లెక్క తప్పిందెక్కడ?
♦ గ్రేటర్ హైదరాబాద్‌లో జనాభా-ఓటర్ల గందరగోళం
♦ ఓటర్ల లెక్కలే నిజమైతే.. కోటిని మించే నగర జనాభా
♦ జనాభా లెక్కలే సరైతే.. సుమారు పదిహేను లక్షల ఓటర్లు అధికం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ జనాభా-ఓటరు లెక్కలు మరోసారి చిక్కుముడిగా మారాయి. మంగళవారం జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మొత్తం నమోదైన 74.30 లక్షల ఓటర్లలో 37.7 శాతం మాత్రమే ఓటు వేయడంతో... లోపం ఎక్కడుందన్న అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్థానిక రాజకీయాలపై ఆసక్తి లేక జనం పోలింగ్‌లో పాల్గొన లేదా, లేక నగరంలో ఓటర్ల లెక్కల్లోనే తప్పులున్నాయా... అన్న దానిపై ఉన్నతస్థాయి యంత్రాంగం తల పట్టుకుంటోంది. హైదరాబాద్‌లో ఓటర్ల జాబితా తయారీ విధానం, తీసివేత వివాదం, తాజా పోలింగ్ శాతం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే పలు ఆసక్తికరమైన అంశాలు చర్చకు వస్తున్నాయి.
పొంతనలేని జాబితాలు..
వాస్తవానికి 2011, 2014ల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ‘గ్రేటర్’ జనాభాతో పోలిస్తే తాజాగా నమోదైన ఓటర్ల లెక్కలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఓటర్ల జాబితాలో పేరును నమోదు చేసుకునే విషయంలో చూపిస్తున్న చొరవ.. ఇళ్లు మారినప్పుడో, నగరాన్ని వదిలి వెళ్లినప్పుడో, చనిపోయినప్పుడో ఓటర్ల జాబితాల్లోంచి పేర్లను తొలగించే విషయంలో చూపడం లేదు. దీంతో హైదరాబాద్ ఓటర్ల జాబితాలో కొందరి పేర్లు రెండు, మూడు ప్రాంతాల్లో ఉన్నాయి. ఆరు నెలల కింద అప్పటి జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ 6.4 లక్షల ఓట్లను తొలగించడంతోపాటు పేర్లు రెండు-మూడు చోట్ల ఉండడం, చనిపోవడం వంటి కారణాలతో మరో తొమ్మిది లక్షల మందికి నోటీసులు జారీ చేశారు. దీనిపై వివాదం చెలరేగడంతో ఈ తొమ్మిది లక్షల ఓట్లను తొలగించకుండానే ఈసారి తుది జాబితాలు సిద్ధం చేశారు. తొలగించిన ఆరు లక్షల ఓట్లను కూడా చేరిస్తే దాదాపుగా ఓటర్లు-జనాభా సంఖ్య సమానమయ్యేది. ఈ విషయమై సోమేష్‌కుమార్‌ను ప్రశ్నించగా... ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున తానేమీ వ్యాఖ్యానించలేనని చెప్పారు. అయితే మొత్తం మీద జనాభా-ఓటర్ల సంఖ్యపై పొంతన కుదరాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
ఏ లెక్క వాస్తవం?
జనాభా-ఓటరు లెక్కలకు సంబంధించి శాస్త్రీయ అంచనాల మేరకు 100 మంది జనాభా ఉంటే... 67 మంది ఓటర్లు ఉండాలి. మహానగరాల్లో అయితే అది 100ః70 వరకు ఉండొచ్చు. గ్రేటర్ హైదరాబాద్‌లో 2011 జనాభా లెక్కల మేరకు సుమారు 68 లక్షలు, 2014లో చేసిన సామాజిక సర్వే మేరకు 77-78 లక్షలు లెక్కించినా, ప్రస్తుతం నగర జనాభా 80 లక్షలుగా అనుకున్నా... జనాభా-ఓటరు నిష్పత్తి మేరకు సుమారు 56 నుండి 58 లక్షల వరకు ఓటర్లు ఉండాలి. కానీ నగరంలో నమోదైన ఓటర్ల సంఖ్య 74.30 లక్షలు. ఒకవేళ ఈ ఓటర్ల లెక్కలే నిజమైతే నగర జనాభా సుమారు కోటీ పది లక్షల వరకు ఉండాలి. అంటే ఏ లెక్క వాస్తవమో ఎవరికీ తెలియదు.
లెక్కలన్నీ చిత్రమే..
‘‘హైదరాబాద్‌లో జనాభా-ఓటరు నిష్పత్తి లెక్కలన్నీ చిత్రమే. నగరంలో ఓటర్ల జాబితాలను సరిదిద్దే పనిలో ఓటర్లతో పాటు జవాబుదారీతనంతో పనిచేసే సంస్థలు పాలుపంచుకునేలా చేయాలి. అప్పుడే ఈ పరిస్థితి చక్కబడుతుంది. ఇక ఈసారి పెద్దగా పోలింగ్ నమోదు కాలేదు. ఈ ఎన్నికలతో తమ సమస్యలేవీ తీరవన్న భావనే ఓటర్లు ఆసక్తి చూపకపోవడానికి కారణం కావచ్చు.’’ - పద్మనాభరెడ్డి,ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్