ఓటుకు ‘పచ్చ’నోటు
ఆయన మాట్లాడితే... ప్రజాస్వామ్యం ధనస్వామ్యం అయిపోయిందంటూ ఎక్కడ లేని ఆవేదన చెందుతాడు... వేల కోట్లతో ఓట్లు కొనుక్కునేందుకు నాయకులు వస్తున్నారని విమర్శలు చేస్తాడు... రాజకీయాల్లో నీతి, నిజాయితీ కావాలని పెద్ద పెద్ద మాటలు చెపుతాడు... నల్లధనాన్ని వెలికితీయాలని... ఓటుకు నోటు సంస్కృతి పోవాలని ఉపన్యాసాలు దంచేస్తాడు... ఆయనెవరో ఈపాటికే అర్థమై ఉంటుంది కదా..! ఓటుకు నోటు సంస్కృతికి ఆద్యుడు... ఎన్నికల్లో మద్యాన్ని వరదలా పారిస్తే మత్తులో ఓట్లు గుద్దుతారని నమ్మే మాజీ ముఖ్యమంత్రి... పంచాయతీ నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు ఏ ఎన్నికలకైనా కోట్లు ఖర్చు చేసే దేశంలోని ఏకైక నేత ... ఇంకెవరు..? చంద్రబాబు నాయుడు.
తెలంగాణలో ఉనికి కోసం నానా తంటాలు పడుతున్న తెలుగుదేశం పార్టీ పచ్చనోట్ల పంపకాలకు అప్పుడే తెరతీసింది. రూ. వందల కోట్లు వెదజల్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. పారిశ్రామిక వేత్తలతో సమావేశాలని చంద్రబాబు కలరింగ్ ఇచ్చినా.. అంతిమ లక్ష్యం మాత్రం నమ్ముకున్న లాబీ ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థులకు కోట్లాది రూపాయలు పంపించడమే. గురువారం కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పీఏ ఏకంగా రూ. 98లక్షలు ఆర్టీసీ బస్సులో తరలిస్తూ పోలీసులకు పట్టుబడడం దీనికి ఊతమిస్తోంది. అయితే పోలీసులకు దొరకకుండా ఇతర మార్గాల ద్వారా తరలిపోయిన మొత్తం రూ.వందల కోట్లకు పైనేనని సమాచారం.
రూ. వందల కోట్లు వెచ్చించైనా...!
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదలైన ‘ధన’స్వామ్య పోటీ.. ఆయన పదవి నుంచి దిగిపోయి పదేళ్లవుతున్నా కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని నియోజకవర్గాల్లో గెలవలేమని తెలిసినా.. టీడీపీ టిక్కెట్టు కోసం పోటీ ఎందుకంటే.. ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ నుంచి వచ్చే డబ్బుల మూటల కోసమే. ఇటీవల ముగిసిన మునిసిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో సైతం టీడీపీ తెలంగాణలో కోట్ల రూపాయలు పంచింది. అయినా ఎన్ని వార్డుల్లో, మండలాల్లో గెలుస్తారో తెలియని పరిస్థితి నెలకొనడంతో శాసనసభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలిచే అవకాశం ఉన్న ఒక్కో నియోజకవర్గానికి రూ. 5 కోట్ల వరకు పార్టీ ద్వారా పంపించేందుకు పథక రచన పూర్తిచేసింది. టీడీపీ తరపున ప్రచారం చేయడానికి జనం స్వచ్ఛందంగా ముందుకొచ్చే పరిస్థితి లేకపోవడంతో గ్రామాల్లో ఎంపిక చేసిన నాయకుల ద్వారా డబ్బులు పంచేందుకు ఆ పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. తెలంగాణ జిల్లాల్లో అన్నిచోట్లా ఇదే పరిస్థితి ఉంది.
పారిశ్రామిక ‘నాయకుల’ ద్వారానే!
పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లే టీడీపీలో ఇప్పుడు కీలకంగా మారారు. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు డబ్బు పంచేది వారే కాబట్టి పార్టీలో వారికి విపరీత ప్రాధాన్యముంది. టీడీపీలో కీలకపాత్ర పోషిస్తున్న పలువురు పారిశ్రామికవేత్తలు తదితరులతో కూడిన కోటరీ ఈ ఖర్చునంతా భరిస్తుంటుంది. అభ్యర్థులు చంద్రబాబును డబ్బులు అడిగిన వెంటనే ఆయన వీరికి ఫోన్‌చేసి సీఆర్ (కోటి) పంపించాలంటూ ఆదేశిస్తారు. ఆ మేరకు వారు ఎవరికీ అనుమానం రాకుండా ‘ప్రణాళిక’ ప్రకారం అనుకున్న చోటికి పకడ్బందీగా డబ్బును చేరవేస్తారు. ఈ మాఫియా తరహా తతంగాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు హైదరాబాద్ కేంద్రంగా పెద్ద యంత్రాంగమే పనిచేస్తోంది. అభ్యర్థి పలుకుబడిని బట్టి కొన్నిచోట్ల రూ.10 కోట్ల వరకు పంపిస్తున్నారు!
ఇబ్బందిగా మారిన నిఘా
అడుగడుగునా పోలీసులు, ఎన్నికల నిఘా సంస్థలు తనిఖీలు చేపడుతుండడం టీడీపీకి ఇబ్బందిగా మారింది. ఎమ్మెల్యే విజయ రమణారావు పీఏ అడ్డంగా దొరికిపోవడంతో పార్టీ పారిశ్రామిక నాయకులు ఇతర మార్గాలు అన్వేషిస్తున్నారు. సాధారణ ప్రయాణికుల తరహాలో రైళ్లలో డబ్బు తీసుకెళ్లడం మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. హవాలా మార్గం లోనూ జిల్లాకేంద్రాలకు డబ్బులు పంపేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం హవాలా నిర్వహించే వారి జాబితాను సేకరించినట్లు తెలిసింది. రెండో విడత డబ్బుల పంపిణీకి కార్ల స్టెప్నీ టైర్లు, లోడ్లతో వెళ్లే లారీలను, ట్రాన్స్‌పోర్టు కంపెనీలను కూడా మార్గంగా ఎంచుకున్నట్లు సమాచారం.