విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
మహబూబాబాద్ రూరల్: సీపీఐ(ఎంఎల్)చండ్ర పుల్లారెడ్డి(సీపీ) బాట దళనాయకుడు షేర్ మధు అలియాస్ రమాకాంత్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. గూడూరు, కొత్తగూడ ఎస్సైలు గూడూరు మండలం భూపతిపేట, కొత్తగూడ రోడ్డుపై ఉదయం 8 గంటల ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా బస్సులో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి కనిపించాడు. అతడు బస్సు దిగి భూపతిపేట అడవి వైపు పారిపోతుండగా వెంబడించి పట్టుకొని విచారించగా అతడు ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన షేర్ మధు అలియాస్ రమాకాంత్‌గా తేలింది. పోలీసులు అతడి వద్ద నుంచి 12 బోర్‌తుపాకీ, 25 రౌండ్లను స్వాధీనం చేసుకున్నారు.
గోపన్న మాటలకు ఆకర్షితుడై దళంలోకి..
షేర్ మధు 2006లో న్యూడెమోక్రసీ దళ నేత గోపన్న మాటలకు ప్రభావితమై అతడి దళంలో చేరి 2012 వరకు కొనసాగాడు. అనంతరం గోపన్న దళంతో బేధాభిప్రాయాలు వచ్చి ఆవునూరి మధు దళంలోకి వెళ్లాడు. 2016 సెప్టెంబర్‌లో గంగారం మండలం పెద్దఎల్లాపూర్‌కు చెందిన బోయిని ఓంప్రకాశ్‌తో అతడికి పరిచయం ఏర్పడింది. అతడు మధును సీపీబాట పార్టీలో చేరమని కోరగా అందులో చేరాడు. సీపీఐ(ఎంఎల్) జనశక్తి మాజీ కేంద్ర కమిటీ కార్యదర్శి కూర రాజన్న ఆదేశాల మేరకు సీపీబాట దళం కార్యకలాపాలను ప్రారంభించారు. ఆయన ఆదేశాల మేరకు దళాలు వ్యాపారస్తులను, కాంట్రాక్టర్లను పార్టీ చందాల పేరు చెప్పి బెదిరించి వసూలు చేసేవారు.
టేకులపల్లి ఎన్‌కౌంటర్‌తో చెల్లాచెదురు..
డిసెంబర్ 14న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగి తొమ్మిది మంది చనిపోవడంతో మిగతా సభ్యులు భయంతో అక్కడి నుంచి చెల్లాచెదురయ్యారు. ఎన్‌కౌంటర్ గురించి తెలియగానే మధు తన వద్ద ఉన్న బోరు తుపాకీ, 25 రౌండ్లను గూడూరు అటవీ ప్రాం తంలో దాచి నర్సంపేటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే పోలీసులకు చిక్కాడు.
షేర్ మధుపై హత్య, బెదిరింపు కేసులు..
షేర్ మధుపై గూడూరు మండలం బొద్దుగొండ చిల్లగండి తండావద్ద జరిగిన ఇద్దరిని చంపిన కేసు, ఖానాపురం మండలం బుధరావుపేటలో నకిలీ తుపాకీతో కొమ్మినేని సోమయ్య అనే వ్యక్తిని బెదిరించిన కేసు, ఇదే గ్రామంలో పసునూరి అనూష అనే అమ్మాయిని మోసం చేసిన కేసులు ఉన్నాయి. షేర్ మధును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ రావుల గిరిధర్, డీఎస్పీ ఆంగోత్ నరేష్‌కుమార్, గూడూరు, మహబూబాబాద్ టౌన్ సీఐలు బానోత్ రమేష్, షేక్ అబ్దుల్ జబ్బార్, ఎస్సైలు సతీష్, యాసిన్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment