d.jagadeesh
-
చంద్రబాబు పాలనకు చరమగీతం పాడుదాం
ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ అనంతపురం రూరల్: ప్రజా సంక్షేమాన్ని విస్మరించి దోచుకోవడమే ధ్యేయంగా పని చేస్తున్న చంద్రబాబు పాలనకు చరమ గీతం పాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ పిలుపు నిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన టీడీపీ సర్కార్ చర్యలను నిరిసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం అనంతపురం తహశీల్దారు కార్యాలయం ముందు ధర్నా ఆపార్టీ నేతలు, కార్యకర్తలు నిర్వహించారు. రూరల్ మండల కార్యదర్శి రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో జగదీష్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో అనేక హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. రూ.2 కే రక్షిత తాగునీరు, ఇంటికో ఉద్యోగం, రూ.5 కే భోజనం అందిస్తామన్న హామీలన్నీ గాలిలో కలిసిపోయాయన్నారు. అనంతపురం రూరల్ మండలంలో ఇళ్ల స్థలాలు, ఎన్టీఆర్ ఇళ్ల కోసం వేలాది మంది నిరుపేదలు ఎదురు చూస్తున్నా...నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి పరిటాల సునీత పట్టించు కోవడం లేదన్నారు. కేవలం తనవారికి లబ్ధి చేకూరే విధంగా వ్యవహరిస్తున్న మంత్రికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం అసన్నమైందన్నారు. సంక్షేమ పథకాలన్నీ అధికార పార్టీ నాయకులకే అందుతున్నాయనీ, అర్హులైన నిరుపేదలంతా కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారన్నారు. రైతు సంఘం నాయకులు మల్లికార్జున, కాటమయ్యలు మాట్లాడుతూ, హంద్రీ నీవా కాలువ నుంచి పీఏబీఆర్ డ్యాంకు 3 టీఎంసీల నీటిని కేటాయించి కుడికాలువ కింద ఉన్న ప్రతి చెరువును పూర్తి స్థాయిలో నింపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్, రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ, రైతు సంఘం నాయకులు కాటమయ్య, కేశవరెడ్డి, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మావతి, చంద్రకళ, రఘురామయ్య, వెంకటనారాయణ, రాప్తాడు కార్యదర్శి నాగరాజు, వన్నారెడ్డి, చియ్యేడు రామకృష్ణ, అప్పిరెడ్డితోపాటు పెద్ద ఎత్తున శ్రేణులు పాల్గొన్నారు. -
24న అసెంబ్లీ ఎదుట ధర్నా
అనంతపురం అర్బన్ : బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన జిల్లా రైతులు అక్కడ అడుక్కుతింటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అఖిలపక్ష నాయకులు ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రభుత్వంపై ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఈ నెల 24న అసెంబ్లీ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని, ఇందులో ప్రతిపక్షం, వామపక్షాలు పాల్గొనాలని కోరారు. శుక్రవారం స్థానిక సిద్ధార్థ పంక్షన్ హాల్లో తరిమెల నాగిరెడ్డి శతజయంతి కమిటీ ఆధ్వర్యంలో సమాలోచన సభ నిర్వహించారు. కమిటీ కన్వీనర్ డి.గోవిందరాజులు అధ్యక్షత వహించారు. ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రజల జీవనం దయనీయంగా మారినా, ప్రభుత్వం పట్టించుకోకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి సాధించామంటూ గొప్పలు చెప్పుకుంటూ ప్రచార ఆర్భాటంతో కాలం గడుపుతోందని విమర్శించారు. అధిక ఆదాయం కోసమే ప్రజలు వలస పోతున్నారని అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు వాదనకు దిగడాన్ని ఆయన తప్పుబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కరువును పారదోలామని ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ మాట్లాడుతూ జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొని రైతులు, కూలీలు జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నా పట్టించుకోని ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం, వామపక్షాలు ఐక్య ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. జిల్లాలో తీవ్ర కరువు నెలకొంటే అధికార యంత్రాంగం వాస్తవాలను కప్పిపుచ్చి తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వానికి అందిస్తోందన్నారు. ఫారం పాండ్ల తవ్వకంతో జిల్లాలో భూగర్భ జలమట్టం పెరిగిందని కలెక్టర్ విశాఖపట్టణంలో ప్రజెంటేషన్ ఇవ్వడం సరికాదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ మాట్లాడుతూ కరువు పరిస్థితులు ఇలాగే కొనసాగితే జిల్లా మొత్తం ఖాళీ అవుతుందన్నారు. గత ఏడాది చేపట్టిన ఉపాధి హామీ పనులకు సంబంధించి రూ.5.27 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. తాగునీటి పథకాల నిర్వహణకు ప్రభుత్వం అరకొరగా నిధులు సమకూర్చిందని మండిపడ్డారు. నీటి పారుదల రంగం నిపుణుడు పాణ్యం సుబ్రమణ్యం మాట్లాడుతూ జిల్లాలో కరువు పరిస్థితులను అధిగమించేందుకు కనీసం 10 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించాలన్నారు. జిల్లాకు వంద టీఎంసీల నీరు కేటాయించాలన్నారు. సమావేశంలో తరిమెల నాగిరెడ్డి శత జయంతి కమిటీ సభ్యులు తరిమెల శరత్ చంద్రారెడ్డి, కదలిక ఎడిటర్ ఇమాం, నాయకులు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కేవీ రమణ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్, సలీమ్ మాలిక్, రైతు సంఘం నాయకులు మల్లికార్జున, కాటమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బి.కేశవరెడ్డి, టి.నారాయణస్వామి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ కల్పించాలి
హిందూపురం అర్బన్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కులాల వారికి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని సామాజిక హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ డి.జగదీష్ అన్నారు. గురువారం స్థానిక ఐఎంఏ హాలులో వివిధ కులసంఘాల నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 85 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు అనుగుణంగా రిజర్వేషన్లు లేకపోవడంతో 15 శాతం ఉన్న అగ్రకులాల వారే 50 శాతం ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించకోవడంతో ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా సామాజిక హక్కుల వేదిక శంఖారావం పూరించిందన్నారు. ఈమేరకు జనవరి 26న మొదలైన బస్సు యాత్ర మార్చి 4న హిందూపురం, 7న అనంతపురంలో బహిరంగ సభతో ముగుస్తుందన్నారు. వేదిక కార్యనిర్వాహక కార్యదర్శి జాఫర్, కురుబ సంఘం రాయలసీమ అధ్యక్షుడు బోరంపల్లి ఆంజినేయులు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, సీపీఐ డివిజన్ కార్యదర్శి సురేష్, వాల్మీకి సంఘంఅధ్యక్షుడు వెంకటచలపతి, సాధుశెట్టి సంఘం అధ్యక్షుడు వెంకటస్వామి, ఎమ్మార్పీఎస్, వివిధ కులసంఘాల నాయకులు పాల్గొన్నారు.