జోరుగా నకిలీ నోట్ల చెలామణి
బాన్సువాడ, న్యూస్‌లైన్ :మూడు రాష్ట్రాల ప్రజల రాకపోకలు సాగే బాన్సువాడ ప్రాంతంలో జోరుగా నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయి. రూ. 500, రూ. 1000 నకిలీ నోట్లను యథేచ్ఛగా కొందరు చెలామణి చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ట్రాన్స్‌కో డివిజనల్ అకౌంట్స్ కార్యాలయంలో విద్యుత్ బిల్లు చెల్లించ డానికి వచ్చిన ఒక వినియోగదారుడు నకిలీ రూ. 1000 నోటు ఇవ్వడం, ఉద్యోగి గుర్తించకపోవడం జరిగింది. దీంతో అధికారులు అవాక్కయ్యారు. అలాగే నెల రోజుల క్రితం ఒక జాతీయ బ్యాంకులో రూ.500 నకిలీ నోట్లు వచ్చాయి.
పెట్రోల్ బంకుల్లో, వ్యాపార, వాణిజ్య సముదాయాల్లోనూ నకిలీ నోట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో వ్యాపారులు, అధికారులు హడలెత్తిపోతున్నారు. దీంతో రూ. 1000, రూ. 500 నోట్లను రెండు, మూడు సార్లు పరీక్షించి మరీ తీసుకుంటున్నారు. ఇటీవల లింగంపేట మండలంలో నకిలీ నోట్లను చెలామణి చేస్తూ ఒక వ్యక్తి పట్టుబడడం, అతని ద్వారా లింగంపేటలో ఇద్దరిని, పశ్చిమగోదావరి జిల్లాలో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొన్న విషయం విదితమే.
అయితే లింగంపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రూ. 46లక్షల నకిలీ నోట్లను (రూ.500) దుబాయి నుంచి తీసుకువస్తూ శంషాబాద్ ఏయిర్ పోర్టు వద్ద పట్టుబడగా, అతని అనుచరులు కొందరు అంతకు ముందే రూ. 4 లక్షల వరకు నకిలీ నోట్లను లింగంపేటకు తెచ్చినట్లు సమాచారం. దీంతో అతని అనుచరుల వద్ద ఉన్న నకిలీ నోట్లు బాన్సువాడ ప్రాంతానికి డంప్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఇక్కడ ప్రతిరోజు నకిలీ నోట్లు ప్రత్యక్షమవుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. మహారాష్ట్రలోని దెగ్లూర్, కర్ణాటకలోని ఔరాద్ ప్రాంతాల నుంచి ప్రతిరోజు బాన్సువాడకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు.
బాన్సువాడ, బిచ్కుంద, మద్నూర్, జుక్కల్, పిట్లం ప్రాంతాల్లో జరిగే వారాంతపు సంతల్లో మూడు రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడికి వచ్చి క్రయవిక్రయాలు చేస్తారు. అందుకే ఈ ప్రాంతంలో నకిలీ నోట్లను చెలామణి చేస్తే ఆ నకిలీ నోట్లు ఇతర రాష్ట్రాల్లోకి వెళ్తాయని, దీని వల్ల పోలీసుల విచారణ నుంచి తప్పించుకోవచ్చని నకిలీ నోట్ల సూత్రధారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇక్కడ జోరుగా నకిలీ నోట్లను చెలామణి చేస్తున్నారు. అయితే ఈ నకిలీ నోట్ల ద్వారా మోసపోతున్న వివిధ శాఖల అధికారులు, వ్యాపారులు సమాచారాన్ని పోలీసులకు అందించడం లేదు. పోలీసులకు అందిస్తే విచారణల పేరిట తమను వేధిస్తారనే గుబులుతో నోట్లను కాల్చడం లేదా వాటిని పాతిపెడుతున్నట్లు తెలుస్తోంది.
అధికారులు అప్రమత్తం..
ఇదిలా ఉండగా, నకిలీ నోట్ల చెలామణి పెరగడంతో ఆర్టీసీలో, ట్రాన్స్‌కోలో, బ్యాంకుల్లో అధికారులు నోట్లపై ఇచ్చిన వారి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ట్రాన్స్‌కో అధికారులు రూ. 500, రూ. 1000 నోట్లపై ఏకంగా సర్వీస్ నంబర్‌ను నమోదు చేస్తున్నారు. కొందరు వ్యాపారులు రూ. 500, రూ. 1000 నోట్లను తీసుకోకుండా నిరాకరిస్తున్నారు. నకిలీ నోట్ల చెలామణి వ్యవహారంపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు.
మా దృష్టికి రాలేదు
నకిలీ నోట్ల చెలామణీ వ్యవహారం మా దృష్టికి రాలేదు. మాకు ఆ నోట్లను అందిస్తే విచారణ ప్రారంభిస్తాం. నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న వారిపై నిఘా పెడతాం. నోట్లను గుర్తించిన వెంటనే మాకు సమాచారం అందించాలి.
- భాస్కర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, బాన్సువాడ