ఓట్లేసుడే.. | today corporation polling in khammam | Sakshi
Sakshi News home page

ఓట్లేసుడే..

Published Sun, Mar 6 2016 1:23 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

today corporation polling in khammam

పురుషులు 1,30,917
మహిళలు 1,34,793
291 మంది అభ్యర్థులు..
265 పోలింగ్ స్టేషన్లు
పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ
ఉదయం 7 గంటల నుంచే పోలింగ్

 ఖమ్మం : ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. 50 డివిజన్లలో బరిలో నిలిచిన 291 మంది అభ్యర్థులకు అనుగుణంగా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని 80 ప్రాంతాల్లో 265 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి.. వాటిని ముందస్తుగా పరిశీలించారు. బీఎల్‌ఓల ద్వారా పోల్ చిట్టీలను పంపిణీ చేశారు. దీనికోసం ప్రభుత్వ మహిళా కళాశాలలో పోలింగ్ అధికారులకు, సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ ఇచ్చి.. నియమావళిపై వివరించారు.

 2,65,710 మంది ఓటర్లు
50 డివిజన్లలో 1,30,917 పురుషులు, 1,34,793 మంది మహిళలు మొత్తం 2,65,710 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు 80 ప్రాంతాల్లో 265 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రానికి ఒక పోలింగ్ అధికారి, ఒక ఏపీఓ, నలుగురు ఉద్యోగులను నియమించారు. 10 మంది రిటర్నింగ్ అధికారులు, 50 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించి.. ప్రతీ డివిజన్ వివరాలు, ఓటర్లు, అభ్యర్థుల సంఖ్య తదితర అంశాలను సిద్ధంగా ఉంచారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి 10 మోడల్ కోడ్ టీంలు, 10 ఖర్చుల వ్యవహార బృందాలు, 5 వీడియో బృందాలు, 5 గణాంక బృందాలతోపాటు ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ ఉన్నతాధికారులతోపాటు 1,500 మేరకు పోలీస్ సిబ్బందిని నియమించినట్లు అధికారులు ప్రకటించారు.

బరిలో 291 మంది
వివిధ పార్టీలకు చెందిన 291 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో వైఎస్సార్ సీపీ నుంచి 48 మంది, కాంగ్రెస్ నుంచి 42, టీఆర్‌ఎస్ నుంచి 50, టీడీపీ నుంచి 48, 40 మంది సీపీఎం, 8 మంది సీపీఐ అభ్యర్థులతోపాటు 42 మంది స్వతంత్రులు బరిలో నిలిచారు.

 సర్వం సిద్ధం
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం పదిహేను రోజులుగా కసరత్తు చేస్తోంది. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణల ప్రక్రియ కార్పొరేషన్‌లో నిర్వహిస్తూనే.. మరోవైపు పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఈవీఎంలను భద్రపరచడం, ఓట్ల లెక్కింపు కోసం పత్తి మార్కెట్‌ను ఆధీనంలోకి తీసుకొని ఏర్పాట్లు చేశారు. శనివారం జేసీ దివ్య, ఆర్డీఓ వినయ్‌కృష్ణారెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, డీఎస్పీ సురేష్‌కుమార్ నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈవీఎంల పనితీరును పరిశీలించి.. సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసి.. రాష్ట్ర ఎన్నికల నియమావళిని ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

305 ఈవీఎంల వినియోగం
ఎన్నికల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 305 ఈవీఎంలు సిద్ధంగా ఉంచామని అధికారులు తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు ఒకటి చొప్పున 265తోపాటు ఎక్కడైనా ఈవీఎంలు పనిచేయకపోవడం.. ఇతర కారణాలతో నిలిచిపోతే వెంటనే మరో ఈవీఎంను వినియోగించుకునేందుకు మరో 50 ఈవీఎంలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement