నేడు వైఎస్సార్సీపీ జిల్లా ప్లీనరీ
శ్రీకాకుళం అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాస్థాయి ప్లీనరీ సమావేశానికి రంగం సిద్ధమైంది. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటల కు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని విజ యవంతం చేయాలని పార్టీ శ్రేణులకు జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, పార్టీ రాజకీయ వ్యవహారాల కమి టీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ప్లీనరీకి పార్టీ జిల్లా ఇన్చార్జి కొయ్య మోషేన్‌రాజు, తూర్పు గోదావరి జిల్లా నేత, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరుకానున్నారని చెప్పారు. టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత ఈ మూడేళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై పార్టీ నాయకులు ప్లీనరీలో చర్చించనున్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైన తీరును పార్టీ శ్రేణులకు వివరించి తద్వారా వారు ప్రజలకు అవగాహన కలిగించేలా చేయనున్నామని తెలిపారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు రుణమాఫీ అని చెప్పి వారిని మోసగించారని, బాబొస్తే జాబని, జాబురాని నిరుద్యోగులకు నెలకు రూ.2 వేలు నిరుద్యోగభృతి అని నమ్మించి నట్టేట ముంచిన వైనాన్ని యువతకు, నిరుద్యోగులకు వివరించనుమన్నారు. అధికార టీడీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా పోరాడుతున్న తీరును ప్రజలకు వివరించనున్నట్టు నేతలు పేర్కొన్నారు.
జన్మభూమి కమిటీల పేరుతో ఆ కమిటీ సభ్యులు చేస్తున్న ఆగడాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వారికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త కూడా తీసుకోవాలని ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో జరిగిన ప్లీనరీ సమావేశాల్లో నాయకులు పార్టీ శ్రేణులకు సూచించడం జరిగిందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు కాకుండా టీడీపీ కార్యకర్తలకు, నాయకులకే అనే చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. అలాగే జిల్లాలో ప్రధాన సమస్యలైన వంశధార ప్రాజెక్టు, కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం, ఉద్దానంలో కిడ్నీవ్యాధుల సమస్య, ఆఫ్‌షోర్ సమస్య తదితర వాటిపై జిల్లా ప్లీనరీలో చర్చించనున్నామని తెలిపారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకతను ప్రజలు వ్యక్తం చేస్తున్నారని, ఈ వైఫల్యాలనే ప్రజలకు వివరించేందుకు పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయడం ద్వారా భవిష్యత్‌లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేందుకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నామని తెలిపారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ఏ సంక్షేమ పథకాలు అయితే ప్రజలకు అందాయో వాటిని ఈ ప్లీనరీ ద్వారా రూపకల్పన చేసేందుకు చర్యలు తీసుకోనున్నామన్నారు. వై.ఎస్. జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో భవిష్యత్‌లో అధికారం చేపట్టేందుకు పార్టీ నేతలంతా సమన్వయంతో కలసి పనిచేయనున్నామన్నారు. జిల్లాస్థాయి ప్లీనరీలో ప్రధానంగా జిల్లాలోని సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రవేశపెట్టనున్నామన్నారు.
ప్లీనరీ వేదిక పరిశీలన
ఈ కార్యక్రమానికి ముందుగా శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటలకు జరగనున్న జిల్లాస్థాయి ప్లీనరీ సమావేశ వేదికను, ఏర్పాట్లను ధర్మాన కృష్ణదాస్, రెడ్డి శాంతి, పార్టీ సీఈసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మామిడి శ్రీకాంత్ తదితరులు పరిశీలించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పొందల విశ్వేశ్వరరావు, ఎం.వి.స్వరూప్, ముంజేటి కృష్ణమూర్తి, కోరాడ రమేష్, కరిమి రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు.