7 లక్షల కొత్త ఓట్లు హాంఫట్!
♦ కలర్ ఎపిక్ కార్డులను అధికారులు పక్కన పడేశారా?
♦ పోలింగ్ శాతం తగ్గటంపై ఈసీ విస్మయం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావటంపై ఎన్నికల కమిషన్ వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. మంగళవారం జరిగిన పోలింగ్‌కు సగానికిపైగా ఓటర్లు దూరంగా ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, వ్యాపార వాణిజ్య సంస్థలకు సెలవిచ్చినా పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు నిరాసక్తత కనబరిచారు. ప్రధానంగా జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం, ఓటరు స్లిప్పుల పంపిణీలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడ్డాయి. కొత్తగా నమోదైన 7 లక్షల మంది ఓటర్లలో ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఇందుకు ఈసీ జారీ చేసిన కొత్త ఎపిక్ కార్డులు వారికి అందకపోవటమే ప్రధాన కారణమని తెలుస్తోంది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇటీవల కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వారికి ఎన్నికల కమిషన్ కలర్ ఫొటోలున్న ఎపిక్ కార్డులను జారీ చేసింది. ఆగమేఘాలపై వీటిని ముద్రించే చర్యలు చేపట్టిన ఈసీ... వారం రోజుల కిందటే జీహెచ్‌ఎంసీకి అప్పగించింది. కానీ ఓటర్లకు వీటిని అందజేయాల్సిన జీహెచ్‌ఎంసీ యంత్రాంగం అంతగా పట్టించుకోలేదు. వీటిని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోనే పక్కన పడేశారన్న విమర్శలున్నాయి. దీంతో ఈ ఏడు లక్షల మందిలో అత్యధిక ఓటర్లు ఓటు వేయలేకపోయినట్లు ఈసీ భావిస్తోంది. వీటికి తోడు ఓటర్ స్లిప్పుల పంపిణీ కూడా సరిగా జరగలేదు. ఓటు హక్కుపై చైతన్యం పెంపొందించేందుకు ఈసీ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా.. ఓటరు స్లిప్పుల పంపిణీ సవ్యంగా జరగకపోవటం పోలింగ్ శాతంపై ప్రభావం చూపిందనే అభిప్రాయాలున్నాయి.