Divis labs
-
ఎవరీ నీలిమ మోటపర్తి? ఈమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Divis Laboratories Nilima Motaparti: భారతదేశంలో ఉన్న అత్యంత ధనిక మహిళలో ఒకరైన 'నీలిమ మోటపర్తి' (Nilima Motapatri) గురించి చాలామందికి తెలియకపోవచ్చు. కానీ 'దివిస్ లాబొరేటరీస్' గురించి తప్పకుండా వినే ఉంటారు. ప్రస్తుతం ఈ కంపెనీ బాధ్యతలు చేపడుతూ వరుస లాభాల్లో పయనిస్తున్న నీలిమా గురించి ఇక్కడ తెలుసుకుందాం. దివిస్ లాబొరేటరీస్ సంస్థను స్థాపించిన మురళీ కృష్ణ దివి కుమార్తె నీలిమ మోటపర్తి. ఈమె గ్లాస్లో యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ ఫైనాన్స్‌లో పూర్తి చేసి, ప్రస్తుతం కంపెనీకి సంబంధించిన మెటీరియల్ సోర్సింగ్, ప్రొక్యూర్మెంట్, కార్పొరేట్ ఫైనాన్స్, ఇన్వెస్టర్ రిలేషన్స్ వంటి అన్ని కార్యకలాపాలను చూసుకుంటోంది. 2021లో ఈమె ఆదాయం సుమారు 51 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. (ఇదీ చదవండి: రూ. 1.30 కోట్ల ప్యాకేజీ, నెలకు 20 రోజులు సెలవు - ఇది కదా ఉద్యోగమంటే..!!) నిజానికి దివిస్ లాబొరేటరీస్ స్థాపించిన మురళీ కృష్ణ దివి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. మురళీ కృష్ణ కుటుంబం ఒకప్పుడు తన తండ్రికి వచ్చే పెన్షన్ మీద ఆధారపడి బ్రతికింది. జీవితంలో ఎన్నెన్నో కష్టాలు చూసిన మురళీ కృష్ణ తన 25 సంవత్సరాల వయసులో అమెరికాకు వెళ్లి ఫార్మసిస్ట్‌గా పనిచేశారు. అప్పట్లో తన వద్ద కేవలం 500 రూపాయలు మాత్రమే ఉన్నాయని ఫోర్బ్స్ ఇండియా గతంలో వెల్లడించినట్లు సమాచారం. దివిస్ లాబొరేటరీస్ ఆవిర్భావం.. అమెరికా వెళ్లిన తరువాత నిరంతర శ్రమతో కస్టపడి అతి తక్కువ కాలంలోనే భారతదేశంలో దివీస్ లాబొరేటరీస్ 5.8 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ ధనిక శాస్త్రవేత్తల్లో ఒకరిగా నిలిచారు. దివీస్ లేబొరేటరీస్ 1990లో దివీస్ రీసెర్చ్ సెంటర్‌గా స్థాపించారు, ఆ తరువాత క్రమంగా అభివృద్ధి చెందటం ప్రారంభమైంది. 1994 నాటికి దివిస్ లాబొరేటరీస్ లిమిటెడ్‌గా స్థిరపడింది. (ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి బెల్లం బిజినెస్.. రూ. 2 కోట్ల టర్నోవర్!) తండ్రి స్థాపించిన సంస్థలో నీలిమ మోటపత్రి 2012లో చేరి, అప్పటి నుంచి ఈ కంపెనీ అభివృద్ధికి దోహదపడుతోంది. ఉద్యోగంలో చేరకముందే ఈమెకు మెటీరియల్ రిక్వైర్మెంట్, ఫైనాన్సింగ్ అండ్ ఆసీకాంటింగ్ వంటి వాటిలో సుమారు ఐదు సంవత్సరాల అనుభవం ఉంది. మొత్తం మీద నీలిమా తండ్రికి తగ్గ తనయురాలిగా కంపెనీ బాధ్యతలు చేపట్టి విజయ మార్గంలో పయనిస్తోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలు, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
దివిస్‌లో 5 శాతం దాటిన ఎల్ఐసీ వాటా
న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మా కంపెనీ దివిస్ ల్యాబరేటరీస్‌లో జీవిత బీమా దిగ్గజమైన ఎల్ఐసీ తన వాటాలను పెంచుకుంది. రూ.35.82 కోట్లు పెట్టి అదనపు వాటాలను కొనుగోలు చేసింది. ఒక్కో షేరుకు రూ.3,379 వెచ్చించింది. దీంతో దివిస్ ల్యాబ్‌లో ఎల్ఐసీ వాటాలు 1,32,54,663 నుంచి 1,33,60,663కు పెరిగాయి. నవంబర్ 7న తన వాటా 5 శాతాన్ని మించినట్టు ఎల్ఐసీ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం ఇచ్చింది. లిస్టెడ్ కంపెనీలో ఏదైనా కంపెనీకి వాటా 5 శాతం దాటితే దాన్ని ప్రత్యేకంగా తెలియజేయాలని నిబంధనలు చెబుతున్నాయి. ఫార్మా ఇంటర్ మీడియట్స్, ఏపీఐలు, న్యూట్రాస్యూటికల్స్‌లో దివిస్ దిగ్గజ సంస్థ కావడం గమనార్హం. బుధవారం బీఎస్ఈలో ఎల్ఐసీ షేరు రూ.631 వద్ద ముగియగా, దివిస్ ల్యాబ్ 3.38 శాతం నష్టపోయి రూ.3,298 వద్ద ముగిసింది. -
దివీస్ జూమ్- గ్లెన్ మార్క్ బోర్లా
ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో హెల్త్ కేర్ రంగ దిగ్గజాలు దివీస్ ల్యాబొరేటరీస్, గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ సాధించిన ఫలితాలు ఈ కౌంటర్లపై విభిన్న ప్రభావాన్ని చూపుతున్నాయ. ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో దివీస్ ల్యాబ్స్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించగా.. గ్లెన్ మార్క్ పనితీరు నిరాశపరచింది. దీంతో దివీస్ కౌంటర్ కు డిమాండ్ నెలకొనగా.. గ్లెన్ మార్క్ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. వెరసి దివీస్ షేరు లాభాలతో సందడి చేస్తుంటే.. గ్లెన్ మార్క్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. దివీస్ ల్యాబ్స్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో దివీస్ ల్యాబ్స్ నికర లాభం 45 శాతానికిపైగా జంప్ చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 519.6 కోట్లను తాకింది. నికర అమ్మకాలు సైతం 21 శాతం పెరిగి రూ. 1,749 కోట్లను అధిగమించాయి. క్యూ2లో పన్నుకు ముందు లాభం 42 శాతం ఎగసి రూ. 693 కోట్లను దాటింది. మొత్తం పన్ను వ్యయాలు దాదాపు 33 శాతం అధికంగా రూ. 174 కోట్లకు చేరాయి. ఈ కాలంలో రూ. 16 కోట్లమేర ఫారెక్స్ నష్టాలు నమోదైనట్లు దివీస్ వెల్లడించింది. ప్రస్తుత పెట్టుబడుల వ్యయ ప్రణాళికలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మరో రూ. 400 కోట్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం దివీస్ ల్యాబ్స్ షేరు ఎన్ఎస్ఈలో 4.6 శాతం జంప్ చేసి రూ. 3,386 వద్ద ట్రేడవుతోంది. తొలుత 6 శాతం పురోగమించి రూ. 3,435ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం. గ్లెన్ మార్క్ ఫార్మా ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ నికర లాభం 8.4 శాతం క్షీణించి రూ. 234 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర అమ్మకాలు మాత్రం 5.2 శాతం పెరిగి రూ. 2,908 కోట్లను అధిగమించాయి. క్యూ2లో పన్నుకు ముందు లాభం 2 శాతం నీరసించి రూ. 339 కోట్లను తాకింది. మొత్తం పన్ను వ్యయాలు దాదాపు 33 శాతం అధికంగా రూ. 137 కోట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం దివీస్ ల్యాబ్స్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 486 వద్ద ట్రేడవుతోంది. తొలుత 6.5 శాతం వెనకడుగుతో రూ. 479ను తాకింది. -
దివీస్ లాభం 9 శాతం అప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దివీస్ ల్యాబ్స్ నికర లాభం 9 శాతం పెరిగి రూ. 268 కోట్లకు చేరింది. ఇక ఆదాయం రూ. 860 కోట్ల నుంచి రూ. 976 కోట్లకు పెరిగింది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 మధ్య కాలంలో తమ విశాఖపట్నం ప్లాంట్‌లోని రెండో యూనిట్లో అమెరికా ఎఫ్‌డీఏ తనిఖీలు నిర్వహించినట్లు సంస్థ తెలిపింది. ఎఫ్‌డీఏ సూచనలకు సంబంధించి తాము చేపట్టిన దిద్దుబాటు చర్యలు మొదలైన వాటి గురించి ఇప్పటికే వివరణనిచ్చినట్లు పేర్కొంది. తదుపరి ఎఫ్‌డీఏ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని చెప్పింది. -
ఉద్యోగులకు రూ.80 కోట్ల బంపర్ బొనాంజా
ప్రముఖ ఫార్మా దిగ్గజం దివీస్ ల్యాబరేటరీస్ ఉద్యోగులకు బంపర్ బొనాంజా ప్రకటించింది. దాదాపు రూ.80 కోట్లను ఉద్యోగులు, మరియు శాశ్వత డైరెక్టర్లకు ప్రత్యేక చెల్లింపులు చెల్లించనుంది. 25 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఈ బంపర్ ఆఫర్ ను కంపెనీ ప్రకటించింది. మొత్తం రూ.79 కోట్లను ఒక-సమయం చెల్లింపుగా ఉద్యోగులు, శాశ్వత డైరెక్టర్లకు స్పెషల్ పేమెంట్ కింద లబ్ధి పొందనున్నారు. ఈ మేరకు కంపెనీ బోర్డు శుక్రవారం ఆమోదం తెలిపింది. దీని ప్రభావం సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రతిబింబించనుందని దివీస్ పేర్కొంది. హైదరాబాద్ ఆధారిత ఫార్మా కంపెనీ దివీస్ ల్యాబ్స్ ను1990లో స్థాపించారు. కంపెనీలో ప్రస్తుతం పదివేలకుపైగా ఉద్యోగులున్నారు. కాగా శుక్రవారం దివీస్ మొదటి త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. నికర లాభం 23 శాతం పెరిగి రూ. 302 కోట్లను కోట్లకు పెరిగి మార్కెట్ల అంచనాలకు మించిన ఫలితాలను నమోదు చేసింది. అమ్మకాల్లో 25 శాతం వృద్ధి సాధించి రూ 1,006 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇక నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు 2.68 శాతం దూసుకెళ్లి 37.32 శాతాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో దివీస్ కౌంటర్‌కు భారీ డిమాండ్ ఏర్పడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో దివీస్ ల్యాబ్ షేరు 7 శాతానికి పై గా లాభపడి 52 వారాల గరిష్టాన్ని తాకింది.