రంగారెడ్డి: ఓ పోలీసు అధికారి ఇంట్లో వెట్టి చాకిరి చేస్తూ కెమెరా కంటికి చిక్కిన హోంగార్డులను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారు. గతంలోనూ పలు ఆరోపణలు ఎదుర్కొన్న జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ తాజాగా ఇంటి పనులకు హోంగార్డులను వినియోగించుకున్నారనే వార్తలతో పతాక శీర్షికలకెక్కారు. ఆర్డర్లీ వ్యవస్థను ఎనిమిదేళ్ల క్రితం రాష్ర్ట ప్రభుత్వం రద్దు చేసినా ఇదేమీ పట్టని పోలీసు బాసు హోంగార్డుల ఇంటి సేవలతో తరిస్తున్నారు. గుట్టుగా సాగుతున్న ఈ సేవలు కాస్తా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ ఘటనపై ఇన్‌చార్జి డీజీపీ విచారణకు ఆదేశించారు. నెల రోజుల క్రితమే ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నవీన్‌కుమార్.. సుమారు పది మంది హోంగార్డులను ఇంటి, వంట పనులకు ఉపయోగించుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గేదెకు మేత.. పాలు పితకడం మొదలు ఇతరత్రా పనులకు కూడా ఈ సిబ్బందిని మోహరించారు.
తన దర్పానికి భంగం కలుగకుండా అడుగడుగునా రాజసం ప్రదర్శించారు. అంట్లు తోమడం.. బట్టలు ఉతకడం తదితర సేవలను వీరికే అప్పగించినట్లు ఫొటోల్లో స్పష్టమవుతోంది. పశుపోషణను వ్యాపకంగా మలుచుకున్న ఆ అధికారి వాటి ఆల నాపాలనను కూడా హోంగార్డులకే కట్టబెట్టినట్లు తెలుస్తోంది. కిందిస్థాయి సిబ్బందిని గౌరవప్రదంగా చూసుకోవాల్సిన ఉన్నతాధికారి.. వారితో గొడ్డుచాకిరీ చేయిస్తున్న ఫొటోలు, వీడియోలు మీడియాలో హల్‌చల్ చేయడంతో పోలీస్‌వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. కాగా, అడిషనల్ ఎస్పీ వెంకటస్వామి పేరు చెప్పాలని హోంగార్డులపై ఒత్తిడి తెచ్చారని స్పెషల్ బ్రాంచి పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి.
‘హోంగార్డులై ఉండి వెట్టి ఎందుకు చేస్తున్నారు?’
Published Sun, Jul 10 2016 9:34 AM | Last Updated on Thu, Oct 4 2018 8:29 PM
Advertisement
Advertisement