District Co-operative Central Bank
-
సహకార బ్యాంకింగ్ ‘విలీనాల్లో’ ముందడుగు
ముంబై: వివిధ షరతులకు లోబడి రాష్ట్ర సహకార బ్యాంకుతో (ఎస్టీసీబీ) జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (డీసీసీబీ) విలీనాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం స్పష్టం చేసింది. ఇలాంటి ప్రతిపాదన సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా రావాలన్నది ఈ షరతుల్లో ఒకటి. ఎస్టీసీబీ, డీసీసీబీల విలీనానికి ఉద్దేశించిన బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) చట్టం, 2020 గత నెల (ఏప్రిల్) 1వ తేదీ నుంచీ అమల్లోకి వచ్చే విధంగా నోటిఫై అయిన సంగతి తెలిసిందే. విలీన నేపథ్యం... సహకార బ్యాంకులు ప్రధానంగా మూడు అంచెల్లో పనిచేస్తాయి. ఇందులో గ్రామ స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం. జిల్లా స్థాయిలో సహకార కేంద్ర బ్యాంక్ పనిచేస్తుంది (దీని తరఫున మండల కేంద్రాల్లో బ్రాంచీలు పనిచేస్తాయి) మూడవ స్థాయి రాష్ట్ర సహకార బ్యాంక్. రైతుకు వడ్డీ భారం తగ్గించాలన్న ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర స్థాయి సహకార బ్యాంకులో జిల్లా స్థాయి సహకార బ్యాంకుల విలీన నిర్ణయం జరిగింది. తద్వారా రెండంచెల సహకార బ్యాంక్ వ్యవస్థకు మార్గం సుగమం అయ్యింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) చట్టం, 2020 ప్రకారం ఇందుకు రాష్ట్రాలు తప్పనిసరిగా ఆర్బీఐని సంప్రదించాలి. రెండంచెల సహకార వ్యవస్థకు (షార్ట్–టర్మ్ కో–ఆపరేటివ్ క్రెడిట్ స్ట్రక్చర్) పలు రాష్ట్రాలు ఆర్బీఐని సంప్రదిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. నిబంధనల్లో ముఖ్యాంశాలు ► రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనను ఆర్బీఐ పరిశీలనలోకి తీసుకుని ‘న్యాయ, ద్రవ్యపరమైన అంశాలపై’ సమగ్ర అధ్యయనం అనంతరం ఇందుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ► అదనపు మూలధనం సమకూర్చడం, అవసరమైతే ద్రవ్య పరమైన మద్దతు, లాభదాయకతతో కూడిన వ్యాపార నమూనా, పాలనా పరమైన నమూనా వంటి అంశాలు విలీన అంశ పరిశీలనలో ప్రధానంగా ఉంటాయి. ► విలీన పథకానికి మెజారిటీ వాటాదారుల మద్దతు అవసరం. ► రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంక్ (నాబార్డ్) కూడా పరిశీలించి, తగిన సిఫారసులు చేస్తుంది. నాబార్డ్‌తో తగిన సంప్రదింపుల అనంతరం ఆర్బీఐ ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటుంది. ► విలీనానికి సంబంధించి నికర విలువ ఆధారంగా షేర్ల మార్పిడి రేషియో విషయంలో కొన్ని డీసీసీబీ షేర్హోల్డర్లకు ఎటువంటి షేర్లనూ కేటాయించలేని పరిస్థితి ఉంటే, అటువంటి డీసీసీబీలకు ప్రభుత్వం తగిన మూలధనం సమకూర్చాలి. తద్వారా షేర్హోల్డర్లకు కనీసం ఒక షేర్ చొప్పున కేటాయింపు జరగాలి. -
రైతులకు అండ
