dlf land deal
-
భారీ విస్తరణ దిశలో రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్!
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ భారీ విస్తరణ దిశగా అడుగులేస్తోంది. నూతన మాల్స్ ఏర్పాటు ద్వారా రిటైల్ విభాగాన్ని అయిదేళ్లలో రెండింతలకు చేయాలని లక్ష్యంగా చేసుకుంది. రిటైల్ రంగంలో ప్రస్తుతం సంస్థ ఖాతాలో 42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 8 మాల్స్, షాపింగ్ సెంటర్స్ ఉన్నాయి. 30 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని విభాగాల్లో కలిపి 150కిపైగా ప్రాజెక్టులను సంస్థ ఇప్పటికే పూర్తి చేసింది. అద్దె కింద 4 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. 21.5 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో గృహ, వాణిజ్య భవనాల నిర్మాణానికి అవసరరమైన స్థలం కంపెనీ చేతిలో ఉంది. గృహ, కార్యాలయ ప్రాజెక్టులను సైతం కొత్తగా అభివృద్ధి చేస్తామని డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ వాటాదార్లకు ఇచ్చిన సందేశంలో వెల్లడించారు. ‘ఆఫీస్, మాల్స్ అద్దె వ్యాపారం క్రమంగా సాధారణ స్థితికి వస్తోంది. షాపింగ్ మాల్స్‌లో కస్టమర్ల రాక మహమ్మారి పూర్వ స్థాయికి స్థిరంగా చేరుతోంది’ అని వివరించారు. కాగా, నూతన బుకింగ్స్ 2021–22లో రెండింతలై రూ.7,273 కోట్లు నమోదైంది. గురుగ్రామ్, గోవాలో రెండు షాపింగ్ మాల్స్ నిర్మాణానికి రూ.2,000 కోట్లు పెట్టుబడి చేస్తున్నట్టు కంపెనీ ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది. -
ఫేస్బుక్లో వాద్రా సంచలన వ్యాఖ్యలు
ఆయనకు పదవులు అంటూ ఏమీ లేవు.. కానీ ఉన్న గుర్తింపు మాత్రం తక్కువది కాదు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు. అవును.. ఆయనే రాబర్ట్ వాద్రా. ఆయనగారి మీద లెక్కలేనన్ని ఆరోపణలున్నాయి. భూముల విషయంలో అక్రమాలు చేశారన్న ఆరోపణలపై వాద్రామీద ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అయితే.. ఈ వ్యవహారంపై రాబర్ట్ వాద్రా ఫేస్బుక్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఎప్పుడూ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటారని, ప్రభుత్వాలు తన విషయంలో ఏమీ రుజువు చేయలేవని అన్నారు. ‘‘ఆధారాలు లేకుండా వాళ్లు ఏమీ రుజువు చేయలేరు. దాదాపు దశాబ్దం నుంచి ప్రభుత్వాలు నాపై తప్పుడు, నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి’’ అని వాద్రా తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. హర్యానాలో డీఎల్ఎఫ్ సంస్థకు, వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థకు మధ్య జరిగిన భూములఘొప్పందాలపై జస్టిస్ ఎస్ఎన్ ఢింగ్రా కమిషన్ విచారణ పూర్తిచేసిన ఒకరోజు తర్వాత ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జస్టిస్ ఢింగ్రా కమిషన్ విచారణ సమయంలో వాద్రాను మాత్రం తమ ముందుకు పిలవలేదు. కమర్షియల్ లైసెన్సుల మంజూరుకు సంబంధించిన 250 ఫైళ్లను పరిశీలించింది. 26 మంది ప్రభుత్వాధికారులను విచారించింది. 2014 హర్యానా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు వాద్రా భూ అక్రమాలపై బీజేపీ మండిపడింది. 2015 మే నెలలో హర్యానా ప్రభుత్వం జస్టిస్ ఢింగ్రా కమిషన్‌ను ఈ అక్రమాలపై విచారణకు నియమించింది.