చంద్రబాబు పాలనకు చరమగీతం పాడుదాం
ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్
అనంతపురం రూరల్: ప్రజా సంక్షేమాన్ని విస్మరించి దోచుకోవడమే ధ్యేయంగా పని చేస్తున్న చంద్రబాబు పాలనకు చరమ గీతం పాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ పిలుపు నిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన టీడీపీ సర్కార్ చర్యలను నిరిసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం అనంతపురం తహశీల్దారు కార్యాలయం ముందు ధర్నా ఆపార్టీ నేతలు, కార్యకర్తలు నిర్వహించారు. రూరల్ మండల కార్యదర్శి రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో జగదీష్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో అనేక హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. రూ.2 కే రక్షిత తాగునీరు, ఇంటికో ఉద్యోగం, రూ.5 కే భోజనం అందిస్తామన్న హామీలన్నీ గాలిలో కలిసిపోయాయన్నారు.
అనంతపురం రూరల్ మండలంలో ఇళ్ల స్థలాలు, ఎన్‌టీఆర్ ఇళ్ల కోసం వేలాది మంది నిరుపేదలు ఎదురు చూస్తున్నా...నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి పరిటాల సునీత పట్టించు కోవడం లేదన్నారు. కేవలం తనవారికి లబ్ధి చేకూరే విధంగా వ్యవహరిస్తున్న మంత్రికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం అసన్నమైందన్నారు. సంక్షేమ పథకాలన్నీ అధికార పార్టీ నాయకులకే అందుతున్నాయనీ, అర్హులైన నిరుపేదలంతా కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారన్నారు. రైతు సంఘం నాయకులు మల్లికార్జున, కాటమయ్యలు మాట్లాడుతూ, హంద్రీ నీవా కాలువ నుంచి పీఏబీఆర్ డ్యాంకు 3 టీఎంసీల నీటిని కేటాయించి కుడికాలువ కింద ఉన్న ప్రతి చెరువును పూర్తి స్థాయిలో నింపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్, రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ, రైతు సంఘం నాయకులు కాటమయ్య, కేశవరెడ్డి, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మావతి, చంద్రకళ, రఘురామయ్య, వెంకటనారాయణ, రాప్తాడు కార్యదర్శి నాగరాజు, వన్నారెడ్డి, చియ్యేడు రామకృష్ణ, అప్పిరెడ్డితోపాటు పెద్ద ఎత్తున శ్రేణులు పాల్గొన్నారు.