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు డీసీసీబీ ఆసరా ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు ప్రభుత్వ నివేదిక ఆధారంగా సహాయం పంపిణీ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి వరంగల్ : కష్టాల సాగులో నష్టపోయి విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా నిలవాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) నిర్ణయించింది. సహకార బ్యాంకుల మనుగడలో కీలకమైన భాగస్వాములుగా ఉండే రైతులకు తమవంతు సహకారం అందించేందుకు సిద్ధమైంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ నివేదిక ప్రకారం.. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 23 మంది రైతు కుటుంబాలకు త్వరలో ఈ సహాయాన్ని అందజేయనుంది. డీసీసీబీలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఈ విషయాలు తెలిపారు. ‘డీసీసీబీ రైతులకు అండగా నిలుస్తుంది. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు, రైతుల సంక్షేమానికి కృషి చేస్తోంది. ఇదే క్రమంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని పాలకవర్గం నిర్ణయించింది. ప్రస్తుత పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన మొదటి ఆర్థిక సంవత్సరంలో డీసీసీబీ రూ.2 కోట్ల లాభాలు ఆర్జించింది. రెండో ఏడాదిలో ఈ లాభం రూ.5 కోట్లకు చేరుకుంది. రైతు సేవ కార్యక్రమాలతో, రైతుల భాగస్వామ్యంతో సాధించిన లాభాల నుంచి ఆసరా కోల్పోయిన రైతు కుటుంబాలను అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆర్థిక సహాయం నిర్ణయం తీసుకున్నాం. 2014 జూన్ నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతులు 23 మంది ఉన్నట్లు ప్రభుత్వం నివేదిక చెబుతోంది. ఈ కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నాం’ అని వివరించారు. సగానికి పైగా లాభాల్లోనే.. జిల్లాలో సగానికిపైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు లాభాల బాటలో నడుస్తున్నాయని రాఘవరెడ్డి తెలిపారు. ‘డిపాజిట్ల సేకరణలో డీసీసీబీ దూసుకుపోతోంది. డిపాజిట్లు రూ.125 కోట్ల నుంచి రూ.165 కోట్లకు పెరిగాయి. ఒక్క నెలలోనే రూ.14 కోట్ల డిపాజిట్లు సేకరించాము. డీసీసీబీ రూ.550 కోట్ల వ్యాపారం చేస్తోంది. మొత్తం 1.30 లక్షల ఖాతాలు ఉన్నాయి. ఈ ఖాతాలను 2 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రూ.245 కోట్ల పంట, దీర్ఘకాలిక రుణాలు ఇచ్చాం. రుణమాఫీకీ ప్రభుత్వం రూ.58 కోట్లు ఇచ్చింది. 80 శాతం రైతులకు రుణమాఫీ జరిగింది. రెండో విడత రుణమాఫీ నిధులు వచ్చాయి. రైతులకు బంగారు రుణాలు ఇస్తున్నాం. పంట రుణాల ప్రక్రియలో నకిలీపాస్ పుస్తకాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సామాజిక భద్రత పథకాలను రైతులందరికి వర్తింజేస్తాం. దీని వల్ల రైతులకు సామాజిక భద్రత కలుగుతుంది. జిల్లాలోని 15 డీసీసీబీ శాఖలకు సొంతంగా పక్కా భవనాలు నిర్మించనున్నాం. ప్రస్తుతం 5 బ్రాంచీలకు సొంత భవనాలు ఉన్నాయి. ఎకరానికి రూ.లక్ష చొప్పున ఐదెకరాల సాగు భూమి ఉన్న రైతులకు రూ.5 లక్షల వరకు రుణం ఇస్తాం. ఒక్కో సహకార సంఘం రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు లాభాలు సాధిస్తున్నాయి. ధాన్యం, మక్కల కొనుగోలు, ఎరువుల సరఫరా వ్యాపారాలతో అదనపు ఆదాయాన్ని సాధించుకోవడం సాధ్యమవుతోంది. రైతుల పంట ఉత్పత్తులు నిల్వ చేసుకోవడానికి ప్రతి ప్రాథమిక సహకార సంఘం పరిధిలో కనీసం మూడు గోదాములు నిర్మించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి నిధులు మంజూరు చేయాలి. గోదాముల నిర్మాణంతో రైతులు పంట ఉత్పత్తులు నిల్వ చేసుకుని ధర అధికంగా ఉన్నప్పుడు అమ్ముకునే వీలు కలుగుతుంది’ అని రాఘవరెడ్డి తెలిపారు. డీసీసీబీ సీఈవో యాదగిరి, జీఎం వి.