ఈ ఎస్సైగారు... మేడీజీ మాస్టారు!
బొల్లం కోటేశ్వరరావు, సాక్షి, విశాఖపట్నం
ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్. వీటిని ఇదే వరుసలో గుర్తుపెట్టుకోవడం మరీ అంత కష్టం కాకపోవచ్చు. కానీ అలా గుర్తుపెట్టుకోలేని పిల్లలు కూడా ఉంటారు. అలాంటి వారి కోసం దివాకర్ యాదవ్ ఓ కొండ గుర్తు చెప్తారు. ‘పెన్’ అని గుర్తుపెట్టుకోండి చాలు అని. పి ఫర్ ప్రోటాన్, ఇ ఫర్ ఎలక్ట్రాన్, ఎన్ ఫర్ న్యూట్రాన్ అని ఈజీగా రాసేయొచ్చు అంటారు. మరి వీటిని కనిపెట్టిన వారి పేర్లను ఎలా గుర్తు పెట్టుకోవాలి? అది కొంచెం కష్టమైన విషయమే. అయితే దానికీ దివాకర్ దగ్గర ఓ చిట్కా ఉంది. అదొక్కటే కాదు... టెన్త్ విద్యార్థుల చదువుకు, వారి భవిష్యత్తుకు పనికొచ్చే టిప్స్ ఆయన దగ్గర చాలా ఉన్నాయి. మరేమిటి? ఈయనిలా... పో-లీ-స్ డ్రెస్‌లో ఉన్నారు! పోలీస్ డ్రెస్‌లో ఉండడం కాదు. నిజంగా పోలీసే.
దివాకర్ యాదవ్ విశాఖ నగర కమిషనరేట్‌లోని పీఎంపాలెం పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ సబ్ఇన్స్పెక్టర్!! 2007 బ్యాచ్ ఎస్ఐ. పూర్వాశ్రమంలో ఆయనేమీ టీచర్‌గా పని చేయలేదు. బీఈడీ కూడా చేయలేదు. ఉపాధ్యాయుడు కావాలనుకోలేదు కూడా. చదివింది ఎంసీఏ. అయితే విద్యార్థుల భవిష్యత్తుపై, విద్యా బోధనపై ఆయనకు ఎందుకింత తపన? కారణం ఉంది. దివాకర్ ఇంతకు మునుపు విశాఖలోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో, పద్మనాభం, పీఎంపాలెం స్టేషన్లలో క్రైం ఎస్సైగా పనిచేశారు. ఆ సమయంలో వివిధ కేసుల్లో నిందితులుగా పట్టుబడ్డ బాల నేరస్తుల్లో ఎక్కువమంది టెన్త్ తప్పిన వారే అయివుండడాన్ని ఆయన గమనించారు. ఇలాంటి వారు టెన్త్ పాసై ఉన్నత చదువులకెళ్తే ఇలా చెడు దారిపట్టే వారు కాదుకదా? అన్న ఆలోచన కలిగింది. దాంతో ఆయన ప్రభుత్వ హైస్కూళ్లలో చదివే టెన్త్ పిల్లలకు పాఠాలతో పాటు, నాలుగు మంచి మాటలు చెప్పదలచుకున్నారు దివాకర్.
2011లో పద్మనాభం స్టేషన్ ఎస్సైగా ఉన్నప్పట్నుంచి టెన్త్ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. కాస్త తీరిక దొరికితే చాలు... హైస్కూలు కెళ్లి తనకు పట్టున్న సైన్స్, మ్యాథ్స్, హిస్టరీ సబ్జెక్టులను ఉదాహరణలతో సహా బోధిస్తుంటారు. చిట్టి బుర్రల్లో నాటుకుపోయేలా కొండ గుర్తులు చెప్తుంటారు. ఉదాహరణకు ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్లను కనుగొన్న వారి పేర్లను గుర్తుపెట్టుకోవాలంటే ఆర్టీసీని గుర్తుపెట్టుకోవాలంటారు. ఆర్టీసీలో ఆర్ అంటే రూథర్‌ఫర్డ్, టి... థామ్సన్, సి... చాడ్విక్ అని చెబుతారు.
బాహుఅజషాఔ
చరిత్ర లో సబ్జెక్టులో కూడా దివాకర్ బోధన తేలిగ్గా సాగుతుంది. ఉదా: మొగల్ సామ్రాజ్య పాలకులు బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబులను గుర్తుంచుకోవడానికి వారి పేర్లలో తొలి అక్షరాలు ‘బాహుఅజషాఔ’ గుర్తుంచుకుంటే చాలని వివరిస్తారు. ఇలా అనేక అంశాలను షార్ట్‌కట్‌లో బోధించడంతో విద్యార్థులు ఎస్ఐ మాస్టార్ క్లాసంటే తెగ ముచ్చట పడతారు.
టీచర్లూ సహకరిస్తున్నారు
దివాకర్ డఫ్ అండ్ డంబ్ స్కూల్లోనూ పాఠాలు బోధిస్తారు. పర్సనాలిటీ డెవలప్మెంట్, మేనేజిమెంట్ స్కిల్స్‌పై పిల్లలకు అవగాహన కల్పిస్తారు. టెన్త్ ఫెయిలయితే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో వారికి చెబుతారు. దివాకర్ సంకల్పానికి హైస్కూళ్ల ఉపాధ్యాయులు కూడా సహకరిస్తూ ఆయనతో క్లాసులు చెప్పిస్తారు. ఇక్కడే కాదు.. బందోబస్తుకు వేరే ప్రాంతాలకు పంపినా అక్కడా దివాకర్ ఖాళీ వేళ తన సంకల్పం వదలరు.
ఫొటోలు: శ్రీనివాస్ ఆకుల
పిల్లలను ఇన్స్పైర్ చేస్తున్నారు
ఎస్సైగారు తన బోధన ద్వారా పిల్లలను ఇన్స్పైర్ చేస్తున్నారు. టిప్స్‌తో వారికి అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్నారు. మేం చెప్పనివి కూడా ఆయన చెబుతుంటారు. మాకే ఆశ్చర్యంగా ఉంటుంది. మాట వినని విద్యార్థులకు ఆయన ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించాలనుకుంటున్నాం. మా టీచర్లు బోధించేది ఒక సబ్జెక్టే. ఆయన మూడు నాలుగు బోధిస్తున్నారు. ఆయన సంకల్పం అభినందనీయం.
- ఎం.రాజబాబు, హెచ్ఎం,
గవర్నమెంట్ హైస్కూల్, మధురవాడ
మార్పు కోసమే నా తపన
బాలనేరస్తుల్లో టెన్త్ తప్పిన వారు ఎక్కువమంది ఉంటున్నారు. దాంతో గవర్నమెంట్ స్కూళ్లలో టెన్త్ పిల్లలకు దిశానిర్దేశం చేయాలన్న ఆలోచన కలిగింది. నాలుగేళ్లుగా ఆయా స్కూళ్లలో పాఠాలు చెబుతున్నాను. టెన్త్ పిల్లలకు భవిష్యత్తు పట్ల అవగాహన కల్పిస్తే తప్పటడుగులు వేయకుండా ఉంటారు. తద్వారా సమాజానికి మేలు జరుగుతుంది. శాంతి భద్రతల సమస్య తగ్గుతుంది. ఇదేదో ఘనతగా కాకుండా సామాజిక బాధ్యతగా చేస్తున్నాను. విద్యార్థుల స్పందన, ఉపాధ్యాయుల ప్రోత్సాహం చెప్పలేనంత సంతృప్తినిస్తోంది.
- దివాకర్ యాదవ్, ఎస్ఐ