మందు‘పాతర’కేనా?
సాక్షి, కొత్తగూడెం: ఈ నెల 2వ తేదీన జరిగిన ఎన్కౌంటర్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న మావోయిస్టులు ఈ రెండువారాల్లో సరిహద్దు ప్రాంతాల్లో అనేక విధ్వంసాలకు పాల్పడ్డారు. దీనిని మరింతగా కొనసాగించేందుకు మావోయిస్టులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మరింత శక్తిమంతమైన పేలుడు పదార్థాలతో దాడులు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు అర్థమవుతోంది. మరిన్ని అత్యాధునిక ఆయుధాలు, మరింత శక్తిమంతమైన పేలుడు పదార్థాలు సమకూర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. గురువారం కొత్తగూడెం నుంచి చర్ల వైపు లారీలో తరలిస్తున్న 1,000 డిటోనేటర్లు, 75 జిలెటిన్ స్టిక్స్‌ను భద్రాచలం వద్ద పోలీసులు పట్టుకున్నారు. 8మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇవి మావోయిస్టులకు వెళుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా మావోయిస్టులు మరిన్ని దాడులు, విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండడంతో సరిహద్దు ప్రాంతాల్లో మరింత టెన్షన్ నెలకొంది. ఇప్పటికే మావోయిస్టులు 2వ తేదీ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా ఈ నెల 13వ తేదీన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా కిష్టారం పోలీసుస్టేషన్ పరిధిలో శక్తిమంతమైన ఐఈడీతో మైన్‌ప్రూఫ్ వాహనాన్ని పేల్చి 9 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చారు. 5వ తేదీన సుక్మా జిల్లా డోర్నపాల్ వద్ద మూడు బస్సులు, మూడు లారీలు తగులబెట్టిన మావోయిస్టులు 14వ తేదీన బీజాపూర్ జిల్లాలో 7 వాహనాలు తగులబెట్టారు. ఈ దాడులు మరింత పెంచేందుకు మావోయిస్టులు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక పోలీసులు నిఘా కోసం డ్రోన్ కెమెరాలను వాడుతున్నారని, వాటిని సైతం పడగొట్టేందుకు సైతం మావోయిస్టులు ప్రణాళికలు తయారుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఎన్‌కౌంటర్‌తో రగులుతున్న వైనం..
మూడేళ్ల తర్వాత తెలంగాణలో తమ కార్యకలాపాలు విస్తరించాలనుకునే క్రమంలో ఈనెల 2వ తేదీన ఎన్కౌంటర్ జరగడంతో మావోయిస్టులు రగిలిపోతున్నారు. మరింత ఉధృతంగా దాడులు చేసేందుకు ముందుకెళుతున్నారు. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాజాగా భద్రాచలంలో పేలుడు పదార్థాలు లభించడంతో పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్థమవుతోంది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరింత టెన్షన్ పడుతున్నారు. ప్రతి ఏడాది ఈ సీజన్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య హోరాహోరీగా పోరాటం నడుస్తోంది. దీంతో ఇరువైపులా ప్రాణనష్టం అధికంగానే ఉంటోంది.
గతంలోనూ ప్రతీకారేచ్ఛ..
2008 మార్చి 18న బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. ప్రతీకారంగా అదే నెలలో మావోయిస్టులు 18 మంది పోలీసులను హతమార్చారు. 2012 మార్చి 18న నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2013 మే 25న దర్బా డివిజన్లో మావోయిస్టులు చేసిన దాడిలో కాంగ్రెస్ నాయకులు, పోలీసులతో సహా మొత్తం 28 మంది మృతి చెందారు. 2014 ఏప్రిల్ 11న సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడిలో ఏడుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. 2014 ఏప్రిల్ 12న చింతలనార్‌లో మావోయిస్టులు మందుపాతర అమర్చి 32 మంది పోలీసులను హతమార్చారు. అదే ఏడాది మరో ఎన్కౌంటర్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2014 ఏప్రిల్ 25న సుక్మా జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర భారినపడి 24 మంది పోలీసులు మృతి చెందారు. 2016 మార్చి 2వ తేదీన బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మహిళలు సహా మొత్తం 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ప్రతీసారి ఈ సీజన్లోనే భారీ సంఘటనలు జరిగి ఇరువైపులా పెద్దఎత్తున ప్రాణనష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతోపాటు తెలంగాణలో అధికారపార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్నట్లు మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ప్రకటించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.