దాడులు.. ఉద్రిక్తత | Enraged at the polling stations in the Majlis | Sakshi
Sakshi News home page

దాడులు.. ఉద్రిక్తత

Published Wed, Feb 3 2016 1:06 AM | Last Updated on Mon, Oct 8 2018 8:39 PM

దాడులు.. ఉద్రిక్తత - Sakshi

దాడులు.. ఉద్రిక్తత

పోలింగ్ కేంద్రాల వద్ద రెచ్చిపోయిన మజ్లిస్
 
జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది.  రెడ్‌హిల్స్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిని మజ్లిస్ పార్టీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లకుండా అడ్డగించి.. చంపేస్తామని కత్తితో బెదిరించారు. ఇదే డివిజన్ నుంచి పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థిపై ప్రొహిబెల్స్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద మజ్లిస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. అలాగే, చావణీ డివిజన్ టీఆర్‌ఎస్ అభ్యర్థిపైన, అక్బర్‌బాగ్ డివిజన్ ఎంబీటీ అభ్యర్థిపైన మజ్లిస్ కార్యకర్తలు దాడి కి పాల్పడటంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. వెంకటేశ్వరకాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై బంజారాహిల్స్‌లోని ఆల్ఫోన్సస్ హైస్కూల్ కేంద్రం వద్ద టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారు.
 
బయట తిరిగితే చంపేస్తాం
నాంపల్లి: రెడ్‌హిల్స్ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అయేషా ఫర్హీన్‌ను మజ్లిస్ పార్టీ కార్యకర్తలు చంపేస్తామని బెదిరించారు. పోలింగ్ సరళి తెలుసుకొనేందుకు మంగళవారం ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరారు. ఏసీగార్డ్స్‌లో ఉన్న నిలోఫర్ హెల్త్ స్కూల్  వద్దకు చేరుకున్న ఆమెకు పార్టీ అభ్యర్థి అయేషా ఫాతిమా, ఆమె భర్త సుభాన్ తదితరులు తారసపడ్డారు. మజ్లిస్ కార్యకర్తలు అయేషా షర్హీన్‌ను తక్షణం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. వారిలో షకీల్ అనే కార్యకర్త   ‘‘ఎంఐఎం అంటే ఏమిటో తెలుసు కదా...బయట తిరగొద్దని చెప్పినా తిరుగుతున్నావ్.. బతకాలనిలేదా.. కారెక్కి ఇంటికిపో’’ అని కత్తి చూపించి బెదిరించాడు. మజ్లిస్‌కు భయపడి వెళ్లేదిలేదని, చావో రేవో ఇక్కడే తేల్చుకుంటానని అయేషా ఫర్హీన్ తేల్చి చెప్పారు.  తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి అక్కడ గుమిగూడిన వారిని చెదరగొట్టారు. అయితే, అప్పటికే ఆమెను బెదిరించిన షకీల్ తదితరులు వెళ్లిపోగా.. మజ్లిస్ అభ్యర్థి అయేషా ఫాతిమా, ఆమె భర్త సుభాన్ మాత్రమే ఉన్నారు.  కాగా, బాధితురాలు అయేషా ఫర్హీన్‌కు నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు.  

ప్రొహిబెల్స్ స్కూల్ వద్ద రాళ్లు రువ్విన మజ్లిస్...
ప్రొహిబెల్స్ స్కూల్‌లో పోలింగ్ ముగుస్తున్న సమయంలో మజ్లిస్ పార్టీ కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని తెలిసి టీఆర్‌ఎస్ అభ్యర్థి మార్గం సరిత అక్కడికి వెళ్లారు. దీంతో మజ్లిస్ పార్టీ అభ్యర్థి సుభాన్ తన అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రంపై రాళ్లు రువ్వడంతో పలువురు టీఆర్‌ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి.  పోలీసులు అదనపు బలగాలను రప్పించి అల్లరిమూకలను తరిమిగొట్టారు.  ఈవీఎం బాక్స్‌లను సురక్షితంగా బయటకు తరలించారు. దాడికి పాల్పడ్డ మజ్లిస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు.
 
టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా  పని చేస్తున్నాడని దాడి

 జవహర్‌నగర్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పని చేస్తున్నాడని కౌకూర్‌లో ఓ వ్యక్తిపై కొందరు దాడికి పాల్పడ్డారు.  జవహర్‌నగర్ సీఐ నర్సింహరావు కథనం ప్రకారం.. యాప్రాల్ పరిధిలోని కౌకూర్ హరిజన బస్తీకి చెందిన పేరుపల్లి శ్యాంరావు (52) మంగళవారం జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పని చేస్తున్నాడనే నెపంతో బైక్‌లపై వచ్చి కొందరు కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రాజుయాదవ్, రాజారెడ్డి, చిట్టి, ఎల్లారెడ్డిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
కాంగ్రెస్ అభ్యర్థిపై టీఆర్‌ఎస్ ...
బంజారాహిల్స్: వెంకటేశ్వరకాలనీ కాంగ్రెస్ అభ్యర్థి బి.భారతిపై దాడి జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెం. 9లోని సెయింట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఎవరో రిగ్గింగ్‌కు యత్నిస్తున్నారని తెలిసి వెళ్లిన ఆమెను కొందరు దుర్భాషలాడి, కులం పేరుతో దూషించారు. భుజంపై చెయ్యి వేసి నెట్టేశారు. దీంతో ఆమె కిందపడిపోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీ చార్జి చేసి అల్లరిమూకలను చెదరగొట్టారు. కాంగ్రెస్‌కు బాగా ఓట్లు పడుతున్నాయని ఓర్వలేక  టీఆర్‌ఎస్ కార్యకర్తలు రిగ్గింగ్‌కు యత్నించారని, అడ్డుకోబోతే దాడి చేశారని భారతి రోదిస్తూ తెలిపారు.  పోలింగ్ బూత్ ముందు బైఠాయించి తనకు న్యాయంచేయాలని నినాదాలుచేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి మన్నె కవిత కూడా పోలింగ్ బూత్ ఎదుట బైఠాయించి కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తలు ఆవేశంతో కుర్చీలు ధ్వంసం చేసి.. రోడ్డుపై బైఠాయించారు. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేశారు. దీంతో అరగంటపాటు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా,  తనను కులం పేరుతో దూషించిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు మజిద్‌అలీ, జావెద్ అలీ, నిస్సార్‌అలీ, ఖదీర్‌లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని భారతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  
 
చావణీలో టీఆర్‌ఎస్ అభ్యర్థిపై దాడి...
చంచల్‌గూడ: చావణీ డివిజన్ టీఆర్‌ఎస్ అభ్యర్థి మహ్మద్ ఖలీమ్‌పై బాగేజారా ప్రాంతంలో ఎంఐఎం అభ్యర్థి ముర్తుజా అలీ అతని అనుచరులు దాడి చేసినట్లు రెయిన్‌బజార్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
 
ఎంబీటీ అభ్యర్థిపై ఎంఐఎం నాయకుల దాడి
మలక్‌పేట: అక్బర్‌బాగ్ డివిజన్ ఎంబీటీ అభ్యర్థి అంజదుల్లాఖాన్‌పై ఎంఐఎం నాయకులు మంగళవారం దాడి చేశారు.  మలక్‌పేట పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం... మలక్‌పేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న అంజదుల్లాఖాన్‌పై స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాల తన అనుచరులతో కలిసి దాడి  చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకోగా... మలక్‌పేట సీఐ గంగారెడ్డి తన సిబ్బందితో వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన అంజదుల్లాఖాన్‌ను యశో ద ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

యశోద ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..
చాదర్‌ఘాట్:  గాయపడ్డ అంజదుల్లాఖాన్‌ను పరామర్శించేందుకు మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి ఎంబీటీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకొని ఎంఐఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుల్తాన్‌బజార్ ఏసీపీ గిరిధర్ అక్కడకు వెళ్లి వారిని చెదరగొట్టారు. ప్రస్తుతం అంజదుల్లాఖాన్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement