ఎమ్మెల్యే డీకే అరుణ భర్తకు గాయాలు
మరికల్ మండలం జక్లేర్ వద్ద ఎదురెదురుగా రెండు కార్లు ఢీ
- ఆ కార్లలో ఒకదానిని ఢీకొట్టిన భరతసింహారెడ్డికారు..
- బెలూన్లు తెరుచుకోవడంతో తప్పిన ప్రాణాపాయం
- మొత్తం ఏడుగురికి గాయాలు
మహబూబ్‌నగర్ క్రైం/మరికల్: గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ భర్త భరత్‌సింహారెడ్డి బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారులో బెలూన్లు సకాలంలో తెరుచుకోవడంతో ప్రాణా పాయం తప్పినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అప్పటికే రెండు కార్లు ఢీ కొనగా, భరతసింహా రెడ్డి ప్రమాణిస్తున్న కారు అందులో ఓ కారును ఢీ కొంది. దీంతో ఆయన ప్రయాణిస్తున్న కారు పూర్తిగా ధ్వంసం కాగా, భరతసింహారెడ్డి ఎడ మ చేతికి గాయమైంది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి.
ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండలం ఎలిగండ్ల స్టేజీ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగింది. హైదరాబాద్ బల్కంపేటకు చెందిన అనురాగ్, మనుశ్రీతోపాటు వారి డ్రైవర్ యాదగిరిలు కర్ణాటక రాష్ట్రం రాయిచూర్‌లో మనుశ్రీ ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్స రం ఫీజు చెల్లించి తిరిగి ఏపీ 09 సీఎం 1181 నంబరు కారులో హైదరాబాద్ వెళ్తున్నారు. మిర్యాలగూడకు చెందిన సబిత ఆమె డ్రైవర్ మిర్యాలగూడ నుంచి రాయిచూర్ కు టీఎస్ 09 ఈఎన్ 4347 కారులో వెళ్తున్నారు. మరికల్ మండలం ఎలిగండ్ల సమీపంలోకి రాగానే ఈ రెండు కార్లు అతివేగంగా ఎదురెదురుగా ఢీకొ న్నాయి. దీంతో టీఎస్09 ఈఎస్4347 కారు పక్కనే ఉన్న గుంతలోకి దూసుకుపోయింది.
మక్తల్ మండలం జక్లెర్లో ఓ బంధువు అంత్యక్రియలకు వెళ్లిన భరత్‌సింహారెడ్డి కారులో తిరిగి గద్వాలకు వెళ్తుండగా ఎలిగండ్ల స్టేజీ సమీపంలో అప్పటికే ప్రమాదానికి గురైన ఏపీ 09 సీఏం 1181 కారును ఢీకొట్టి పంటపొలా ల్లోకి దూసుకుపోయింది. దీంతో భరత్ సింహా రెడ్డికి ఎడమ చెయ్యి, డ్రైవర్ భాస్కర్‌కు కుడి చెయ్యికి గాయాలయ్యాయి. వీరిద్దరిని చికిత్స కోసం ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా ఏపీ 09సీఏం1181కారులో ఉన్న అనురాగ్, మనుశ్రీ, యాదగిరిలకు గాయాలు కావడంతో జనరల్ ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న ఇద్దరినీ ఎస్వీఎస్కు తరలించారు.