చిక్కుల్లోపోలీస్ బాస్!
‘వెట్టి చాకిరీ’పై విచారణకు ఆదేశం
నేనెలాంటి తప్పూ చేయలేదు. అర్డర్లీ పనులకు హోంగార్డులను వినియోగించుకున్నట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవం. సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన ఫొటోలు ఎవరివో విచారణ చేస్తున్నాం. దీనిపై ఇప్పటికే ఆర్ఎస్ఐ (హోంగార్డు)ను నివేదిక కోరా.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలోనూ పలు ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన.. తాజాగా ఇంటి పనులకు హోంగార్డులను వినియోగించుకున్నారనే వార్తలతో పతాక శీర్షికలకెక్కారు. ఆర్డర్లీ వ్యవస్థను ఎనిమిదేళ్ల క్రితం రాష్ర్ట ప్రభుత్వం రద్దు చేసినా ఇదేమీ పట్టని పోలీసు బాసు ‘హోం’గార్డుల ఇంటి సేవలతో తరిస్తున్నారు. గుట్టుగా సాగుతున్న ఈ సేవలు కాస్తా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ ఘటనపై ఇన్చార్జి డీజీపీ విచారణకు ఆదేశించారు. నెల రోజుల క్రితమే ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నవీన్‌కుమార్.. సుమారు పది మంది హోంగార్డులను ఇంటి, వంట పనులకు ఉపయోగించుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గేదెకు మేత..
పాలు పితకడం మొదలు ఇతరత్రా పనులకు కూడా ఈ సిబ్బందిని మోహరించారు. తన దర్పానికి భంగం కలుగకుండా అడుగడుగునా రాజసం ప్రదర్శించారు. అంట్లు తోమడం.. బట్టలు ఉతకడం తదితర సేవలను వీరికే అప్పగించినట్లు ఫొటోల్లో స్పష్టమవుతోంది. పశుపోషణను వ్యాపకంగా మలుచుకున్న ఆ అధికారి వాటి ఆల నాపాలనను కూడా హోంగార్డులకే కట్టబెట్టినట్లు తెలుస్తోంది. కిందిస్థాయి సిబ్బందిని గౌరవప్రదంగా చూసుకోవాల్సిన ఉన్నతాధికారి.. వారితో గొడ్డుచాకిరీ చేయిస్తున్న ఫొటోలు, వీడియోలు మీడియాలో హల్చల్ చేయడంతో పోలీస్‌వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ కథనాలు కాస్తా ఇన్చార్జీ డీజీపీగా ఉన్న అంజనీకుమార్ దృష్టికి వెళ్లాయి. దీంతో అధికార దుర్వినియోగంపై డీఐజీ అకున్ సబర్వాల్‌ను విచారణాధికారిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, అడ్డమైన చాకిరీ చేసిన సిబ్బంది మాత్రం బడాసాబ్పై ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం విశేషం.