జిల్లా రెవెన్యూ అధికారుల నియామకం
నల్లగొండ : నూతన జిల్లాల్లో ఖాళీగా ఉన్న రెవెన్యూ అధికారుల పోస్టుల్లో ప్రభుత్వం కొత్తవారిని నియమించింది. వివిధ జిల్లాల్లో రెవెన్యూ అధికారులుగా పనిచేస్తున్న వారిని కొత్త జిల్లాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల విభజన సమయంలో కొత్త జేసీలు, కలెక్టర్లను నియమించిన ప్రభుత్వం డీఆర్ఓ నియామకాలు చేపట్టలేదు. దీంతో ఇప్పటి వరకు ఆ స్థానాల్లో ఇన్చార్జి అధికారులు పనిచేస్తున్నారు. నియామకాల్లో భాగంగా జిల్లా పరిషత్ సీఈఓ రావుల మహేందర్‌రెడ్డిని యాదాద్రి జిల్లా డీఆర్ఓగా బదిలీ చేశారు. ఈయన స్వస్థలం ఆలేరు. మహేందర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం యాదాద్రి జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎన్.కీమ్యా నాయక్‌ను నల్లగొండ డీఆర్ఓగా నియమించారు. ఈయన గతంలో మోత్కూరు మండలం తహసీల్దార్‌గా పనిచేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్డీఓగా పనిచేస్తున్న పి.యాదిరెడ్డిని సూర్యాపేట జిల్లా డీఆర్ఓగా నియమించారు. ఈయన స్వస్థలం నల్లగొండ మండలం అప్పాజిపేట. ఇక నల్లగొండ నుంచి బదిలీ అయి వెయిటింగ్లో ఉన్న ఏజేసీ ఎస్. వెంకట్రావ్‌ను నిర్మల్ జిల్లా డీఆర్ఓగా నియమించారు.
ఇన్చార్జి సీఈఓగా అంజయ్య..?
జెడ్పీ సీఈఓగా రావుల మహేందర్ రెడ్డి 2014 ఫిబ్రవరిలో జిల్లాకు వచ్చారు. 22 మాసాల కాలంలో సీఈఓ విధులతో పాటు మెప్మా పీడీ, డీపీఓగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తించారు. సీఈఓగా జెడ్పీ పాలన యంత్రాంగాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేశారు. సీఈఓ స్థానంలో కొత్తవారిని నియమించేంత వరకు డీఆర్డీఓ రింగు అంజయ్యను ఇన్చార్జి సీఈఓగా నియమించనున్నట్లు తెలిసింది. నిన్నటివరకు ఇన్చార్జి డీఆర్ఓగా పనిచేసిన ఆయన ఆ స్థానంలో కొత్త వారిని ప్రభుత్వం నియమించింది. దీంతో ఖాళీ అయిన సీఈఓ పోస్టుకు అంజయ్యను ఇం చార్జిగా నియమించే అవకాశం ఉంది.