బల్దియా ఎన్నికల్లో పెరగని ఓటింగ్ శాతం
కొందరి ఓట్లు గల్లంతు
ఓటరు స్లిప్పుల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం
విద్యావంతుల్లో నిర్లిప్తత
సిటీబ్యూరో: ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటి ఓటు హక్కును వినియోగించుకోవడంపై గ్రేటర్‌లోని మెజార్టీ ఓటర్లు శ్రద్ధ చూపలేదు. బల్దియా ఎన్నికల్లో కొన్ని డివిజన్లలో పోలింగ్ 45 శాతం...మరికొన్ని చోట్ల 35శాతం మించకపోవడం ఇదే విషయాన్ని సుస్పష్టం చేస్తోంది. ఇది నాణేనికి ఒక పార్శ్వంకాగా.. ఓటర్ల నిర్లిప్తతకు ఇతర కారణాలూ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. ఓటేయాలన్న కోరిక పౌరుల్లో బలంగా ఉన్నప్పటికీ... వివిధ రాజకీయ పార్టీలు కార్పొరేటర్ అభ్యర్థులను ఎంపిక చేసిన తీరు బాగాలేదని...ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకోవడం, డబ్బు, మద్యం పంపిణీతో ఓటర్లను ప్రలోభ పెట్టడం చూసి...విరక్తితో పోలింగ్‌కు దూరంగా ఉండిపోయారని చెబుతున్నారు. ఎన్నికల్లో ఓటేసినా తమ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన నిధులు, అధికారాలు బల్దియాకు లేవని.. అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయని ఓటర్లు అభిప్రాయపడుతున్నారని చెబుతున్నారు. ఓటేసినా.. వేయకున్నా ఒరిగేదేమీ లేదన్న నిస్పృహతోనే చాలామంది దూరంగా ఉన్నట్లు విశేషిస్తున్నారు.
కారణాలెన్నో...
మెహిదీపట్నం డివిజన్‌లో 34.28 శాతం, విజయనగర్ కాలనీలో 34.51 , అహ్మద్‌నగర్‌లో 37.11 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం పాతనగరంలో వివిధ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు అలజడి రేగడంతో పలువురు ఓటర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ డివిజన్లలో ఓటరు స్లిప్పులు సరిగా పంపిణీ చేయకపోవడం, భర్తకు ఓ డివిజన్‌లో.. భార్యకు మరో డివిజన్‌లో ఓటు హక్కు ఉండడం, మరికొందరి ఓట్లు గల్లంతవడం పోలింగ్ భారీగా పడిపోవడానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు.సరూర్‌నగర్ డివిజన్‌లో 37.89 శాతమే ఓటింగ్ నమోదైంది. దీనికి ప్రధాన కారణం ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్లలోనే ఉండిపోవడం. చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు పనుల్లో నిమగ్నమవడంతో ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గింది. కొన్నిచోట్ల ఓటర్లకు స్లిప్పులు అందలేదు. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు తమ ఐడీ కార్డులను మాత్రమే తీసుకొచ్చి అవస్థలు పడ్డారు.
కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓట్లు గల్లంతయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు.
వివేకానంద నగర్ డివిజన్‌లో అపార్ట్‌మెంట్ల వాసుల ఓట్లు కొన్ని గల్లంతయ్యాయి. గోషామహల్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి.మరికొన్ని చోట్ల ఓటరు కార్డులతో పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారు జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.ఓటర్ల జాబితాలో కొందరి పేర్లు రెండు, మూడు ప్రాంతాల్లో ఉండడంతో ఎక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో తెలియక గందరగోళానికి గురయ్యారు.2011, 2014లలో గ్రేటర్ జనాభా, ఓటర్ల లెక్కకు పొంతన కుదరకపోవడం కూడా పోలింగ్ శాతం తగ్గేందుకు కారణమని భావిస్తున్నారు.
గత అనుభవాలే కారణమా?
గత బల్దియా ఎన్నికల్లో తాము ఎన్నుకున్న కార్పొరేటర్లు సమస్యల పరిష్కారం విషయంలో... అందుబాటులో ఉండే విషయంలో తమను నిరాశ పరచడంతో పలువురు ఓటుకు దూరంగా ఉన్నట్లు విశ్లేషకుల అంచనా. ప్రామాణ్య స్ట్రాటజీ అనే రాజకీయ పరిశోధన సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో పలువురు ఓటర్లు ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. గతంలో తాము ఎన్నుకున్న కార్పొరేటర్లు ఫిర్యాదులపై స్పందించారని 39.8 శాతం మంది తెలపగా.. అంతగా చొరవ చూపలేదని, ముభావంగా స్పందించారని, చూద్దాం..చేద్దాం అన్న ధోరణితో వ్యవహరించారని 25.3 శాతం మంది తెలిపారు. 34.8 శాతం మంది తాము ఎనుకున్న కార్పొరేటర్లు సమస్యల వైపు కన్నెత్తి చూడలేదని కుండబద్దలు కొట్టడం ప్రస్తావనార్హం.
అదే తీరు..మారని ఓటరు
Published Thu, Feb 4 2016 12:22 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement