సమస్యల ఒడిలో జిల్లా గ్రంథాలయం
జిల్లా గ్రంథాలయ సంస్థ సమస్యల ఒడిలో ఉంది. బడ్జెట్ లేక పుస్తకాల కొనుగోలు నిలిచిపోయాయి. నూతన నియామకాలు లేవు. అధికారుల నిర్లక్ష్యంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఒంగోలు కల్చరల్ : రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో జిల్లా గ్రంథాలయ సంస్థ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. నేటికీ గ్రంథాలయ సంస్థకు చైర్మన్ నియామకం జరగలేదు. జాయింట్ కలెక్టర్‌ను ఇన్‌చార్జీగా నియమించినప్పటికీ ఆ ఆరునెలల గడువు కూడా తీరిపోయినా మరలా పొడిగింపు ఉత్తర్వులను ప్రభుత్వం జారీచేయలేదు. గ్రంథాలయ పరిషత్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడంతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించే నాథుడు క రువయ్యాడు. జీతాలకు తప్ప ఇతర ఖర్చుల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రతి చిన్నదానికి గ్రంథాలయ డెరైక్టరేట్‌ను సంప్రదించాల్సిన దుస్థితి నెలకొంది.
నిలిచిన పుస్తకాల కొనుగోళ్లు..
నాలుగేళ్లుగా జనరల్ పుస్తకాల కొనుగోలు నిలిచిపోయింది. రెండో క్వార్టర్ బడ్జెట్ విడుదల కావాల్సి ఉంది. బడ్జెట్ ఆమోదం లేకపోవడంతో ఫర్నీచర్, పుస్తకాల కొనుగోలు, బిల్లుల చెల్లింపు, నూతన భవన నిర్మాణాలు వంటివాటికి బ్రేక్ పడింది. పాత పుస్తకాలతోనే పాఠ కులు సర్దుకుపోవాల్సిన పరిస్థితి నెలకొంది.
సిబ్బంది కొరత...
పలుచోట్ల శాఖా గ్రంథాలయాలలో సిబ్బంది కొరత ఉంది. ఉన్న సిబ్బందిని ఇతర గ్రంథాలయాలకు డిప్యుటేషన్‌పై పంపారు. గ్రంథాలయాలు వారంలో నాలుగు రోజులు కూడా సక్రమంగా పనిచేయడంలేదు. సంతరావూరు, మల్లవరం గ్రంథాలయాలు సిబ్బంది లేక మూతబడ్డాయి.
అన్నిచోట్లా ఇదే పరిస్థితి..
ఇది ఒక్క ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ పరిస్థితి మాత్రమే కాదు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల గ్రంథాలయ సంస్థల పరిస్థితి ఒకేలా ఉందని చెప్పవచ్చు. ప్రభుత్వం సమస్యల పరిష్కారంవైపు దృష్టి సారించకుండా కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నదంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
సమస్యలు నిజమే
గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్సీహెచ్ వెంకట్రావు జిల్లా గ్రంథాలయ సంస్థ సమస్యలు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. పరిస్థితి గాలిలో దీపంలో ఉంది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
60 ఏళ్ల పదవీ విరమణ ఉత్తర్వులేవీ..
గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు పెంచిన పీఆర్సీ ప్రయోజనాలు అందాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును ప్రభుత్వం 60 ఏళ్లకు పెంచింది. అయితే అది జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగులకు ఇంకా వర్తింపచేయలేదు. టంగుటూరు లైబ్రేరియన్ బీ శ్రీరామమూర్తి ఇటీవల 58 సంవత్సరాలు నిండి రిటైరయ్యారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి తన నుకూడా 60 ఏళ్లు నిండే వరకు ఉద్యోగంలో కొనసాగేలా ఆదేశించాలంటూ ఆయన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి ఉత్తర్వులు తెచుకున్నారు. అయితే ఆ ఉత్తర్వులను అమలు చేసేందుకు గ్రంథాలయ పరిషత్ లేకపోవడంతో సమస్య పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ వద్దకు చేరింది. ప్రభుత్వం నుంచి అనుమతివస్తే తప్ప 60 ఏళ్ల వరకు ఉద్యోగంలో కొనసాగే అవకాశం లేదు. ఇలా పలు సమస్యలతో జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు.