రైతులకు అండ
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు డీసీసీబీ ఆసరా
ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు
ప్రభుత్వ నివేదిక ఆధారంగా సహాయం పంపిణీ
డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి
వరంగల్ : కష్టాల సాగులో నష్టపోయి విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా నిలవాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) నిర్ణయించింది. సహకార బ్యాంకుల మనుగడలో కీలకమైన భాగస్వాములుగా ఉండే రైతులకు తమవంతు సహకారం అందించేందుకు సిద్ధమైంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ నివేదిక ప్రకారం.. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 23 మంది రైతు కుటుంబాలకు త్వరలో ఈ సహాయాన్ని అందజేయనుంది. డీసీసీబీలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఈ విషయాలు తెలిపారు. ‘డీసీసీబీ రైతులకు అండగా నిలుస్తుంది. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు, రైతుల సంక్షేమానికి కృషి చేస్తోంది. ఇదే క్రమంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని పాలకవర్గం నిర్ణయించింది. ప్రస్తుత పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన మొదటి ఆర్థిక సంవత్సరంలో డీసీసీబీ రూ.2 కోట్ల లాభాలు ఆర్జించింది. రెండో ఏడాదిలో ఈ లాభం రూ.5 కోట్లకు చేరుకుంది. రైతు సేవ కార్యక్రమాలతో, రైతుల భాగస్వామ్యంతో సాధించిన లాభాల నుంచి ఆసరా కోల్పోయిన రైతు కుటుంబాలను అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆర్థిక సహాయం నిర్ణయం తీసుకున్నాం. 2014 జూన్ నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతులు 23 మంది ఉన్నట్లు ప్రభుత్వం నివేదిక చెబుతోంది. ఈ కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నాం’ అని వివరించారు.
సగానికి పైగా లాభాల్లోనే..
జిల్లాలో సగానికిపైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు లాభాల బాటలో నడుస్తున్నాయని రాఘవరెడ్డి తెలిపారు. ‘డిపాజిట్ల సేకరణలో డీసీసీబీ దూసుకుపోతోంది. డిపాజిట్లు రూ.125 కోట్ల నుంచి రూ.165 కోట్లకు పెరిగాయి. ఒక్క నెలలోనే రూ.14 కోట్ల డిపాజిట్లు సేకరించాము. డీసీసీబీ రూ.550 కోట్ల వ్యాపారం చేస్తోంది. మొత్తం 1.30 లక్షల ఖాతాలు ఉన్నాయి. ఈ ఖాతాలను 2 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రూ.245 కోట్ల పంట, దీర్ఘకాలిక రుణాలు ఇచ్చాం. రుణమాఫీకీ ప్రభుత్వం రూ.58 కోట్లు ఇచ్చింది. 80 శాతం రైతులకు రుణమాఫీ జరిగింది. రెండో విడత రుణమాఫీ నిధులు వచ్చాయి. రైతులకు బంగారు రుణాలు ఇస్తున్నాం. పంట రుణాల ప్రక్రియలో నకిలీపాస్ పుస్తకాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సామాజిక భద్రత పథకాలను రైతులందరికి వర్తింజేస్తాం. దీని వల్ల రైతులకు సామాజిక భద్రత కలుగుతుంది. జిల్లాలోని 15 డీసీసీబీ శాఖలకు సొంతంగా పక్కా భవనాలు నిర్మించనున్నాం. ప్రస్తుతం 5 బ్రాంచీలకు సొంత భవనాలు ఉన్నాయి. ఎకరానికి రూ.లక్ష చొప్పున ఐదెకరాల సాగు భూమి ఉన్న రైతులకు రూ.5 లక్షల వరకు రుణం ఇస్తాం. ఒక్కో సహకార సంఘం రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు లాభాలు సాధిస్తున్నాయి. ధాన్యం, మక్కల కొనుగోలు, ఎరువుల సరఫరా వ్యాపారాలతో అదనపు ఆదాయాన్ని సాధించుకోవడం సాధ్యమవుతోంది. రైతుల పంట ఉత్పత్తులు నిల్వ చేసుకోవడానికి ప్రతి ప్రాథమిక సహకార సంఘం పరిధిలో కనీసం మూడు గోదాములు నిర్మించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి నిధులు మంజూరు చేయాలి. గోదాముల నిర్మాణంతో రైతులు పంట ఉత్పత్తులు నిల్వ చేసుకుని ధర అధికంగా ఉన్నప్పుడు అమ్ముకునే వీలు కలుగుతుంది’ అని రాఘవరెడ్డి తెలిపారు. డీసీసీబీ సీఈవో యాదగిరి, జీఎం వి.సురేందర్, డైరక్టర్లు జయపాల్‌రెడ్డి, బిల్ల సుధీర్‌రెడ్డి, కేడల జనార్ధన్, బక్కిరెడ్డి, బిక్షపతి, సారయ్య, తిరుమల్‌రెడ్డి పాల్గొన్నారు.
సహాయం పొందనున్న రైతు కుటుంబాలు
బొజం కొమురయ్య(వెల్లంపల్లి), గాడుదుల వెంకన్న(అనపురం), సామల రామస్వామి(జవహర్‌నగర్), చిన్నాల కుమార్/కొమురయ్య(బండౌతపురం), ముంతా మల్లికార్జున్(శాయంపేటహవేలి), పేరబోయిన సంపత్(సీతారంపురం), నమిండ్ల సదానందం(మచ్చపురం), కొలిపాక శ్రీహరి(వరికోలు), రాసమల్ల అంజయ్య(వరికోలు), బదావత్ స్వామి(బోద్యతండా), కుందూరు సాంబిరెడ్డి(దేవగిరిపట్నం), సిడెం సారయ్య(గుండ్లపహాడ్), దామసాని మల్లారెడ్డి(ఊరుగొండ), పసునూటి రమేశ్(లింగాపురం), బొంత ఈర్య(రాములతండా), మీసా భీరయ్య(ముస్త్యాల), గాజులపాటి నాగేశ్వర్‌రావు(కంచనపల్లి), ఎస్.కె.ఖాజామియా(మునిగలవీడు), సుంకరి రాజయ్య (అక్కరజుపల్లి), మడికంటి సంతోష్(పోచంపల్లి), గుడిసె ఎల్లయ్య(మరుమాముల), సముద్రాల వెంకటయ్య(చిల్పూరు), పెద్ది మహేష్(నర్సాపూర్).