకు అందించాలని కోరుతున్నారు. ఇలా సమాచారం ఇచ్చిన వారి పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇస్తున్నారు. ‘100’తో పాటు పోలీసు వెబ్‌సైట్లలోని నెంబర్లకు ఫోన్ చేసి, అధికారిక వాట్సాప్‌ల్లో పోస్ట్ చేయడం ద్వారా బెట్టింగ్ వ్యవహారాలను తమకు తెలియజేయవచ్చని కోరుతున్నారు. బెట్టింగ్ దందా చట్ట విరుద్ధమే కాకుండా పరోక్షంగా అనేక కుటుంబాలను రోడ్డున పడేస్తుందన్నారు.