జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ కల్పించాలి
హిందూపురం అర్బన్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కులాల వారికి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని సామాజిక హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ డి.జగదీష్ అన్నారు. గురువారం స్థానిక ఐఎంఏ హాలులో వివిధ కులసంఘాల నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 85 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు అనుగుణంగా రిజర్వేషన్లు లేకపోవడంతో 15 శాతం ఉన్న అగ్రకులాల వారే 50 శాతం ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించకోవడంతో ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా సామాజిక హక్కుల వేదిక శంఖారావం పూరించిందన్నారు.
ఈమేరకు జనవరి 26న మొదలైన బస్సు యాత్ర మార్చి 4న హిందూపురం, 7న అనంతపురంలో బహిరంగ సభతో ముగుస్తుందన్నారు. వేదిక కార్యనిర్వాహక కార్యదర్శి జాఫర్, కురుబ సంఘం రాయలసీమ అధ్యక్షుడు బోరంపల్లి ఆంజినేయులు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, సీపీఐ డివిజన్ కార్యదర్శి సురేష్, వాల్మీకి సంఘంఅధ్యక్షుడు వెంకటచలపతి, సాధుశెట్టి సంఘం అధ్యక్షుడు వెంకటస్వామి, ఎమ్మార్పీఎస్, వివిధ కులసంఘాల నాయకులు పాల్గొన్నారు.