సాగు భారమంతా స్త్రీలపైనే!
వ్యవసాయ రంగాన్ని చుట్టుముట్టిన సంక్షోభమే రైతన్నల ఆత్మహత్యలకు, వలసలకు మూలకారణం. బాధిత రైతు కుటుంబాలలో మహిళలే వ్యవసాయాన్ని భుజాన వేసుకోవాల్సిరావడం వల్ల.. సంక్షోభ భారమంతా వారిపైనే పడుతున్నది. మహిళా రైతుల సహకార సంఘాలు ఏర్పాటు చేసి వనరులను అందుబాటులోకి తేవడం తక్షణావసరం.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మహిళలే వెన్నెముక. పంటల సాగు, విత్తనాల సంరక్షణ, పశుపోషణ, పెరటి కోళ్ల పెంపకం, అటవీ ఫలసాయ సేకరణ, చేపల పెంపకం- శుద్ధి, అమ్మకంతోపాటు చేనేత రంగాలతో కూడిన గ్రామీణ ఉత్పత్తి వ్యవస్థలో దళిత, బహుజన, ఆదివాసీ మహిళలే ప్రధాన భూమిక పోషిస్తున్నారు. అయితే, వీరికి ఆయా జీవనోపాధుల్లో నిర్ణయాధికారం, ఆస్తిహక్కులు, ఆదాయంపై నియంత్రణ అనేవి లేవు. పురుషులతో సమానంగా పనిచేసినప్పటికీ సమాన వేతనాలు దక్కటం లేదు.
వ్యవసాయంలో, పశుపోషణలో 60-80 శాతానికి పైగా పనులు చేస్తూ మహిళలు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. మహిళా వ్యవసాయ కూలీల కన్నా మహిళా సాగుదారుల సంఖ్య, వారికన్నా మహిళా భూ యజమానుల సంఖ్య తక్కువగా ఉంది. తాజా గణాంకాల ప్రకారం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 26% భూ కమతాలు మహిళల పేరిట ఉన్నాయి. మొత్తం సాగుదార్లలో మహిళలు తెలంగాణలో 36% ఉంటే.. ఆంధ్రప్రదేశ్లో 30% ఉన్నట్లు 2011 జనాభా గణాంకాలు చెబుతున్నాయి. వ్యవసాయకూలీల్లో తెలంగాణలో 57% మంది, ఆంధ్రప్రదేశ్లో 51% మంది మహిళలున్నారు.
ఇటు ఆత్మహత్యలు.. అటు వలసలు..
1991 తర్వాత అమల్లోకొచ్చిన నూతన ఆర్థిక సంస్కరణలు, వాటి కనుసన్నల్లో రూపొందిన వ్యవసాయ విధానాలు కంపెనీలకు పెద్ద పీట వేసి వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తెచ్చాయి. ఫలితంగా ఈ రంగంలో ప్రభుత్వరంగ పెట్టుబడులు తగ్గిపోయి రైతులకు అంద వలసిన సబ్సిడీలు తగ్గాయి. విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనితో వ్యవసాయంలో ఖర్చులు పెరిగి తగినంత దిగుబడులు రాక, వచ్చినా గిట్టుబాటు ధరలు లేక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చాలా మంది రైతులు వ్యవసాయం వదిలిపోతున్నారు.
వ్యవసాయం నుంచి సరిపడినంత ఆదాయం రాకపోవటంతో చాలా గ్రామాల్లో పురుషులు ఇతర జీవనోపాధులను వెతుక్కుంటూ వలస పోతున్నారు. ఆ కుటుంబాలలో మహిళలే వ్యవసాయాన్ని భుజాన వేసుకుంటున్నారు. దానితో సంక్షోభ భారమంతా వారిపైనే పడుతున్నది. స్త్రీల పేరు మీద భూమి పట్టాలు లేకపోవటం, వారు కౌలు చేస్తూ ఉండటం, వారికి రైతులుగా గుర్తింపు లేకపోవటంతో వారికి ప్రభుత్వం నుంచి అందవలసిన రుణ సదుపాయం కానీ, కరువుభత్యం కానీ అందటం లేదు. అందుకే సంక్షోభ భారం మహిళలపై మరింత అధికంగా ఉంటున్నది. పైగా వారు ఇంటి పని, కుటుంబ పోషణ, పిల్లల పెంపకం వంటి పనులను పురుషులకంటే అదనంగా చేస్తున్నారని గుర్తించాలి.
నిర్ణాయక పాత్రను కోల్పోయిన మహిళలు
వ్యవసాయ రంగంలో మార్కెట్ శక్తుల నియంత్రణ పెరిగింది. మార్కెట్ కోసం(పత్తి లాంటి) వాణిజ్యపంటలు పండించటం ఎప్పుడయితే విపరీతమైందో ఆ తర్వాత.. మహిళలు సంప్రదా యకంగా ఆహార పంటల సాగులో కలిగి ఉన్న జ్ఞానాన్ని, నిర్ణాయక పాత్రను కోల్పోయారు. చాలా వరకు శ్రామికులుగానే మిగిలిపో తున్నారు. వ్యవసాయంలో మహిళలు చేసే పనులన్నీ అత్యధిక శ్రమతో కూడుకున్నవి. నాట్లు వేయటం, కలుపు తీయటం, కోత కోయటం, నూర్చటం, ధాన్యాన్ని శుద్ధి చేయటం వంటి పనులన్నీ రోజంతా వంగబడి చేసే పనులు.
ఇట్లా గంటల తరబడి వంగి పనులు చేయటం వల్ల కాళ్ల నొప్పులు, నడుము నొప్పి, వెన్ను నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనితోపాటు వంగినప్పుడు (నిలబడినప్పటికంటే) తక్కువ ప్రాణవాయువు లభిస్తుంది. కాబట్టి శరీరానికి కావలసిన ప్రాణవాయువు దొరక్క రక్త ప్రసరణ సరిగ్గా జరగదనీ, ముఖ్యంగా ప్రసవ సమయంలో తీవ్రమైన సమస్యలు తలెత్తుతున్నాయని సమాచారం. ప్రభుత్వ విధానాలు, చట్టాలు, పథకాలు మహిళా రైతులకు కొంత వరకు మేలు చేసేవిగా ఉన్నప్పటికీ, వాటి అమల్లో ప్రభుత్వ శాఖల్లో ఉన్న అలసత్వం, సమాజంలో పాతుకుపోయిన పితృస్వామిక విలువల కారణంగా మహిళలకు ప్రయోజనం కలగటం లేదు. కొడుకులతో సమానంగా కూతుళ్లకు వ్యవసాయ భూమిని పంచి ఇవ్వాలనే హిందూ వారసత్వ సవరణ చట్టం అమలు నిరాశాజనకంగా ఉంది.
మహిళా రైతు సహకార సంఘాలతో సత్ఫలితాలు
వ్యవసాయంలో ఆహారోత్పత్తిలో కీలకమైన పాత్ర పోషిస్తున్న మహిళా రైతుల సాధికారత పెంచాలంటే ముందుగా వారికి భూమి హక్కులు కల్పించాలి. ప్రభుత్వ భూ పంపిణీ పథకంలో భాగంగా కొంత వరకు భూమి లేని పేద మహిళలకు భూమి పట్టాలు లభించాయి. రాళ్లూ రప్పలతో నిండి గ్రామాలకు దూరంగా గుట్టల్లో ఉన్న ఆ భూమిని సాగులోకి తెచ్చుకోవలసి రావడం మహిళలకు అధిక భారమే అయింది. వారికి సాగు యోగ్యమైన సారవంతమైన భూములను ఇవ్వాలి. సాగు నీటి వసతికి గ్రామ చెరువుల పునరుద్ధరణ వంటి పరిష్కారాలను వారి భాగస్వామ్యంతో నిర్వహించాలి. గ్రామస్థాయిలో మహిళా రైతుల సహకార సంఘాలు ఏర్పాటు చేసి.. వారికి అవసరమైన విత్తనాలు, ఉత్పాదకాలు, పశుసంపద, రుణ సదుపాయాలు, సమాచారం, వ్యవసాయ పనిముట్లు, పరికరాలు, మార్కెటింగ్ సదుపాయాలు వంటివి అన్నీ ఒకే చోట అందజేయాలి. వ్యవసాయ పనుల్లో మహిళల శారీరక శ్రమను తగ్గించే సాంకేతికతలపై పరిశోధనలు నిర్వహించి, ఆ పరిశోధనా ఫలాలను వారికి అందించాలి.
మహిళా రైతులు సమిష్టిగా సాగు చేసుకుంటూ రసాయనిక పురుగు మందులు లేకుండా వైవిధ్యమైన ఆహార పంటలను పర్యావరణానికి, మనుషులకు, పశువులకు ఆరోగ్యకరమైన విధంగా పండిస్తున్న మంచి ఉదాహరణలు మన రాష్ట్రంలోనే మన కళ్ల ముందు అమల్లో ఉన్నాయి. అటువంటి పంటల సాగును, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహించి వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి బయట పడవేసే విధానాలకు నాంది పలకాలి. ఇప్పటి వినాశకర వ్యవసాయాన్ని కొనసాగించటం ఇక ఎంతోకాలం సాధ్యంకాదు. మహిళా రైతులతోనే మార్పు సాధ్యమవుతుందని గుర్తించాలి.
- ఎస్. ఆశాలత
కన్వీనర్, రైతు స్వరాజ్య వేదిక