సురేందర్, డైరక్టర్లు జయపాల్‌రెడ్డి, బిల్ల సుధీర్‌రెడ్డి, కేడల జనార్ధన్, బక్కిరెడ్డి, బిక్షపతి, సారయ్య, తిరుమల్‌రెడ్డి పాల్గొన్నారు. సహాయం పొందనున్న రైతు కుటుంబాలు బొజం కొమురయ్య(వెల్లంపల్లి), గాడుదుల వెంకన్న(అనపురం), సామల రామస్వామి(జవహర్‌నగర్), చిన్నాల కుమార్/కొమురయ్య(బండౌతపురం), ముంతా మల్లికార్జున్(శాయంపేటహవేలి), పేరబోయిన సంపత్(సీతారంపురం), నమిండ్ల సదానందం(మచ్చపురం), కొలిపాక శ్రీహరి(వరికోలు), రాసమల్ల అంజయ్య(వరికోలు), బదావత్ స్వామి(బోద్యతండా), కుందూరు సాంబిరెడ్డి(దేవగిరిపట్నం), సిడెం సారయ్య(గుండ్లపహాడ్), దామసాని మల్లారెడ్డి(ఊరుగొండ), పసునూటి రమేశ్(లింగాపురం), బొంత ఈర్య(రాములతండా), మీసా భీరయ్య(ముస్త్యాల), గాజులపాటి నాగేశ్వర్రావు(కంచనపల్లి), ఎస్.కె.ఖాజామియా(మునిగలవీడు), సుంకరి రాజయ్య (అక్కరజుపల్లి), మడికంటి సంతోష్(పోచంపల్లి), గుడిసె ఎల్లయ్య(మరుమాముల), సముద్రాల వెంకటయ్య(చిల్పూరు), పెద్ది మహేష్(నర్సాపూర్). -
ఉద్యోగాలు
బీహెచ్ఈఎల్ బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్ - ఇండస్ట్రియల్ సిస్టమ్స్ గ్రూప్) కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ విభాగాలు: సివిల్ -12, మెకానికల్-6 అర్హత: 60 శాతం మార్కులతో సివిల్/ మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 33 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబరు 2 వెబ్సైట్: www.bhelisg.com డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ విశాఖపట్నంలోని ది డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగానికి దరఖాస్తులు కోరుతోంది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అర్హతలు: కో ఆపరేటివ్ బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ/ డిప్లొమా లేదా సీఏ/ ఎంబీఏతోపాటు సంబంధిత రంగంలో ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 55 ఏళ్లు దాటకూడదు. దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 22 వెబ్సైట్: www.vizagdccb.org -
‘అనంత’ సహకార పీఠాలు వైఎస్సార్సీపీ వశం
అనంతపురం, న్యూస్‌లైన్: అనంతపురం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయభేరి మోగించారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో డీసీసీబీ చైర్మన్‌గా లింగాల శివశంకర్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఆనందరంగారెడ్డి.. డీసీఎంఎస్ చైర్మన్‌గా బోయ మల్లికార్జున, వైస్ చైర్మన్‌గా నార్పల జయరామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి అధికారులు డి క్లరేషన్లు అందజేశారు. డీసీసీబీలోని 21 డెరైక్టర్ స్థానాల్లో 14 స్థానాలను, డీసీఎంఎస్ పరిధిలో ఉన్న 10 డెరైక్టర్ స్థానాల్లో ఏడింటిని వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఏకగ్రీవం చేసుకోవడంతో చైర్మన్, వైఎస్ చైర్మన్ల ఎన్నిక ఏకపక్షమైంది.